ముస్లింలకు తుపాకులు అమ్మబోం!
అమెరికాలో తుపాకులు అమ్మే ఓ దుకాణం సరికొత్త వివాదానికి తెరతీసింది. ముస్లింలకు, హిల్లరీ క్లింటన్ మద్దతుదారులకు తాము తుపాకులు అమ్మబోమంటూ తన దుకాణంలో ఓ బోర్డు పెట్టింది. అంతేకాకుండా దినపత్రికల్లోనూ ఇదేవిధంగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చింది. ఉగ్రవాదులకు తుపాకులు అమ్మడం క్షేమం కాదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.
పెన్సిల్వేనియా రూరల్ జాక్సన్ సెంటర్‌కు చెందిన పాల్ చాండ్లెర్ (54)కు ‘అల్ట్రా ఫైర్‌ఆర్మ్స్’ పేరిట తుపాకులు అమ్మే దుకాణం ఉంది. అయితే, తన దుకాణానికి తుపాకులు కొనేందుకు వచ్చే ముస్లింలు, హిల్లరీ క్లింటన్ మద్దతుదారులను ఉత్తచేతులతో తిప్పిపంపుతున్నట్టు ఆయన తెలిపారు. 'దయచేసి ముస్లింలు, హిల్లరీ క్లింటన్ మద్దతుదారులు రావొద్దు. ఉగ్రవాదులకు తుపాకులు అమ్మడం క్షేమం కాదని మేం భావిస్తున్నాం' అన్న బోర్డును ఆయన తన దుకాణం తలుపులకు తగిలించారు. అతేకాకుండా స్థానిక దినపత్రికల్లోనూ ఈ ప్రకటన ఇచ్చారు. అమెరికా అధ్యక్షురాలిగా హిల్లరీకి మద్దతు ఇచ్చేవారికి, ముస్లింలకు తుపాకులు అమ్మకుండా ఉండే స్వేచ్ఛ ఒక యాజమానిగా తనకు ఉందని, అందుకే వారు తన దుకాణానికి వస్తే.. వారికి అమ్మేందుకు తిరస్కరిస్తున్నానని ఆయన చెప్పారు. అమెరికాలో తుపాకుల సంస్కృతి విచ్చలవిడిగా ఉన్న సంగతి తెలిసిందే.