అమెరికా మళ్లీ నెత్తురోడింది. తరాలుగా వెర్రితలలు వేస్తున్న తుపాకుల సంస్కృతి మరోసారి వికటాట్టహాసం చేసింది. ముక్కుపచ్చలారని 19 మంది పసి పిల్లలను బలి తీసుకుంది.
హూస్టన్: అమెరికాలో ఓ 18 ఏళ్ల యువకుడు మారణహోమానికి తెగబడ్డాడు. ఓ ఎలిమెంటరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులకు దిగాడు. 19 మంది స్టూడెంట్లతో పాటు ఇద్దరు టీచర్లను పొట్టన పెట్టుకున్నాడు. టెక్సాస్ రాష్ట్రంలో శాన్ ఆంటోనియోకు 134 కిలోమీటర్ల దూరంలోని ఉవాల్డే టౌన్లో మంగళవారం ఈ ఘోరం జరిగింది. హంతకున్ని సాల్వడార్ రామోస్ అనే స్థానికునిగా గుర్తించారు.
అతను బులెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించి ఏఆర్–15 సెమీ ఆటోమాటిక్ రైఫిల్, మరో హాండ్ గన్, భారీ సంఖ్యలో బులెట్ మ్యాగజైన్లతో ఉదయం 11.30కు స్థానిక రాబ్ ఎలిమెంటరీ స్కూల్లోకి చొరబడ్డాడు. ఓ క్లాస్‌రూమ్‌లో దూరి విచక్షణారహితంగా కాల్పుల వర్షం కురిపించాడు. దాంతో 14 మంది పిల్లలు, ఇద్దరు టీచర్లు అక్కడికక్కడే నేలకొరిగారు. మరో ఐదుగురు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు రంగప్రవేశం చేసి హంతకున్ని కాల్చేశారు.
చనిపోయిన బాలలంతా 5 నుంచి 10 ఏళ్ల లోపు వాళ్లేనని వెల్లడిస్తూ నగర పోలీస్ చీఫ్ కన్నీటిపర్యంతమయ్యారు. క్లాస్‌రూమ్‌లో 30 మంది దాకా పిల్లలున్నట్టు సమాచారం. వారిలో చాలామంది గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అంటున్నారు. ఆస్పత్రుల విజ్ఞప్తికి స్పందించి వారికి రక్తం అందించడానికి చాలామంది ముం దుకొచ్చారు.
ఇంతటి ఘోరానికి కారణాలు ఇంకా తెలియకపోయినా, హంతకుడు చిన్నప్పుడు స్కూల్లో తోటి పిల్లల చేతిలో నిత్యం హేళనలకు గురై స్కూలు మానేశాడని అతని స్నేహితుడు చెబుతున్నాడు. ఆ గాయాలే ఈ దారుణానికి పురిగొల్పి ఉంటాయని భావిస్తున్నారు. స్కూల్లో నరమేధానికి ముందు ఇంట్లో నాయనమ్మను కూడా అతడు కాల్చి తీవ్రంగా గాయపరిచాడని తెలుస్తోంది.
కాల్పులపై దేశమంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో తుపాకీ సంస్కృతిపై మరోసారి సర్వత్రా చర్చ మొదలైంది. దానికి ఇకనైనా చరమగీతం పాడాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. 10 రోజుల క్రితమే న్యూయార్క్‌లో ఓ జాత్యహంకారి కాల్పుల్లో 10 మంది నల్లజాతీయులు మరణించడం తెలిసిందే.
తీవ్రంగా కలచివేసింది: కమల
కాల్పుల ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. ‘‘ఇలాం టివి జరిగినప్పుడు ‘మా గుండెలు బద్దలయ్యా’ యని అనడం సహజం. కానీ నిత్యం జరుగుతున్న కాల్పులతో అమెరికన్ల గుండెలు పదేపదే బద్దలవుతూనే ఉన్నాయి. ఇకనైనా మనం ధైర్యం కూడదీసుకోవాలి. వీటికి శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగాలి’’ అన్నారు.
