అమెరికాలో ‘చచ్చేవరకు ఉండే జబ్బు’ | America Gun Culture Why This Genocide | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఈ హత్యాకాండలెందుకు?

Published Fri, Aug 9 2019 12:39 PM | Last Updated on Fri, Aug 9 2019 1:05 PM

America Gun Culture Why This Genocide - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలోని ఎల్‌పాసో, ఒహాయో రాష్ట్రంలోని డేటన్‌ నగరాల్లో ఆగస్టు మూడు, నాలుగు తేదీల్లో జరిగిన సామూహిక జన హనన కాండలో దాదాపు 30 మంది అమాయకులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఒకటి వాల్‌ మార్ట్‌ మాల్‌లో జరగ్గా, మరొకటి నైట్‌ బార్‌ వద్ద జరిగింది. రెండు సంఘటనల్లోనూ హంతకులను పోలీసులు అక్కడికక్కడే కాల్చి చంపివేశారు. మొదటి హత్యాకాండలో ఓ తెల్ల జాతీయుడు శ్వేత జాత్యాహంకారంతో ఈ సామూహిక జన హననానికి పాల్పడగా,  రెండో సంఘటనలో పాఠశాలలో అవమానానికి గురైన ఓ విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇలాంటి వారికి డానిష్‌ తత్వవేత్త ‘సిక్‌నెస్‌ అన్‌టుడెత్‌ (చచ్చేవరకు ఉండే జబ్బు)’ జబ్బందని పిలుస్తున్నారు. 

చదవండి: అగ్రరాజ్యంలో కాల్పుల అలజడి

ఇలాంటి సామూహిక జన హననం అమెరికాకు కొత్త కాదు. స్కూళ్లలో, క్లబ్బుల్లో, పబ్బుల్లో, బార్లలో, బీచుల్లో, చర్చీల్లో తరచుగా జరుగుతూనే ఉన్నాయి. డల్లాస్‌లో మైక్‌ జాన్సన్, ఓర్లాండోలో ఒమర్‌ మెటీన్‌ ఇలాంటి హత్యాకాండలకే పాల్పడ్డారు. ఎప్పుడు , ఎక్కడా జనం ఎక్కువగా గుంపులు, గుంపులుగా ఉంటారో వాటినే లక్ష్యంగా చేసుకుని ఈ హంతకులు ఇలాంటి  మారణకాండలకు పాల్పడుతున్నారు. వీలైనంత ఎక్కువ మందిని చంపాలనే కసితోనో, ఆక్రోశంతోనో వారీ లక్ష్యాలను ఎంచుకుంటున్నారు. ఇంటర్నెట్, సోషల్‌ మీడియా, వీడియో గేమ్స్‌కు అలవాటు పడ్డ యువతనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవలి సంఘటనలపై వ్యాఖ్యానించి చేతులు దులుపుకున్నారు. ఇది కొంత వరకే నిజం. సమాజంలో ఒంటరి వాళ్లుగా భావిస్తున్న వాళ్లు వీడియో గేమ్‌లకో, సోషల్‌ మీడియాలకో బానిసలై జీవితం పట్ల అసంతప్తితోనో, అసహనంతోనో ఇలాంటి దాడులకు పాల్పడుతుండవచ్చు. సహజంగానే వీరిని మానసిక రోగులని, సైకోలని పిలుస్తున్నాం. వీరిలో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటుండగా, కొంతమంది లక్ష్యరహిత ప్రతీకారం కోసం ఇలా జన హననానికి పాల్పడుతున్నారు. అసలు వారు సైకోలుగా ఎందుకు తయారవుతున్నారు ? అందుకు దారితీస్తున్న సామాజిక పరిస్థితులేమిటీ?

