ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 19 మంది పిల్లలను, ఇద్దరు టీచర్లను!. పిల్లలని కూడా కనికరం లేకుండా కిరాతకంగా కాల్పులకు తెగబడ్డాడు సాల్వడోర్ రామోస్. ఎందరో కన్నతల్లులకు కడుపు కోత మిగిల్చాడు. కేవలం 18 ఏళ్ల కుర్రాడు.. ఇంత మారణహోమానికి పాల్పడడం సాధ్యమేనా? అసలు ఏ పరిస్థితులు అతనితో ఇంత దురాగతం చేయించాయి? ఘటనకు ముందు సోషల్ మీడియాలో అతను మెయింటెన్ చేసిన సస్పెన్స్ ఏంటంటే..
నార్త్ డకోటాలో పుట్టిన రామోస్.. యువాల్డేలో నివాసం ఉంటున్నాడు. యువాల్డే హైస్కూల్‌లో విద్యార్థి ఒకప్పుడు అతను. అయితే మధ్యలోనే చదువు మానేసి.. ఓ ఫుడ్‌కోర్టులో ఉద్యోగానికి కుదిరాడు. పని చేసే చోటా.. ఎవరితో పెద్దగా మాట్లాడని సాల్వడోర్.. పద్దెనిమిదేళ్లు నిండాకే దాడికి పాల్పడాలనే ఉద్దేశంతో గన్స్ కొనుక్కున్నాడని అతని స్నేహితుడొకరు వెల్లడించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు..
పద్దెనిమిదేళ్లు దాటిన తర్వాత దాడి చేయాలని ముందుగానే సిద్దమై ఉన్నాడు సాల్వడోర్ రామోస్. టెక్సాస్ గత సెప్టెంబర్‌లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. 18-21 ఏళ్ల మధ్య వయస్కులు ఆత్మరక్షణ కోసం తుపాకులు వాడొచ్చు. అందుకు.. కుటుంబ రక్షణ, ఆగంతకుల నుంచి రక్షణ, అత్యాచారం నుంచి రక్షణ.. వేశ్య గృహాలకు అమ్మేసే పరిస్థితులు ఎదురైనప్పుడు.. లాంటి బలమైన కారణాలు ఉండాలి. అలాంటి సందర్భాల్లోనే తుపాకీని ఉపయోగించాలి. అదీ లైసెన్స్ లేకుండానే ఉపయోగించొచ్చని చేసిన చట్టం కొంప ముంచింది ఇప్పుడు.
తన పద్దెనిమిదవ పుట్టినరోజు సందర్భంగా రామోస్.. ఆ తుపాకులను కొనుక్కొచ్చాడు. అంతేకాదు సోషల్ మీడియా(ఇన్‌స్టా)లోనూ ఆ ఫొటోలను సరదాగా షేర్ చేశాడు. పైగా లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ యువతిని సైతం ట్యాగ్ చేసి.. ఆమెతో ఛాటింగ్ చేశాడు. ఆ తుపాకులు ఎందుకంటే.. అంటూ ఓ సస్పెన్స్ కూడా క్రియేట్ చేశాడు. అవే ఫొటోలను రామోస్ తన స్కూల్ ఫ్రెండ్‌కు కూడా పంపాడు. ఇప్పుడు తను చాలా మారిపోయానని, అసలు గుర్తుపట్టలేవంటూ ఆ స్నేహితుడితో ఛాట్ చేశాడట.
అవమానాలే కారణం..
చింపిరి జుట్టు, దుస్తులు సరిగా లేకపోవడంతో.. స్కూల్‌లో స్నేహితులు సాల్వడోర్ రామోస్‌ను ఘోరంగా అవమానించేవాళ్లట. పైగా అతని మీద రాళ్లతో సైతం దాడులు చేసేవారని సదరు స్నేహితుడు వెల్లడించాడు. దీనికి తోడు కుటుంబ ఆర్థిక పరిస్థితి సైతం సాల్వడోర్‌ను మానసికంగా దిగజార్చిందని ఆ స్నేహితుడు చెబుతున్నాడు. ఇది భరించలేకే స్కూల్ మానేశాడు సాల్వడోర్ రామోస్. ఈ పరిణామాలతో సంఘం మీద విరక్తి చెంది(సోషియోపాత్).. ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని సదరు స్నేహితుడు చెప్తున్నాడు. జోకర్ సినిమాలో లీడ్ క్యారెక్టర్.. ఇలాంటి పరిస్థితులతో మారణహోమాలకు నెలవు అవుతుంది.
ఇక పని చేసే ఫుడ్‌కోర్టులోనూ సాల్వడోర్ రామోస్.. ముభావంగా ఉండేవాడని, పని చేయడం, జీతం తీసుకుని వెళ్లిపోవడం తప్ప ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని తోటి ఉద్యోగులు చెప్తున్నారు. కాల్పులకు రెండు గంటల ముందు వరకు లాస్ ఏంజెల్స్‌కు చెందిన యువతితో ఛాటింగ్ చేశాడు సాల్వడోర్. విశేషం ఏంటంటే.. ఆ యువతికి సాల్వడోర్‌కు అసలు పరిచయమే లేదు. నేరుగా ఇన్‌స్టాలో ఆమెకు తుపాకుల ఫొటోలను ట్యాగ్ చేశాడు.
పైగా 11గంటల వరకు ఆగితే విషయం ఏంటో తెలుస్తుందని ఆమెకు మెసేజ్ కూడా చేశాడు. చెప్పిన టైంకి అరగంటల తర్వాత అంటే.. మంగళవారం ఉదయం 11.30గం. సమయంలో రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లోకి తుపాకులతో ప్రవేశించి.. కాల్పులతో విరుచుకుపడ్డాడు. చిన్నారులను, ఇద్దరు టీచర్లను బలిగొన్నాడు. అంతకంటే ముందు.. తన బామ్మను సైతం కాల్చి చంపాడు దుండగుడు. చివరకు పోలీసులు జరిపిన కాల్పుల్లో రక్తపు మడుగులో పడి ప్రాణం విడిచాడు కిరాతకుడు.
Comments
Please login to add a commentAdd a comment