ఈ ఏడాది 212 మాస్ షూటౌట్లు
అమెరికాలో ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా 212 సామూహిక కాల్పుల ఘటనలు జరిగినట్టు గన్ వయోలెన్స్ ఆర్కైవ్ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. నలుగురు, అంతకంటే ఎక్కువ మంది చనిపోతే సామూహిక కాల్పుల ఘటనగా చెబుతారు. ఇలాంటివి సగటున రోజుకు ఒకటి కంటే ఎక్కవగా జరుగుతుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని సీఎన్‌ఎన్ వార్తా సంస్థ వాపోయింది. అమెరికాలో స్కూళ్లలో కాల్పులు జరగడం ఈ ఏడాది ఇది 27వ సారి! తాజా హత్యాకాండ అమెరికాలో జరిగిన అతి పెద్ద స్కూలు దారుణాల్లో రెండోది. 2012లో కనెక్టికట్‌లో శాండీ హాక్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 26 మంది మరణించారు.
ఆయుధ లాబీలకు ముకుతాడు: బైడెన్
తుపాకుల వాడకాన్ని నియంత్రిద్దాం
ఆ దిశగా చట్టాన్ని కఠినతరం చేద్దాం
చట్టసభల సభ్యులకు అధ్యక్షుని పిలుపు
కాల్పులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. జపాన్‌లో క్వాడ్ సదస్సులో పాల్గొని అధ్యక్ష విమానం ఎయిర్‌ఫోర్స్‌వన్‌లో తిరిగొస్తుండగా ఆయనకు విషయం తెలిసింది. దాంతో, ఇది మాటలకందని దారుణమంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సంతాప సూచకంగా దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని శనివారం సాయంత్రం దాకా సగం మేర అవనతం చేయాలని ఆదేశించారు. విమానంలో నుంచే జాతినుద్దేశించి ప్రసంగించారు.
‘‘అభంశుభం తెలియని చిన్నారులు తమ కళ్లముందు జరిగిన ఈ బీభత్సానికి ఎంతగా హడలిపోయి ఉంటారో! స్నేహితులు కళ్ల ముందే కాల్పులకు బలవుతుంటే ఎంతగా తల్లడిల్లి ఉంటారో!! పిల్లలను కోల్పోవడమంటే ఆత్మలో ఓ భాగాన్ని పోగొట్టుకోవడమే. ఆ ఆలోచనే హృదయంలో అంతులేని శూన్యం నింపుతుంది’’ అంటూ ఆక్రోశించారు. వాషింగ్టన్ చేరుతూనే భార్య జిల్‌తో కలిసి మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లను ప్రస్తావించారు.
ఆ దిశగా కార్యాచరణకు దిగేందుకు తాజా ఘటనే నాంది కావాలని చట్టసభ సభ్యులకు పిలుపునిచ్చారు. ‘‘నేను జపాన్ బయల్దేరే కొద్ది రోజుల ముందే న్యూయార్క్‌లోని బఫెలోలో జాతి విద్వేష కాల్పలకు 10 మంది నల్లజాతీయులు బలయ్యారు. వారి కుటుంబాలను ఓదార్చిన క్షణాలు నా మనసులో ఇంకా తాజాగానే ఉన్నాయి. ఈలోపే దాన్ని తలదన్నే మరో ఘోరం!’’ అంటూ ఆక్రోశించారు.
‘‘ఇతర దేశాల్లో అత్యంత అరుదుగా జరిగే ఇలాంటి దారుణాలు అమెరికాలో మాత్రం పదేపదే జరిగేందుకు మనమెందుకు అవకాశమిస్తున్నాం? మన చేతుల్లో ఏమీ లేదని చెప్పొద్దు. ఇలాంటివి వినీ వినీ విసిగిపోయాను. ఆయుధ లాబీలను అడ్డుకునేందుకు, వాటికి ముకుతాడు వేసేందుకు సత్తా మనలో కరువైందా?’’ అంటూ ప్రశ్నించారు. ‘‘ఇంకా ఉపేక్షించేది లేదు. చేతలకు దిగాల్సిన సమయం ఆసన్నమైంది’’ అన్నారు. ‘‘తుపాకుల సంస్కృతికి అడ్డుకట్టే వేసేలా చట్టాన్ని కఠినతరం చేయాల్సిందే. ఇందుకు చట్టసభ సభ్యులను ఒప్పించేందుకు ఏం చేయాలో ఆలోచిస్తాం’’ అని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment