us gun culture
-
టెక్సాస్ నరమేధం.. పిల్లలపై కిరాతకుడి కాల్పులకు కారణం ఇదే!
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 19 మంది పిల్లలను, ఇద్దరు టీచర్లను!. పిల్లలని కూడా కనికరం లేకుండా కిరాతకంగా కాల్పులకు తెగబడ్డాడు సాల్వడోర్ రామోస్. ఎందరో కన్నతల్లులకు కడుపు కోత మిగిల్చాడు. కేవలం 18 ఏళ్ల కుర్రాడు.. ఇంత మారణహోమానికి పాల్పడడం సాధ్యమేనా? అసలు ఏ పరిస్థితులు అతనితో ఇంత దురాగతం చేయించాయి? ఘటనకు ముందు సోషల్ మీడియాలో అతను మెయింటెన్ చేసిన సస్పెన్స్ ఏంటంటే.. నార్త్ డకోటాలో పుట్టిన రామోస్.. యువాల్డేలో నివాసం ఉంటున్నాడు. యువాల్డే హైస్కూల్లో విద్యార్థి ఒకప్పుడు అతను. అయితే మధ్యలోనే చదువు మానేసి.. ఓ ఫుడ్‌కోర్టులో ఉద్యోగానికి కుదిరాడు. పని చేసే చోటా.. ఎవరితో పెద్దగా మాట్లాడని సాల్వడోర్.. పద్దెనిమిదేళ్లు నిండాకే దాడికి పాల్పడాలనే ఉద్దేశంతో గన్స్ కొనుక్కున్నాడని అతని స్నేహితుడొకరు వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు.. పద్దెనిమిదేళ్లు దాటిన తర్వాత దాడి చేయాలని ముందుగానే సిద్దమై ఉన్నాడు సాల్వడోర్ రామోస్. టెక్సాస్ గత సెప్టెంబర్‌లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. 18-21 ఏళ్ల మధ్య వయస్కులు ఆత్మరక్షణ కోసం తుపాకులు వాడొచ్చు. అందుకు.. కుటుంబ రక్షణ, ఆగంతకుల నుంచి రక్షణ, అత్యాచారం నుంచి రక్షణ.. వేశ్య గృహాలకు అమ్మేసే పరిస్థితులు ఎదురైనప్పుడు.. లాంటి బలమైన కారణాలు ఉండాలి. అలాంటి సందర్భాల్లోనే తుపాకీని ఉపయోగించాలి. అదీ లైసెన్స్ లేకుండానే ఉపయోగించొచ్చని చేసిన చట్టం కొంప ముంచింది ఇప్పుడు. తన పద్దెనిమిదవ పుట్టినరోజు సందర్భంగా రామోస్.. ఆ తుపాకులను కొనుక్కొచ్చాడు. అంతేకాదు సోషల్ మీడియా(ఇన్‌స్టా)లోనూ ఆ ఫొటోలను సరదాగా షేర్ చేశాడు. పైగా లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ యువతిని సైతం ట్యాగ్ చేసి.. ఆమెతో ఛాటింగ్ చేశాడు. ఆ తుపాకులు ఎందుకంటే.. అంటూ ఓ సస్పెన్స్ కూడా క్రియేట్ చేశాడు. అవే ఫొటోలను రామోస్ తన స్కూల్ ఫ్రెండ్‌కు కూడా పంపాడు. ఇప్పుడు తను చాలా మారిపోయానని, అసలు గుర్తుపట్టలేవంటూ ఆ స్నేహితుడితో ఛాట్ చేశాడట. అవమానాలే కారణం.. చింపిరి జుట్టు, దుస్తులు సరిగా లేకపోవడంతో.. స్కూల్లో స్నేహితులు సాల్వడోర్ రామోస్‌ను ఘోరంగా అవమానించేవాళ్లట. పైగా అతని మీద రాళ్లతో సైతం దాడులు చేసేవారని సదరు స్నేహితుడు వెల్లడించాడు. దీనికి తోడు కుటుంబ ఆర్థిక పరిస్థితి సైతం సాల్వడోర్ను మానసికంగా దిగజార్చిందని ఆ స్నేహితుడు చెబుతున్నాడు. ఇది భరించలేకే స్కూల్ మానేశాడు సాల్వడోర్ రామోస్. ఈ పరిణామాలతో సంఘం మీద విరక్తి చెంది(సోషియోపాత్).. ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని సదరు స్నేహితుడు చెప్తున్నాడు. జోకర్ సినిమాలో లీడ్ క్యారెక్టర్.. ఇలాంటి పరిస్థితులతో మారణహోమాలకు నెలవు అవుతుంది. ఇక పని చేసే ఫుడ్కోర్టులోనూ సాల్వడోర్ రామోస్.. ముభావంగా ఉండేవాడని, పని చేయడం, జీతం తీసుకుని వెళ్లిపోవడం తప్ప ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని తోటి ఉద్యోగులు చెప్తున్నారు. కాల్పులకు రెండు గంటల ముందు వరకు లాస్ ఏంజెల్స్‌కు చెందిన యువతితో ఛాటింగ్ చేశాడు సాల్వడోర్. విశేషం ఏంటంటే.. ఆ యువతికి సాల్వడోర్‌కు అసలు పరిచయమే లేదు. నేరుగా ఇన్‌స్టాలో ఆమెకు తుపాకుల ఫొటోలను ట్యాగ్ చేశాడు. పైగా 11గంటల వరకు ఆగితే విషయం ఏంటో తెలుస్తుందని ఆమెకు మెసేజ్ కూడా చేశాడు. చెప్పిన టైంకి అరగంటల తర్వాత అంటే.. మంగళవారం ఉదయం 11.30గం. సమయంలో రాబ్ ఎలిమెంటరీ స్కూల్లోకి తుపాకులతో ప్రవేశించి.. కాల్పులతో విరుచుకుపడ్డాడు. చిన్నారులను, ఇద్దరు టీచర్లను బలిగొన్నాడు. అంతకంటే ముందు.. తన బామ్మను సైతం కాల్చి చంపాడు దుండగుడు. చివరకు పోలీసులు జరిపిన కాల్పుల్లో రక్తపు మడుగులో పడి ప్రాణం విడిచాడు కిరాతకుడు. -
అమెరికా టెక్సాస్‌లో కాల్పులు.. 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు మృతి
-
టెక్సాస్ కాల్పుల ఘటన.. బైడెన్ భావోద్వేగం
Texas School Shooting, వాషింగ్టన్: టెక్సాస్‌లోని ఎలిమెంటరీ స్కూల్లో 19 మంది చిన్నారులను దుండగుడు కాల్చిచంపిన ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దేశంలోని శక్తివంతమైన తుపాకీ లాబీకి వ్యతిరేకంగా అమెరికన్లు నిలబడాలని మంగళవారం ఆయన పిలుపునిచ్చారు. దేవుడి పేరుతో మనం ఎప్పుడు గన్ లాబీకి ఎదురు నిలబడబోతున్నాం అంటూ వైట్‌హౌజ్ నుంచి ఆయన ప్రసంగించారు. ఈ బాధను ప్రతి తల్లిదండ్రులకు, ఈ దేశంలోని ప్రతి పౌరునికి చర్యగా మార్చాల్సిన సమయం.. ఇదే. ఈ దేశంలో ఎన్నికైన ప్రతి అధికారికి(సెనేటర్లను ఉద్దేశిస్తూ..) మనం స్పష్టంగా తెలియజేయాలి. ఇది పని చేయాల్సిన తరుణం అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా చనిపోయిన తన మొదటి భార్య, పిల్లలను ఆయన గుర్తు చేసుకున్నారు. 1972లో ఓ కారు ప్రమాదంలో బైడెన్ భార్య, కూతురు చనిపోయారు. 2015లో ఆయన కొడుకు కేన్సర్‌తో కన్నుమూశాడు. తల్లిదండ్రులకు పిల్లలు శాశ్వతంగా దూరం కావడం అంటే.. అది వాళ్ల గుండెకు మాయని గాయం.. కొంతకాలం దాకా కోలుకోలేని క్షోభ అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. గన్ కల్చర్ కట్టడికి ‘ఘోస్ట్ గన్స్’ చట్టం చేసింది బైడెన్ ప్రభుత్వం. అయితే దీనికి రాజకీయపరంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇల్లీగల్ కంపెనీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు సెనేటర్ల వల్లే ఈ చట్టం సమర్థవంతంగా అమలు కాలేకపోతోందని బైడెన్ ప్రభుత్వం చెబుతోంది. ఇక చాలూ.. కమలాహ్యారీస్ Texas School Shooting ఘటనపై అమెరికా వైస్‌ప్రెసిడెంట్ కమలాహ్యారీస్ స్పందించారు. ఇలాంటి ఘటనలు ఇక చాలని.. దేశం మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె వ్యాఖ్యానించారు. మన గుండెలు బద్ధలు అవుతూనే ఉన్నాయి. చర్యలు తీసుకోవడానికి ధైర్యం చేయాలి అని వ్యాఖ్యానించారామె. 18 ఏళ్ల గన్‌మ్యాన్.. టెక్సాస్ యువాల్డేలో ఎలిమెంటరీ స్కూల్‌పై విరుచుకుపడి.. 19 మంది పిల్లలను, మరో ఇద్దరిని పొట్టనబెట్టుకున్నాడు. ఘటనకు ముందు తన బామ్మను సైతం నిందితుడు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. సిబ్బంది నిందితుడిని కాల్చి చంపగా.. గన్‌కల్చర్ పేట్రేగిపోవడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
ఘోస్ట్ గన్ చట్టం.. అయినా బైడెన్ వైఫల్యం
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పాతుకుపోయిన గన్ కల్చర్ తీవ్రతను టెక్సాస్ ఎలిమెంటరీ స్కూల్ కాల్పుల ఘటన మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. 2018లో ఫ్లోరిడా పార్క్‌ల్యాండ్ డగ్లస్ హైస్కూల్ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు టెక్సాస్ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. టెక్సాస్ ఎలిమెంటరీ స్కూల్ కాల్పుల ఘటనలో ఇప్పటిదాకా 18 మంది చిన్నారులు, మరో ముగ్గురు మృతి చెందారు. పద్దెనిమిదేళ్ల నిందితుడిని అక్కడిక్కడే కాల్చి చంపేశాయి భద్రతా దళాలు. క్వాడ్ సదస్సు నుంచి తిరిగి అమెరికాకు చేరుకోగానే.. ఈ చేదు వార్తను వినాల్సి వచ్చింది అధ్యక్షుడు జో బైడెన్. ఘటనపై టెక్సాస్ గవర్నర్ అబ్బట్ను వివరాలు అడిగి తెలుసుకుని.. సంతాపం ప్రకటించారు. అంతేకాదు ఘటనకు సంతాపసూచకంగా 28వ తేదీ వరకు జెండా అవనతం పాటించాలని కోరారు ఆయన. మరోవైపు వైస్ ప్రెసిడెంట్ కమలాహ్యారీస్ సైతం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాల అధినేతలు సైతం ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు ‘ఘోస్ట్ గన్’ కారణమని పోలీసులు గుర్తించారు. ఘోస్ట్ గన్స్ అంటే.. అక్రమ తుపాకుల్ని ‘ఘోస్ట్ గన్స్’గా పరిగణించొచ్చు. ఇవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఘోస్ట్ గన్లకు లైసెన్స్ ఉండదు. అలాగే వాటికి సీరియల్ నెంబర్ ఉండవు. త్రీడీ ప్రింట్ ద్వారా కూడా వీటిని తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇల్లీగల్ కావడంతో.. వీటి తయారీకి అవసరమయ్యే విడిభాగాలను కూడా అమ్మడానికి వీల్లేదు. కానీ, చట్టాల్లోని లొసుగులతో.. ఆన్లైన్లో కొందరు