సామాజిక, మానసిక శాస్త్రవేత్తల ప్రకారం సమాజంలో ప్రతి వ్యక్తి తన కాళ్లమీద నిలబడే గౌరవప్రదమైన జీవితాన్ని, అందుకు సరిపడే హోదాను కోరుకుంటారు. సమాజంతోపాటు చేస్తున్న వృత్తిలోనూ రాణించాలనుకుంటారు. మరికొందరు నలుగురితో సమానంగా కాకుండా  నలుగురిలో ఒకరుగా గుర్తింపు పొందాలనుకుంటారు. లక్షలు లక్షలు సంపాదించే విలాస జీవితాన్ని కోరుకుంటారు మరికొందరు. వారంతా అందుకు సమాజంలో పోటీ పడాల్సి వస్తోంది. అందుకు వారి వారి జీవితాల్లో ఒడిదుడుకులు తప్పవు. తోటివారితో పోటీ పడలేక జీవితంలో ఓడిపోయిన వాళ్లు, చేతకాని వాళ్లులాగా మిగిలిపోతున్న వాళ్లు, నా అని పలకరించే వాళ్లు లేక లోలోన నలిగిపోతున్న వాళ్లు, మానసికంగా కుమిలిపోతున్న వాళ్లు, ఒత్తిళ్లుకు గురవుతున్న వాళ్లు, అనవసరపు ఆక్రోశం, ఆవేశంతో రగిలిపోతున్నవాళ్లు మొత్తం సమాజం మీదనే కోపం పెంచుకుని సైకోలుగా తయారవుతున్నారు. కొందరు విద్యార్థి దశలోనే మానసిక ఒత్తిడి తట్టుకోలేక సైకోలుగా మారుతున్నారు. వ్యక్తుల సామాజిక పరిస్థితులనుబట్టి వారిలో మానసిక ఒత్తిడుల హెచ్చు తగ్గులు ఉంటాయి. ప్రేమానురాగాలకు ఆస్కారం ఉన్న చోట ఇలాంటి ఒత్తిడులు తక్కువగా ఉంటాయి. 

ఎవరికి వారే యమునా తీరే! అన్న చందంగా బతికే అమెరికాలాంటి సమాజంలో సైకోలు సులువుగా తయారవుతారు, తయారవుతున్నారు. ప్రపంచంలోని జాతులన్నీ అక్కడే ఉంటాయి. తమ ఉద్యోగాలను, తమ జీతాలను తన్నుకుపోతున్నారంటూ పరస్పర అపోహల్లో వాళ్లు బతుకుతుంటారు. ఇటీవల అక్కడ శ్వేత జాత్యాహంకారం పెచ్చరిల్లడానికి అదే కారణం. వారి దాడుల్లో ఎక్కువ మంది మరణించడానికి కారణం ‘223 కాలిబర్‌ అసాల్ట్‌ రైఫిల్‌’ లాంటి మారణాయుధాలను వారు ఉపయోగంచడం, అవి వారికి సులువుగా అందుబాటులో ఉండడం. ఎల్‌ పాసోలో శ్వేతజాత్యాహంకారి ఉపయోగించిన రైఫిల్‌ ఇదే. దాన్ని అతడు టెక్సాస్‌ నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా స్థానిక తుపాకుల షాపు నుంచి సులువుగా కొనుగోలు చేశాడు. తుపాకీల లైసెన్స్‌ చట్టాలను కఠినతరం చేయాలని, సామూహిక హననానికి ఉపయోగపడే తుపాకుల కొనుగోళ్లపై పూర్తిగా నిషేధం విధించాలని ఎప్పటి నుంచే అమెరికాలో చర్చోప చర్చలు కొనసాగుతున్నాయి. నిషేధం కన్నా నియంత్రనే మంచిదని సూచిస్తున్నవాళ్లు ఉన్నారు. బరాక్‌ ఒబామా హయాంలో తుపాకుల అమ్మకాలపై కొంత నియంత్రణ తీసుకొచ్చారు. జాత్యాహంకారం పెరుగుతున్న నేటి ట్రంప్‌ హయాంలో ఈ నియంత్రణ మరింత అవసరం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement