Texas shooting
-
తప్పు చేశాం.. టెక్సాస్ నరమేధంపై పోలీసుల ప్రకటన
టెక్సాస్ యువాల్డే రాబ్ ఎలిమెంటరీ స్కూల్ మారణహోమంపై టెక్సాస్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. సుమారు గంటపాటు ఆగిన తర్వాత లోపలికి ప్రేవేశించడాన్ని తప్పుడు నిర్ణయంగా పేర్కొంటూ క్షమాపణలు తెలియజేశారు. టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ హెడ్ స్టీవెన్ మాక్క్రా ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన చేశారు. టెక్సాస్ స్కూల్ కాల్పుల ఘటన సమయంలో.. సుమారు గంటపాటు వేచిచూసే ధోరణి అనేది తప్పుడు నిర్ణయంగా అభివర్ణించారు ఆయన. ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయం ఘోరానికి కారణమైందని పేర్కొన్నారు ఆయన. దుండగున్ని కాల్పులు జరపకుండా కాసేపు నిలువరించగలిగినా సరిపోయి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఘటన సమయంలో త్వరగా స్పందించి ఉండాలని మీరైతే ఎలా అనుకుంటున్నారో.. మేమూ అదే అనుకుంటున్నాం. ఒకవేళ అదే గనుక నష్టనివారణ మార్గం అనుకుంటే.. నేను మీకు క్షమాపణలు చెప్తున్నా.. అంటూ మీడియా సాక్షిగా బాధిత కుటుంబాలకు ఆయన క్షమాపణలు తెలియజేశాడు. టీచర్లతో పాటు కొందరు పిల్లలు కూడా 911 కి ఫోన్ చేసి సాయం కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లల్ని రక్షించే అవకాశాలు ఉన్నా సకాలంలో పోలీసులు స్పందించలేదని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. మంగళవారం రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో నరమేధం సృష్టించిన సాల్వడోర్ రామోస్(18)ను మట్టుపెట్టడానికి.. ఒక గంట సమయం పట్టింది. ఆ సమయంలో కొందరు పోలీసులు బయట ఉండగా.. పేరెంట్స్ దూసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. ఉదయం 11.30 గం. ప్రాంతంలో సాల్వడోర్ స్కూల్లోకి ప్రవేశించగా.. సుమారు 48 నిమిషాలపాటు కాల్పులు కొనసాగాయి. అయితే మధ్యాహ్నం 12.50 గం. ప్రాంతంలో యూఎస్ బార్డర్ పాట్రోల్ ఏజెంట్లు తలుపులు బద్ధలు కొట్టి కాల్చి చంపారు. చదవండి: ఆ చిన్నారి ఒంటికి రక్తాన్ని పూసుకుని బతికి బయటపడింది -
భయంలోనూ సమయస్ఫూర్తి.. రక్తాన్ని పూసుకుని శవంలా నటించి..
ప్రాణాలు పోతున్నా.. తుపాకీ ఘటనలకు అడ్డుకట్ట వేయడంలో అగ్రరాజ్యం ఘోరంగా విఫలమవుతోంది. టెక్సాస్ స్కూల్ కాల్పుల ఘటనపై బైడెన్ ప్రభుత్వాన్ని విమర్శించని వాళ్లంటూ లేరు ఇప్పుడు. చనిపోయిన పిల్లలు, టీచర్ల కుటుంబాల వ్యథ ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. ‘‘మీకు దణ్ణం పెడతాం. ఏదో ఒకటి చేయండి. చనిపోయిన ఈ పిల్లల్ని గుర్తుపెట్టుకుని.. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడండి. నా మనవరాలు చిన్నపిల్ల. అలాంటి ప్రాణాలు మరిన్ని పోకుండా చూడండి. దయచేసి చర్యలు తీసుకోండి’’ అని కన్నీళ్లతో బతిమాలుతోంది 63 ఏళ్ల ఓ బామ్మ. ఆమె పదేళ్ల మనవరాలు అమెరీ గార్జా.. కాల్పుల ఘటనలో కన్నుమూసింది. ఇదిలా ఉంటే.. 11 ఏళ్ల వయసున్న మియా సెర్రిల్లో కాల్పుల ఘటన నుంచి ప్రాణాలతో బయటపడింది. సమయస్ఫూర్తితో ఆమె వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో కాల్పుల సమయంలో మియా.. ఓ స్నేహితురాలు పూర్తిగా రక్తపుమడుగులో పడి ఉండడం గమనించింది. వెంటనే ఆ రక్తం తన ఒంటికి, బట్టలకు రాసుకుని చనిపోయినట్లు నటించింది. ఇంతలో తుపాకీతో వచ్చిన దుండగుడు.. ఆమె శరీరాన్ని తన్నుకుంటూ పరీక్ష చేసి వెళ్లిపోయాడట. అంతేకాదు.. అలా నటించే ముందు చనిపోయిన తన టీచర్ దగ్గరి నుంచి ఫోన్ తీసుకుని.. 911 ఎమర్జెన్సీ నెంబర్‌కు సాయం కోసం ఫోన్ చేసినట్లు వెల్లడించింది. కాల్పులు జరిపిన వ్యక్తి తన దగ్గరకు వచ్చినప్పుడు.. తనను కూడా కాలుస్తాడని భయపడిపోయిందట!. అయితే దాడిలో బుల్లెట్ శకలాలతో స్వల్పంగా గాయపడిన ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకున్నా.. దాడి భయం మాత్రం ఆమెలో ఇంకా పోలేదు. ఇదిలా ఉంటే 19 మందిని పొట్టనబెట్టుకున్న 18 ఏళ్ల సాల్వడోర్ రామోస్‌ను మట్టుపెట్టేందుకు గంటకు పైగా సమయం తీసుకున్నారు. దీంతో టెక్సాస్ పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: నరమేధాలకు కారణం వాళ్లేనా? -
రిపబ్లికన్లే అడ్డంకి
ముక్కుపచ్చలారని పసిమొగ్గలు రక్తమోడుతున్నారు. చదువులమ్మ చెట్టు నీడలోనే వారికి నూరేళ్లూ నిండిపోతున్నాయి. పదేళ్ల క్రితం శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూలు నుంచి నిన్నటి టెక్సాస్ ఘటన వరకు బడిలో తుపాకుల శబ్దం గుండెల్లో దడ పుట్టిస్తోంది. అగ్రరాజ్యంలో తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలు ఎందుకు రాలేకపోతున్నాయి ? సాటి మనుషుల ప్రాణాల కంటే మర తుపాకీలే అమెరికన్లకు ఎక్కువా? ఇప్పుడిదే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. నిత్యం ఎక్కడో చోట కాల్పుల ఘటనలు జరుగుతున్నా, పాఠశాలల్లోకి దుండగులు చొరబడి అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను తీస్తున్నప్పటికీ అగ్రరాజ్యం తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలను తీసుకురావడంలో విఫలమవుతోంది. దీనికి ప్రధానంగా సాంస్కృతికపరమైన, రాజకీయప రమైన కారణాలను చెప్పుకోవచ్చు. మితిమీరిన వ్యక్తి స్వేచ్ఛతో తుపాకీ ఉండడం తమ హక్కు అని 74% మంది అమెరికన్లు భావిస్తారని ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో వెల్లడైంది. వ్యక్తిగత భద్రత కోసం తుపాకీ ఉండాలని 26% మంది అమెరికన్లు భావిస్తారు. ప్రైవేట్ వ్యక్తులు తుపాకులు కలిగిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో జనాభా కంటే ఆయుధాల సంఖ్యే ఎక్కువగా ఉండడం ఆందోళనకరంగా మారింది. దేశంలో ప్రతి 100 మంది జనాభాకు 120 తుపాకులు ఉన్నాయి. అంటే సగటున ప్రతి ఒక్కరి దగ్గర తుపాకీ ఉన్నట్టే. 2020 నాటికి అగ్రరాజ్యం జనాభా 33 కోట్లు ఉంటే, ఆ దేశ ప్రజల దగ్గర 40 కోట్ల ఆయుధాలున్నాయి. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోవడానికి రాజకీయ ఏకాభిప్రాయం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తుపాకీ నియంత్రణ చట్టాలను కఠినతరం చేయాలని ఇప్పుడిప్పుడే సాధారణ ప్రజలు స్వరం పెంచుతున్నప్పటికీ డెమొక్రట్లు, రిపబ్లికన్ల మధ్య విధానపరంగా విభేదాలున్నాయి. 