వీటి తయారీకి అవసరమయ్యే మెటీరియల్‌ను అమ్మేస్తున్నారు. ఉదాహరణకు.. తొమ్మిది ఎంఎం సెమీ ఆటోమేటిక్ పిస్టోల్కు సంబంధించిన విడిభాగాలను ఆన్లైన్లో కూడా కొనుగోలు చేసే వీలుండేది. అక్కడి రాష్ట్రాల(ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా) స్థానిక చట్టాల దృష్ట్యా.. ఘోస్ట్ గన్స్ కలిగి ఉండడం స్వల్ప నుంచి కఠిన నేరంగా పరిగణించబడుతోంది. స్వల్పకాలిక నుంచి కఠిన జైలు శిక్ష, జరిమానా లేదంటే షూటింగ్ లైసెన్స్ రద్దు లాంటివి శిక్షలు అమలు అవుతున్నాయి. లెక్కకు మించి.. 2021లో వివిధ నేరాల దర్యాప్తుల్లో భాగంగా.. సుమారు ఇరవై వేల ఘోస్ట్ గన్స్‌ను వివిధ దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. 2016లో దొరికిన అక్రమ ఆయుధాలతో పోలిస్తే.. ఇది పది రెట్లు ఎక్కువని వైట్‌హౌజ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా.. గన్ వయొలెన్స్ అమెరికాలో ఎంతకీ తగ్గడం లేదు. ఓ పరిశోధన సంస్థ ప్రకారం.. కేవలం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 140కి పైగా కాల్పుల ఘటనలు సంభవించాయి. కేవలం న్యూయార్క్ నగరంలోనే 2019 లో 47, 2020లో 150, 2021లో 150 ఘోస్ట్ గన్స్ దొరికాయి. అయితే దేశంలో కాల్పుల ఘటనలు పేట్రేగి పోతుండడంతో బైడెన్ ప్రభుత్వం ఘోస్ట్గన్స్ కట్టడికి ఏప్రిల్‌లో ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఘోస్ట్ గన్స్ నిషేధ చట్టం కోసం ఏడాది సమయం తీసుకుని.. రాజకీయంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. విడి భాగాల కంపెనీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయినా కూడా సాహసోపేతమైన అడుగు వేసింది బైడెన్ ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం.. ఘోస్ట్ గన్స్ కలిగి ఉండడం కఠినాతికఠినమైన నేరంగా కిందకు వస్తుంది. అలాగే ఘోస్ట్ గన్స్ సరఫరా, విడిభాగాలను అందించే వాళ్లకు కూడా సమాన శిక్ష పడుతుంది. ఈ భయంతోఅయినా ఈ వ్యవహారానికి చెక్ పడుతుందని భావించారు. అయినప్పటికీ చట్టం అమలులో ఘోర వైఫ్యలాన్ని చవిచూస్తోంది బైడెన్ ప్రభుత్వం. నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఘోస్ట్ గన్స్ వ్యవహారం బయటపడుతున్నాయి. యథేచ్చగా ఘోస్ట్ గన్స్ మార్కెట్లో ఇల్లీగల్‌గా అమ్ముడుపోతున్నాయి. -
అమెరికాలో ఉన్మాది కాల్పులు..:19 చిన్నారులు బలి
