అమెరికా యూనివర్సిటీలో కాల్పులు.. ఒకరి మృతి
అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఆరెగాన్ ప్రాంతంలో తొమ్మిది మందిని కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్న ఘటనను అమెరికన్లు ఇంకా మర్చిపోక ముందే తాజా ఘటన జరగడం గమనార్హం. తమ దేశంలో గన్ కల్చర్ గురించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. ఇంకా కాల్పుల ఘటనలు అడపాదడపా కనిపిస్తూనే ఉన్నాయి.
అమెరికా కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి 1.20 గంటల ప్రాంతంలో తొలిసారిగా ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. కాల్పులకు తెగబడిన వ్యక్తి వివరాలు గానీ, బాధితుల వివరాలు గానీ ఇంతవరకు తెలియరాలేదు. తెల్లవారుజామున కాల్పులు జరిగిన మాట నిజమేనని, కాల్చిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని యూనివర్సిటీ అధికార ప్రతినిధి సిండీ బ్రౌన్ తెలిపారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటల తర్వాత ఘటన వివరాలు పూర్తిగా వెల్లడిస్తారంటున్నారు.