2012 సంవత్సరంలో కనెక్టికట్‌లోని న్యూటౌన్‌లో శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూలులో తుపాకీ గుళ్లకి 20 మంది చిన్నారులు బలయ్యాక 13 రాష్ట్రాలు తుపాకుల విక్రయంలో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. అవన్నీ డెమొక్రట్ల పాలనలో ఉన్న రాష్ట్రాలే. అదే సమయంలో రిపబ్లికన్ల అధీనంలో ఉన్న 14 రాష్ట్రాల్లో ప్రజలు కూరగాయలు కొన్నంత సులుభంగా తుపాకులు కొనే వెసులుబాటు ఉంది. ప్రజలు తమ ప్రాణ రక్షణ కోసం తుపాకులు తమ వెంట ఉంచుకోవచ్చునని మొదట్నుంచీ రిపబ్లికన్ల వాదనగా ఉంది. అమెరికా రాజ్యాంగంలోని రెండో సవరణ ప్రకారం ‘‘ఆయుధాలు దగ్గర ఉంచుకోవడం ప్రజల హక్కు. రాష్ట్రాల భద్రత కోసం పౌర సైన్యం అత్యంత అవసరం. ఈ నియమాలను ఉల్లంఘించకూడదు’’ అని చెబుతోంది. తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలు ఉండాలన్న డిమాండ్లు వచ్చిన ప్రతీసారి రిపబ్లికన్లు రాజ్యాంగ సవరణని గుర్తుచేస్తూ ప్రజల హక్కులు కాలరాయొద్దని గళమెత్తుతున్నారు. అమెరికాలో తుపాకుల నియంత్రణ చట్టాలను నేషనల్ రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏ) సమర్థంగా అడ్డుకుంటూ ఉండడంతో విచ్చలవిడిగా తుపాకులు అందుబాటులోకి వస్తున్నాయి. తుపాకులపై నిషేధం విధిస్తే అమెరికన్లకు రక్షణ ఉండదని, గన్ ఫ్రీ స్కూలు జోన్స్ వల్ల ఎక్కువ ప్రమాదాలు ముంచుకొస్తున్నాయని ఎన్ఆర్ఏ సీఈవో వేన్ లాపీరే అభిప్రాయపడ్డారు. ఎన్ఆర్ఏ సభ్యుల్లో 77% రిపబ్లికన్లే కావడం గమనార్హం. మానసిక వ్యాధికి మందు వేయాలని వాదనలు తుపాకుల నియంత్రణ చట్టాలను విమర్శించేవారు కాల్పులకు పాల్పడినవారంతా ఏదో ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నవారేనని వాదిస్తున్నారు. కాల్పులకు అడ్డుకట్ట వేయాలంటే వ్యక్తుల స్వేచ్ఛను హరించేలా తుపాకుల్ని నియంత్రించడం కాకుండా మతి స్థిమితంలేని వారికి చికిత్స చేయాలన్నది రిపబ్లికన్ల వాదనగా ఉంది. తుపాకుల్ని అమ్మే ముందు వారి నేర చరితను చూడాలన్న డిమాండ్లను రిపబ్లికన్లు అంగీకరించడం లేదు. ► 2012 డిసెంబర్లో శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూలు విషాదం మొదలు ఇప్పటివరకు 948 సార్లు స్కూళ్లలో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ► 46 లక్షల మంది పిల్లల ఉండే ఇళ్లలో తుపాకుల్లో బుల్లెట్లు్ల లోడ్ చేసే ఉండటం అత్యంత ఆందోళనకరం. ఆ తుపాకులను తల్లిదండ్రులు జాగ్రత్త పరచకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. ► పాఠశాలల్లో కాల్పుల ఘటనల్లో వాడిన తుపాకుల్లో 68% ఇంటి నుంచి, స్నేహితులు, బంధువుల నుంచి తీసుకువచ్చినవే. ► స్కూళ్లలో జరిగే తుపాకీ కాల్పుల్లో 93% ముందస్తుగా ప్రణాళిక చేసుకున్నవే. ► శ్వేత జాతీయుల కంటే నల్లజాతి వారే నాలుగు రెట్లు అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
టెక్సాస్ నరమేధం.. పిల్లలపై కిరాతకుడి కాల్పులకు కారణం ఇదే!