అమెరికా మళ్లీ నెత్తురోడింది. తరాలుగా వెర్రితలలు వేస్తున్న తుపాకుల సంస్కృతి మరోసారి వికటాట్టహాసం చేసింది. ముక్కుపచ్చలారని 19 మంది పసి పిల్లలను బలి తీసుకుంది. హూస్టన్: అమెరికాలో ఓ 18 ఏళ్ల యువకుడు మారణహోమానికి తెగబడ్డాడు. ఓ ఎలిమెంటరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులకు దిగాడు. 19 మంది స్టూడెంట్లతో పాటు ఇద్దరు టీచర్లను పొట్టన పెట్టుకున్నాడు. టెక్సాస్ రాష్ట్రంలో శాన్ ఆంటోనియోకు 134 కిలోమీటర్ల దూరంలోని ఉవాల్డే టౌన్లో మంగళవారం ఈ ఘోరం జరిగింది. హంతకున్ని సాల్వడార్ రామోస్ అనే స్థానికునిగా గుర్తించారు. అతను బులెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించి ఏఆర్–15 సెమీ ఆటోమాటిక్ రైఫిల్, మరో హాండ్ గన్, భారీ సంఖ్యలో బులెట్ మ్యాగజైన్లతో ఉదయం 11.30కు స్థానిక రాబ్ ఎలిమెంటరీ స్కూల్లోకి చొరబడ్డాడు. ఓ క్లాస్‌రూమ్‌లో దూరి విచక్షణారహితంగా కాల్పుల వర్షం కురిపించాడు. దాంతో 14 మంది పిల్లలు, ఇద్దరు టీచర్లు అక్కడికక్కడే నేలకొరిగారు. మరో ఐదుగురు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు రంగప్రవేశం చేసి హంతకున్ని కాల్చేశారు. చనిపోయిన బాలలంతా 5 నుంచి 10 ఏళ్ల లోపు వాళ్లేనని వెల్లడిస్తూ నగర పోలీస్ చీఫ్ కన్నీటిపర్యంతమయ్యారు. క్లాస్‌రూమ్‌లో 30 మంది దాకా పిల్లలున్నట్టు సమాచారం. వారిలో చాలామంది గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అంటున్నారు. ఆస్పత్రుల విజ్ఞప్తికి స్పందించి వారికి రక్తం అందించడానికి చాలామంది ముం దుకొచ్చారు. ఇంతటి ఘోరానికి కారణాలు ఇంకా తెలియకపోయినా, హంతకుడు చిన్నప్పుడు స్కూల్లో తోటి పిల్లల చేతిలో నిత్యం హేళనలకు గురై స్కూలు మానేశాడని అతని స్నేహితుడు చెబుతున్నాడు. ఆ గాయాలే ఈ దారుణానికి పురిగొల్పి ఉంటాయని భావిస్తున్నారు. స్కూల్లో నరమేధానికి ముందు ఇంట్లో నాయనమ్మను కూడా అతడు కాల్చి తీవ్రంగా గాయపరిచాడని తెలుస్తోంది. కాల్పులపై దేశమంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో తుపాకీ సంస్కృతిపై మరోసారి సర్వత్రా చర్చ మొదలైంది. దానికి ఇకనైనా చరమగీతం పాడాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. 10 రోజుల క్రితమే న్యూయార్క్‌లో ఓ జాత్యహంకారి కాల్పుల్లో 10 మంది నల్లజాతీయులు మరణించడం తెలిసిందే. తీవ్రంగా కలచివేసింది: కమల కాల్పుల ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. ‘‘ఇలాం టివి జరిగినప్పుడు ‘మా గుండెలు బద్దలయ్యా’ యని అనడం సహజం. కానీ నిత్యం జరుగుతున్న కాల్పులతో అమెరికన్ల గుండెలు పదేపదే బద్దలవుతూనే ఉన్నాయి. ఇకనైనా మనం ధైర్యం కూడదీసుకోవాలి. వీటికి శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగాలి’’ అన్నారు. ఈ ఏడాది 212 మాస్ షూటౌట్లు అమెరికాలో ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా 212 సామూహిక కాల్పుల ఘటనలు జరిగినట్టు గన్ వయోలెన్స్ ఆర్కైవ్ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. నలుగురు, అంతకంటే ఎక్కువ మంది చనిపోతే సామూహిక కాల్పుల ఘటనగా చెబుతారు. ఇలాంటివి సగటున రోజుకు ఒకటి కంటే ఎక్కవగా జరుగుతుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని సీఎన్ఎన్ వార్తా సంస్థ వాపోయింది. అమెరికాలో స్కూళ్లలో కాల్పులు జరగడం ఈ ఏడాది ఇది 27వ సారి! తాజా హత్యాకాండ అమెరికాలో జరిగిన అతి పెద్ద స్కూలు దారుణాల్లో రెండోది. 