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 19 మంది పిల్లలను, ఇద్దరు టీచర్లను!. పిల్లలని కూడా కనికరం లేకుండా కిరాతకంగా కాల్పులకు తెగబడ్డాడు సాల్వడోర్ రామోస్. ఎందరో కన్నతల్లులకు కడుపు కోత మిగిల్చాడు. కేవలం 18 ఏళ్ల కుర్రాడు.. ఇంత మారణహోమానికి పాల్పడడం సాధ్యమేనా? అసలు ఏ పరిస్థితులు అతనితో ఇంత దురాగతం చేయించాయి? ఘటనకు ముందు సోషల్ మీడియాలో అతను మెయింటెన్ చేసిన సస్పెన్స్ ఏంటంటే.. నార్త్ డకోటాలో పుట్టిన రామోస్.. యువాల్డేలో నివాసం ఉంటున్నాడు. యువాల్డే హైస్కూల్లో విద్యార్థి ఒకప్పుడు అతను. అయితే మధ్యలోనే చదువు మానేసి.. ఓ ఫుడ్‌కోర్టులో ఉద్యోగానికి కుదిరాడు. పని చేసే చోటా.. ఎవరితో పెద్దగా మాట్లాడని సాల్వడోర్.. పద్దెనిమిదేళ్లు నిండాకే దాడికి పాల్పడాలనే ఉద్దేశంతో గన్స్ కొనుక్కున్నాడని అతని స్నేహితుడొకరు వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు.. పద్దెనిమిదేళ్లు దాటిన తర్వాత దాడి చేయాలని ముందుగానే సిద్దమై ఉన్నాడు సాల్వడోర్ రామోస్. టెక్సాస్ గత సెప్టెంబర్‌లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. 18-21 ఏళ్ల మధ్య వయస్కులు ఆత్మరక్షణ కోసం తుపాకులు వాడొచ్చు. అందుకు.. కుటుంబ రక్షణ, ఆగంతకుల నుంచి రక్షణ, అత్యాచారం నుంచి రక్షణ.. వేశ్య గృహాలకు అమ్మేసే పరిస్థితులు ఎదురైనప్పుడు.. లాంటి బలమైన కారణాలు ఉండాలి. అలాంటి సందర్భాల్లోనే తుపాకీని ఉపయోగించాలి. అదీ లైసెన్స్ లేకుండానే ఉపయోగించొచ్చని చేసిన చట్టం కొంప ముంచింది ఇప్పుడు. తన పద్దెనిమిదవ పుట్టినరోజు సందర్భంగా రామోస్.. ఆ తుపాకులను కొనుక్కొచ్చాడు. అంతేకాదు సోషల్ మీడియా(ఇన్‌స్టా)లోనూ ఆ ఫొటోలను సరదాగా షేర్ చేశాడు. పైగా లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ యువతిని సైతం ట్యాగ్ చేసి.. ఆమెతో ఛాటింగ్ చేశాడు. ఆ తుపాకులు ఎందుకంటే.. అంటూ ఓ సస్పెన్స్ కూడా క్రియేట్ చేశాడు. అవే ఫొటోలను రామోస్ తన స్కూల్ ఫ్రెండ్‌కు కూడా పంపాడు. ఇప్పుడు తను చాలా మారిపోయానని, అసలు గుర్తుపట్టలేవంటూ ఆ స్నేహితుడితో ఛాట్ చేశాడట. అవమానాలే కారణం.. చింపిరి జుట్టు, దుస్తులు సరిగా లేకపోవడంతో.. స్కూల్లో స్నేహితులు సాల్వడోర్ రామోస్‌ను ఘోరంగా అవమానించేవాళ్లట. పైగా అతని మీద రాళ్లతో సైతం దాడులు చేసేవారని సదరు స్నేహితుడు వెల్లడించాడు. దీనికి తోడు కుటుంబ ఆర్థిక పరిస్థితి సైతం సాల్వడోర్ను మానసికంగా దిగజార్చిందని ఆ స్నేహితుడు చెబుతున్నాడు. ఇది భరించలేకే స్కూల్ మానేశాడు సాల్వడోర్ రామోస్. ఈ పరిణామాలతో సంఘం మీద విరక్తి చెంది(సోషియోపాత్).. ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని సదరు స్నేహితుడు చెప్తున్నాడు. జోకర్ సినిమాలో లీడ్ క్యారెక్టర్.. ఇలాంటి పరిస్థితులతో మారణహోమాలకు నెలవు అవుతుంది. ఇక పని చేసే ఫుడ్కోర్టులోనూ సాల్వడోర్ రామోస్.. ముభావంగా ఉండేవాడని, పని చేయడం, జీతం తీసుకుని వెళ్లిపోవడం తప్ప ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని తోటి ఉద్యోగులు చెప్తున్నారు. కాల్పులకు రెండు గంటల ముందు వరకు లాస్ ఏంజెల్స్‌కు చెందిన యువతితో ఛాటింగ్ చేశాడు సాల్వడోర్. విశేషం ఏంటంటే.. ఆ యువతికి సాల్వడోర్‌కు అసలు పరిచయమే లేదు. నేరుగా ఇన్‌స్టాలో ఆమెకు తుపాకుల ఫొటోలను ట్యాగ్ చేశాడు. పైగా 11గంటల వరకు ఆగితే విషయం ఏంటో తెలుస్తుందని ఆమెకు మెసేజ్ కూడా చేశాడు. చెప్పిన టైంకి అరగంటల తర్వాత అంటే.. మంగళవారం ఉదయం 11.30గం. సమయంలో రాబ్ ఎలిమెంటరీ స్కూల్లోకి తుపాకులతో ప్రవేశించి.. కాల్పులతో విరుచుకుపడ్డాడు. చిన్నారులను, ఇద్దరు టీచర్లను బలిగొన్నాడు. అంతకంటే ముందు.. తన బామ్మను సైతం కాల్చి చంపాడు దుండగుడు. చివరకు పోలీసులు జరిపిన కాల్పుల్లో రక్తపు మడుగులో పడి ప్రాణం విడిచాడు కిరాతకుడు. -
అమెరికా టెక్సాస్‌లో కాల్పులు.. 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు మృతి
-
టెక్సాస్ కాల్పుల ఘటన.. బైడెన్ భావోద్వేగం
Texas School Shooting, వాషింగ్టన్: టెక్సాస్‌లోని ఎలిమెంటరీ స్కూల్లో 19 మంది చిన్నారులను దుండగుడు కాల్చిచంపిన ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దేశంలోని శక్తివంతమైన తుపాకీ లాబీకి వ్యతిరేకంగా అమెరికన్లు నిలబడాలని మంగళవారం ఆయన పిలుపునిచ్చారు. దేవుడి పేరుతో మనం ఎప్పుడు గన్ లాబీకి ఎదురు నిలబడబోతున్నాం అంటూ వైట్‌హౌజ్ నుంచి ఆయన ప్రసంగించారు. ఈ బాధను ప్రతి తల్లిదండ్రులకు, ఈ దేశంలోని ప్రతి పౌరునికి చర్యగా మార్చాల్సిన సమయం.. ఇదే. ఈ దేశంలో ఎన్నికైన ప్రతి అధికారికి(సెనేటర్లను ఉద్దేశిస్తూ..) మనం స్పష్టంగా తెలియజేయాలి. ఇది పని చేయాల్సిన తరుణం అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా చనిపోయిన తన మొదటి భార్య, పిల్లలను ఆయన గుర్తు చేసుకున్నారు. 1972లో ఓ కారు ప్రమాదంలో బైడెన్ భార్య, కూతురు చనిపోయారు. 2015లో ఆయన కొడుకు కేన్సర్‌తో కన్నుమూశాడు. తల్లిదండ్రులకు పిల్లలు శాశ్వతంగా దూరం కావడం అంటే.. అది వాళ్ల గుండెకు మాయని గాయం.. కొంతకాలం దాకా కోలుకోలేని క్షోభ అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. గన్ కల్చర్ కట్టడికి ‘ఘోస్ట్ గన్స్’ చట్టం చేసింది బైడెన్ ప్రభుత్వం. అయితే దీనికి రాజకీయపరంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇల్లీగల్ కంపెనీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు సెనేటర్ల వల్లే ఈ చట్టం సమర్థవంతంగా అమలు కాలేకపోతోందని బైడెన్ ప్రభుత్వం చెబుతోంది. ఇక చాలూ.. కమలాహ్యారీస్ Texas School Shooting ఘటనపై అమెరికా వైస్‌ప్రెసిడెంట్ కమలాహ్యారీస్ స్పందించారు. ఇలాంటి ఘటనలు ఇక చాలని.. దేశం మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె వ్యాఖ్యానించారు. మన గుండెలు బద్ధలు అవుతూనే ఉన్నాయి. చర్యలు తీసుకోవడానికి ధైర్యం చేయాలి అని వ్యాఖ్యానించారామె. 18 ఏళ్ల గన్‌మ్యాన్.. టెక్సాస్ యువాల్డేలో ఎలిమెంటరీ స్కూల్‌పై విరుచుకుపడి.. 19 మంది పిల్లలను, మరో ఇద్దరిని పొట్టనబెట్టుకున్నాడు. ఘటనకు ముందు తన బామ్మను సైతం నిందితుడు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. సిబ్బంది నిందితుడిని కాల్చి చంపగా.. గన్‌కల్చర్ పేట్రేగిపోవడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
ఘోస్ట్ గన్ చట్టం.. అయినా బైడెన్ వైఫల్యం