2012లో కనెక్టికట్‌లో శాండీ హాక్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 26 మంది మరణించారు. ఆయుధ లాబీలకు ముకుతాడు: బైడెన్ తుపాకుల వాడకాన్ని నియంత్రిద్దాం ఆ దిశగా చట్టాన్ని కఠినతరం చేద్దాం చట్టసభల సభ్యులకు అధ్యక్షుని పిలుపు కాల్పులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. జపాన్‌లో క్వాడ్ సదస్సులో పాల్గొని అధ్యక్ష విమానం ఎయిర్‌ఫోర్స్‌వన్‌లో తిరిగొస్తుండగా ఆయనకు విషయం తెలిసింది. దాంతో, ఇది మాటలకందని దారుణమంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సంతాప సూచకంగా దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని శనివారం సాయంత్రం దాకా సగం మేర అవనతం చేయాలని ఆదేశించారు. విమానంలో నుంచే జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘అభంశుభం తెలియని చిన్నారులు తమ కళ్లముందు జరిగిన ఈ బీభత్సానికి ఎంతగా హడలిపోయి ఉంటారో! స్నేహితులు కళ్ల ముందే కాల్పులకు బలవుతుంటే ఎంతగా తల్లడిల్లి ఉంటారో!! పిల్లలను కోల్పోవడమంటే ఆత్మలో ఓ భాగాన్ని పోగొట్టుకోవడమే. ఆ ఆలోచనే హృదయంలో అంతులేని శూన్యం నింపుతుంది’’ అంటూ ఆక్రోశించారు. వాషింగ్టన్ చేరుతూనే భార్య జిల్‌తో కలిసి మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లను ప్రస్తావించారు. ఆ దిశగా కార్యాచరణకు దిగేందుకు తాజా ఘటనే నాంది కావాలని చట్టసభ సభ్యులకు పిలుపునిచ్చారు. ‘‘నేను జపాన్ బయల్దేరే కొద్ది రోజుల ముందే న్యూయార్క్‌లోని బఫెలోలో జాతి విద్వేష కాల్పలకు 10 మంది నల్లజాతీయులు బలయ్యారు. వారి కుటుంబాలను ఓదార్చిన క్షణాలు నా మనసులో ఇంకా తాజాగానే ఉన్నాయి. ఈలోపే దాన్ని తలదన్నే మరో ఘోరం!’’ అంటూ ఆక్రోశించారు. ‘‘ఇతర దేశాల్లో అత్యంత అరుదుగా జరిగే ఇలాంటి దారుణాలు అమెరికాలో మాత్రం పదేపదే జరిగేందుకు మనమెందుకు అవకాశమిస్తున్నాం? మన చేతుల్లో ఏమీ లేదని చెప్పొద్దు. ఇలాంటివి వినీ వినీ విసిగిపోయాను. ఆయుధ లాబీలను అడ్డుకునేందుకు, వాటికి ముకుతాడు వేసేందుకు సత్తా మనలో కరువైందా?’’ అంటూ ప్రశ్నించారు. ‘‘ఇంకా ఉపేక్షించేది లేదు. చేతలకు దిగాల్సిన సమయం ఆసన్నమైంది’’ అన్నారు. ‘‘తుపాకుల సంస్కృతికి అడ్డుకట్టే వేసేలా చట్టాన్ని కఠినతరం చేయాల్సిందే. ఇందుకు చట్టసభ సభ్యులను ఒప్పించేందుకు ఏం చేయాలో ఆలోచిస్తాం’’ అని ప్రకటించారు. -
ముస్లింలకు తుపాకులు అమ్మబోం!
అమెరికాలో తుపాకులు అమ్మే ఓ దుకాణం సరికొత్త వివాదానికి తెరతీసింది. ముస్లింలకు, హిల్లరీ క్లింటన్ మద్దతుదారులకు తాము తుపాకులు అమ్మబోమంటూ తన దుకాణంలో ఓ బోర్డు పెట్టింది. అంతేకాకుండా దినపత్రికల్లోనూ ఇదేవిధంగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చింది. ఉగ్రవాదులకు తుపాకులు అమ్మడం క్షేమం కాదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. పెన్సిల్వేనియా రూరల్ జాక్సన్ సెంటర్‌కు చెందిన పాల్ చాండ్లెర్ (54)కు ‘అల్ట్రా ఫైర్ఆర్మ్స్’ పేరిట తుపాకులు అమ్మే దుకాణం ఉంది. అయితే, తన దుకాణానికి తుపాకులు కొనేందుకు వచ్చే ముస్లింలు, హిల్లరీ క్లింటన్ మద్దతుదారులను ఉత్తచేతులతో తిప్పిపంపుతున్నట్టు ఆయన తెలిపారు. 'దయచేసి ముస్లింలు, హిల్లరీ క్లింటన్ మద్దతుదారులు రావొద్దు. ఉగ్రవాదులకు తుపాకులు అమ్మడం క్షేమం కాదని మేం భావిస్తున్నాం' అన్న బోర్డును ఆయన తన దుకాణం తలుపులకు తగిలించారు. అతేకాకుండా స్థానిక దినపత్రికల్లోనూ ఈ ప్రకటన ఇచ్చారు. అమెరికా అధ్యక్షురాలిగా హిల్లరీకి మద్దతు ఇచ్చేవారికి, ముస్లింలకు తుపాకులు అమ్మకుండా ఉండే స్వేచ్ఛ ఒక యాజమానిగా తనకు ఉందని, అందుకే వారు తన దుకాణానికి వస్తే.. వారికి అమ్మేందుకు తిరస్కరిస్తున్నానని ఆయన చెప్పారు. అమెరికాలో తుపాకుల సంస్కృతి విచ్చలవిడిగా ఉన్న సంగతి తెలిసిందే. -
అమెరికాలో పెరుగుతున్న తుపాకుల అమ్మకాలు
అమెరికాలో తుపాకుల అమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులోనే తుపాకుల కొనుగోలు కోసం 18,53,815 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయని, ఇది గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఆరు శాతం ఎక్కువని ఎఫ్‌బీఐ అధికారులు తెలిపారు. దరఖాస్తులు వచ్చినంత మాత్రానే అంతమేర తుపాకుల అమ్మకాలు ఉంటాయని భావించలేమని.. అయినా తుపాకుల కొనుగోలుకు పెరుగుతున్న డిమాండ్‌ను ఈ దరఖాస్తుల సంఖ్య సూచిస్తోంది అధికారులు తెలిపారు. తుపాకుల కోసం కొనుగోలుదారులు ముందుగా డీలర్లకు దరఖాస్తు చేసుకోవాలి. అందులో తమ వ్యక్తిగత వివరాలతోపాటు చిరునామాను, దాన్ని ధ్రువీకరించే పత్రాలను సమర్పించాలి. కొనుగోలుదారుల నేరచరిత్రను తెలుసుకోవడం కోసం డీలర్లు ఆ దరఖాస్తులను ఎఫ్‌బీఐ తనిఖీకి పంపుతారు. సర్వసాధారణంగా ఒకటి, అరా మినహా అన్ని దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఇటీవలి కాలంలో అమెరికాలో కాల్పుల ఘటనలు పెరిగిపోవడంతో భయాందోళనలకు గురవుతున్న ప్రజలు ఆత్మరక్షణ కోసం తుపాకుల కొనుగోలుకు పోటీ పడుతున్నారని ఎఫ్‌బీఐ అధికారులు చెబుతున్నారు. అలాగే కాల్పుల ఘటనలు జరిగినప్పుడల్లా చట్టాలు మరింత కఠినతరం అవుతాయేమోనన్న ఆందోళనతో కూడా కొందరు ఇప్పుడే తుపాకులు కొనేసుకోవాలని భావిస్తుండొచ్చన్నారు. దేశంలో తుపాకుల అమ్మకాలు పెరగడానికి దేశాధ్యక్ష ఎన్నికలు కూడా ఒక కారణమేనని చెబుతున్నారు. తాను అధికారంలోకి వస్తే తుపాకుల అమ్మకాలను మరింత కఠినతరం చేస్తామని, దేశంలో జరిగే కాల్పుల ఘటనలకు అమ్మకందార్లను కూడా బాధ్యులను చేస్తామని డెమోక్రట్ల తరఫున దేశాధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్ ప్రకటించారు. తుపాకులను విక్రయిస్తున్న అమెరికాలోని 'స్మిత్ అండ్ వెస్సెన్', 'స్టర్మ్ రూగర్' అనే ప్రముఖ కంపెనీల అమ్మకాలు కూడా ఈసారి భారీగా పెరిగిపోయాయి. స్మిత్ అండ్ వెస్సెన్ కంపెనీ అమ్మకాలు ఈసారి 40 శాతం పెరగ్గా, రూగర్ కంపెనీ అమ్మకాలు 19శాతం పెరిగాయి. -
తుపాకితో కాలుస్తూ.. ఫేస్బుక్లో లైవ్!