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పాతుకుపోయిన గన్ కల్చర్ తీవ్రతను టెక్సాస్ ఎలిమెంటరీ స్కూల్ కాల్పుల ఘటన మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. 2018లో ఫ్లోరిడా పార్క్‌ల్యాండ్ డగ్లస్ హైస్కూల్ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు టెక్సాస్ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. టెక్సాస్ ఎలిమెంటరీ స్కూల్ కాల్పుల ఘటనలో ఇప్పటిదాకా 18 మంది చిన్నారులు, మరో ముగ్గురు మృతి చెందారు. పద్దెనిమిదేళ్ల నిందితుడిని అక్కడిక్కడే కాల్చి చంపేశాయి భద్రతా దళాలు. క్వాడ్ సదస్సు నుంచి తిరిగి అమెరికాకు చేరుకోగానే.. ఈ చేదు వార్తను వినాల్సి వచ్చింది అధ్యక్షుడు జో బైడెన్. ఘటనపై టెక్సాస్ గవర్నర్ అబ్బట్ను వివరాలు అడిగి తెలుసుకుని.. సంతాపం ప్రకటించారు. అంతేకాదు ఘటనకు సంతాపసూచకంగా 28వ తేదీ వరకు జెండా అవనతం పాటించాలని కోరారు ఆయన. మరోవైపు వైస్ ప్రెసిడెంట్ కమలాహ్యారీస్ సైతం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాల అధినేతలు సైతం ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు ‘ఘోస్ట్ గన్’ కారణమని పోలీసులు గుర్తించారు. ఘోస్ట్ గన్స్ అంటే.. అక్రమ తుపాకుల్ని ‘ఘోస్ట్ గన్స్’గా పరిగణించొచ్చు. ఇవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఘోస్ట్ గన్లకు లైసెన్స్ ఉండదు. అలాగే వాటికి సీరియల్ నెంబర్ ఉండవు. త్రీడీ ప్రింట్ ద్వారా కూడా వీటిని తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇల్లీగల్ కావడంతో.. వీటి తయారీకి అవసరమయ్యే విడిభాగాలను కూడా అమ్మడానికి వీల్లేదు. కానీ, చట్టాల్లోని లొసుగులతో.. ఆన్లైన్లో కొందరు వీటి తయారీకి అవసరమయ్యే మెటీరియల్‌ను అమ్మేస్తున్నారు. ఉదాహరణకు.. తొమ్మిది ఎంఎం సెమీ ఆటోమేటిక్ పిస్టోల్కు సంబంధించిన విడిభాగాలను ఆన్లైన్లో కూడా కొనుగోలు చేసే వీలుండేది. అక్కడి రాష్ట్రాల(ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా) స్థానిక చట్టాల దృష్ట్యా.. ఘోస్ట్ గన్స్ కలిగి ఉండడం స్వల్ప నుంచి కఠిన నేరంగా పరిగణించబడుతోంది. స్వల్పకాలిక నుంచి కఠిన జైలు శిక్ష, జరిమానా లేదంటే షూటింగ్ లైసెన్స్ రద్దు లాంటివి శిక్షలు అమలు అవుతున్నాయి. లెక్కకు మించి.. 2021లో వివిధ నేరాల దర్యాప్తుల్లో భాగంగా.. సుమారు ఇరవై వేల ఘోస్ట్ గన్స్‌ను వివిధ దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. 2016లో దొరికిన అక్రమ ఆయుధాలతో పోలిస్తే.. ఇది పది రెట్లు ఎక్కువని వైట్‌హౌజ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా.. గన్ వయొలెన్స్ అమెరికాలో ఎంతకీ తగ్గడం లేదు. ఓ పరిశోధన సంస్థ ప్రకారం.. కేవలం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 140కి పైగా కాల్పుల ఘటనలు సంభవించాయి. కేవలం న్యూయార్క్ నగరంలోనే 2019 లో 47, 2020లో 150, 2021లో 150 ఘోస్ట్ గన్స్ దొరికాయి. అయితే దేశంలో కాల్పుల ఘటనలు పేట్రేగి పోతుండడంతో బైడెన్ ప్రభుత్వం ఘోస్ట్గన్స్ కట్టడికి ఏప్రిల్‌లో ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఘోస్ట్ గన్స్ నిషేధ చట్టం కోసం ఏడాది సమయం తీసుకుని.. రాజకీయంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. విడి భాగాల కంపెనీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయినా కూడా సాహసోపేతమైన అడుగు వేసింది బైడెన్ ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం.. ఘోస్ట్ గన్స్ కలిగి ఉండడం కఠినాతికఠినమైన నేరంగా కిందకు వస్తుంది. అలాగే ఘోస్ట్ గన్స్ సరఫరా, విడిభాగాలను అందించే వాళ్లకు కూడా సమాన శిక్ష పడుతుంది. ఈ భయంతోఅయినా ఈ వ్యవహారానికి చెక్ పడుతుందని భావించారు. అయినప్పటికీ చట్టం అమలులో ఘోర వైఫ్యలాన్ని చవిచూస్తోంది బైడెన్ ప్రభుత్వం. నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఘోస్ట్ గన్స్ వ్యవహారం బయటపడుతున్నాయి. యథేచ్చగా ఘోస్ట్ గన్స్ మార్కెట్లో ఇల్లీగల్‌గా అమ్ముడుపోతున్నాయి. -
అమెరికాలో ‘చచ్చేవరకు ఉండే జబ్బు’
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్పాసో, ఒహాయో రాష్ట్రంలోని డేటన్ నగరాల్లో ఆగస్టు మూడు, నాలుగు తేదీల్లో జరిగిన సామూహిక జన హనన కాండలో దాదాపు 30 మంది అమాయకులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఒకటి వాల్ మార్ట్ మాల్లో జరగ్గా, మరొకటి నైట్ బార్ వద్ద జరిగింది. రెండు సంఘటనల్లోనూ హంతకులను పోలీసులు అక్కడికక్కడే కాల్చి చంపివేశారు. మొదటి హత్యాకాండలో ఓ తెల్ల జాతీయుడు శ్వేత జాత్యాహంకారంతో ఈ సామూహిక జన హననానికి పాల్పడగా, రెండో సంఘటనలో పాఠశాలలో అవమానానికి గురైన ఓ విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇలాంటి వారికి డానిష్ తత్వవేత్త ‘సిక్నెస్ అన్టుడెత్ (చచ్చేవరకు ఉండే జబ్బు)’ జబ్బందని పిలుస్తున్నారు. చదవండి: అగ్రరాజ్యంలో కాల్పుల అలజడి ఇలాంటి సామూహిక జన హననం అమెరికాకు కొత్త కాదు. స్కూళ్లలో, క్లబ్బుల్లో, పబ్బుల్లో, బార్లలో, బీచుల్లో, చర్చీల్లో తరచుగా జరుగుతూనే ఉన్నాయి. డల్లాస్‌లో మైక్ జాన్సన్, ఓర్లాండోలో ఒమర్ మెటీన్ ఇలాంటి హత్యాకాండలకే పాల్పడ్డారు. ఎప్పుడు , ఎక్కడా జనం ఎక్కువగా గుంపులు, గుంపులుగా ఉంటారో వాటినే లక్ష్యంగా చేసుకుని ఈ హంతకులు ఇలాంటి మారణకాండలకు పాల్పడుతున్నారు. వీలైనంత ఎక్కువ మందిని చంపాలనే కసితోనో, ఆక్రోశంతోనో వారీ లక్ష్యాలను ఎంచుకుంటున్నారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా, వీడియో గేమ్స్‌కు అలవాటు పడ్డ యువతనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి సంఘటనలపై వ్యాఖ్యానించి చేతులు దులుపుకున్నారు. ఇది కొంత వరకే నిజం. సమాజంలో ఒంటరి వాళ్లుగా భావిస్తున్న వాళ్లు వీడియో గేమ్లకో, సోషల్ మీడియాలకో బానిసలై జీవితం పట్ల అసంతప్తితోనో, అసహనంతోనో ఇలాంటి దాడులకు పాల్పడుతుండవచ్చు. సహజంగానే వీరిని మానసిక రోగులని, సైకోలని పిలుస్తున్నాం. వీరిలో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటుండగా, కొంతమంది లక్ష్యరహిత ప్రతీకారం కోసం ఇలా జన హననానికి పాల్పడుతున్నారు. అసలు వారు సైకోలుగా ఎందుకు తయారవుతున్నారు ? అందుకు దారితీస్తున్న సామాజిక పరిస్థితులేమిటీ? సామాజిక, మానసిక శాస్త్రవేత్తల ప్రకారం సమాజంలో ప్రతి వ్యక్తి తన కాళ్లమీద నిలబడే గౌరవప్రదమైన జీవితాన్ని, అందుకు సరిపడే హోదాను కోరుకుంటారు. సమాజంతోపాటు చేస్తున్న వృత్తిలోనూ రాణించాలనుకుంటారు. మరికొందరు నలుగురితో సమానంగా కాకుండా నలుగురిలో ఒకరుగా గుర్తింపు పొందాలనుకుంటారు. లక్షలు లక్షలు సంపాదించే విలాస జీవితాన్ని కోరుకుంటారు మరికొందరు. వారంతా అందుకు సమాజంలో పోటీ పడాల్సి వస్తోంది. అందుకు వారి వారి జీవితాల్లో ఒడిదుడుకులు తప్పవు. తోటివారితో పోటీ పడలేక జీవితంలో ఓడిపోయిన వాళ్లు, చేతకాని వాళ్లులాగా మిగిలిపోతున్న వాళ్లు, నా అని పలకరించే వాళ్లు లేక లోలోన నలిగిపోతున్న వాళ్లు, మానసికంగా కుమిలిపోతున్న వాళ్లు, ఒత్తిళ్లుకు గురవుతున్న