ఫేస్బుక్లో 'లైవ్ వీడియో' అనే ఫీచర్ మామూలువాళ్లకు ఎంతవరకు ఉపయోగపడుతోందో గానీ, దుర్వినియోగం చేసుకునేవాళ్లకు మాత్రం అది చక్కగా ఉంది. గన్ కల్చర్ వెర్రితలలు వేస్తున్న అమెరికాలో ఓ వ్యక్తి తుపాకితో వేరేవాళ్లను కాలుస్తూ ఆ దృశ్యాలను ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ కావడంతో షికాగో పోలీసులు దానిపై దర్యాప్తు చేస్తున్నారు. నీలిరంగు టోపీ పెట్టుకున్న ఓ వ్యక్తి ముందుగా షికాగోలోని వెస్ట్ ఈగిల్వుడ్ ప్రాంతంలో గల ఓ స్టోర్స్ బయట కెమెరా ఎదుట మాట్లాడుతూ కనిపించాడు. కొంతసేపటి తర్వాత, తుపాకి కాల్పుల మోత వినిపించి, కెమెరా వీధివైపు తిరిగింది. నిందితుడు కూడా ఫ్రేమ్‌లోకి వచ్చి కాల్పులు కొనసాగిస్తాడు. కాసేపటికి ఓ మహిళ అరుపులు వినిపించాయి. వీడియో నిజమైనదేనని షికాగో పోలీసులు నిర్ధారించారు. సోషల్ మీడియాలో ఉన్న ఈ వీడియో గురించి తమకు తెలుసని, నిందితుడి గురించి కూడా విచారణ జరుపుతున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ నిందితుడు పరారీలో ఉన్నాడు. -
అమెరికా యూనివర్సిటీలో కాల్పులు.. ఒకరి మృతి
అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఆరెగాన్ ప్రాంతంలో తొమ్మిది మందిని కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్న ఘటనను అమెరికన్లు ఇంకా మర్చిపోక ముందే తాజా ఘటన జరగడం గమనార్హం. తమ దేశంలో గన్ కల్చర్ గురించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. ఇంకా కాల్పుల ఘటనలు అడపాదడపా కనిపిస్తూనే ఉన్నాయి. అమెరికా కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి 1.20 గంటల ప్రాంతంలో తొలిసారిగా ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. కాల్పులకు తెగబడిన వ్యక్తి వివరాలు గానీ, బాధితుల వివరాలు గానీ ఇంతవరకు తెలియరాలేదు. తెల్లవారుజామున కాల్పులు జరిగిన మాట నిజమేనని, కాల్చిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని యూనివర్సిటీ అధికార ప్రతినిధి సిండీ బ్రౌన్ తెలిపారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటల తర్వాత ఘటన వివరాలు పూర్తిగా వెల్లడిస్తారంటున్నారు.