వాళ్లు, అనవసరపు ఆక్రోశం, ఆవేశంతో రగిలిపోతున్నవాళ్లు మొత్తం సమాజం మీదనే కోపం పెంచుకుని సైకోలుగా తయారవుతున్నారు. కొందరు విద్యార్థి దశలోనే మానసిక ఒత్తిడి తట్టుకోలేక సైకోలుగా మారుతున్నారు. వ్యక్తుల సామాజిక పరిస్థితులనుబట్టి వారిలో మానసిక ఒత్తిడుల హెచ్చు తగ్గులు ఉంటాయి. ప్రేమానురాగాలకు ఆస్కారం ఉన్న చోట ఇలాంటి ఒత్తిడులు తక్కువగా ఉంటాయి. ఎవరికి వారే యమునా తీరే! అన్న చందంగా బతికే అమెరికాలాంటి సమాజంలో సైకోలు సులువుగా తయారవుతారు, తయారవుతున్నారు. ప్రపంచంలోని జాతులన్నీ అక్కడే ఉంటాయి. తమ ఉద్యోగాలను, తమ జీతాలను తన్నుకుపోతున్నారంటూ పరస్పర అపోహల్లో వాళ్లు బతుకుతుంటారు. ఇటీవల అక్కడ శ్వేత జాత్యాహంకారం పెచ్చరిల్లడానికి అదే కారణం. వారి దాడుల్లో ఎక్కువ మంది మరణించడానికి కారణం ‘223 కాలిబర్ అసాల్ట్ రైఫిల్’ లాంటి మారణాయుధాలను వారు ఉపయోగంచడం, అవి వారికి సులువుగా అందుబాటులో ఉండడం. ఎల్ పాసోలో శ్వేతజాత్యాహంకారి ఉపయోగించిన రైఫిల్ ఇదే. దాన్ని అతడు టెక్సాస్ నుంచి ఆన్లైన్ బుకింగ్ ద్వారా స్థానిక తుపాకుల షాపు నుంచి సులువుగా కొనుగోలు చేశాడు. తుపాకీల లైసెన్స్ చట్టాలను కఠినతరం చేయాలని, సామూహిక హననానికి ఉపయోగపడే తుపాకుల కొనుగోళ్లపై పూర్తిగా నిషేధం విధించాలని ఎప్పటి నుంచే అమెరికాలో చర్చోప చర్చలు కొనసాగుతున్నాయి. నిషేధం కన్నా నియంత్రనే మంచిదని సూచిస్తున్నవాళ్లు ఉన్నారు. బరాక్ ఒబామా హయాంలో తుపాకుల అమ్మకాలపై కొంత నియంత్రణ తీసుకొచ్చారు. జాత్యాహంకారం పెరుగుతున్న నేటి ట్రంప్ హయాంలో ఈ నియంత్రణ మరింత అవసరం. -
అమెరికాలో మళ్లీ కాల్పులు!
అమారిలో: ఆర్లెండోలోని నైట్ క్లబ్బులో జరిగిన దారుణమైన కాల్పుల ఉదంతం మరువకముందే మళ్లీ అమెరికాలో కాల్పుల మోత మోగినట్టు తెలుస్తోంది. టెక్సాస్ అమారిలోలోని వాల్‌మార్ట్ వద్ద ఓ సాయుధుడు కాల్పులతో కలకలం రేపాడు. సాయుధుడి చేతిలో పలువురు బందీలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లడం మానుకోవాలని, ట్రాఫిక్ మీద దృష్టి పెట్టడం కన్నా సంఘటన స్థలంలో పరిస్థితులపై పోలీసులు దృష్టి కేంద్రీకరించాలని అమారిలో పోలీసు విభాగం సూచించింది. వాల్‌మార్ట్ స్టోర్‌లో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి తుపాకులతో వీరంగానికి దిగినట్టు తెలుస్తున్నదని స్థానిక మీడియా కథనాలు తెలుపుతున్నాయి. అయితే, ఈ ప్రాంతంలో ఎవరూ కాల్పుల బారిన పడలేదని, కాల్పుల వల్ల ఎవరు గాయపడ్డట్టు సమాచారం లేదని అమారిలో పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు వాల్‌మార్ట్ స్టోర్‌లోకి ప్రవేశించారని, ప్రస్తుతం అక్కడ కాల్పులు కొనసాగడం లేదని వెల్లడించారు. సాయుధుడి ఆధీనంలో ఉన్న బందీలంతా సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ఆర్లెండోలోని ఓ గే నైట్‌క్లబ్బులో రెండ్రోజుల కిందట ఓమర్ మతీన్ ఉన్మాదీ వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. పల్స్ క్లబ్బులో పార్టీలో మునిగితేలిన యువకులపై అతడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. 49మందిని పొట్టనబెట్టుకున్నాడు. దేశీయ ఉగ్రవాదమే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే టెక్సాస్‌లోని అమారిలోలో కాల్పులు చోటుచేసుకోవడం అమెరికన్లు దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.