
గంట పాటు వేచిచూసే ధోరణితో నరమేధానికి కారణం అయ్యారంటూ పోలీసులపై తీవ్ర విమర్శలు..
టెక్సాస్ యువాల్డే రాబ్ ఎలిమెంటరీ స్కూల్ మారణహోమంపై టెక్సాస్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. సుమారు గంటపాటు ఆగిన తర్వాత లోపలికి ప్రేవేశించడాన్ని తప్పుడు నిర్ణయంగా పేర్కొంటూ క్షమాపణలు తెలియజేశారు.
టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ హెడ్ స్టీవెన్ మాక్‌క్రా ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన చేశారు. టెక్సాస్ స్కూల్ కాల్పుల ఘటన సమయంలో.. సుమారు గంటపాటు వేచిచూసే ధోరణి అనేది తప్పుడు నిర్ణయంగా అభివర్ణించారు ఆయన. ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయం ఘోరానికి కారణమైందని పేర్కొన్నారు ఆయన. దుండగున్ని కాల్పులు జరపకుండా కాసేపు నిలువరించగలిగినా సరిపోయి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డాడు.
ఘటన సమయంలో త్వరగా స్పందించి ఉండాలని మీరైతే ఎలా అనుకుంటున్నారో.. మేమూ అదే అనుకుంటున్నాం. ఒకవేళ అదే గనుక నష్టనివారణ మార్గం అనుకుంటే.. నేను మీకు క్షమాపణలు చెప్తున్నా.. అంటూ మీడియా సాక్షిగా బాధిత కుటుంబాలకు ఆయన క్షమాపణలు తెలియజేశాడు. టీచర్లతో పాటు కొందరు పిల్లలు కూడా 911 కి ఫోన్ చేసి సాయం కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లల్ని రక్షించే అవకాశాలు ఉన్నా సకాలంలో పోలీసులు స్పందించలేదని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.
మంగళవారం రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో నరమేధం సృష్టించిన సాల్వడోర్ రామోస్(18)ను మట్టుపెట్టడానికి.. ఒక గంట సమయం పట్టింది. ఆ సమయంలో కొందరు పోలీసులు బయట ఉండగా.. పేరెంట్స్ దూసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. ఉదయం 11.30 గం. ప్రాంతంలో సాల్వడోర్ స్కూల్‌లోకి ప్రవేశించగా.. సుమారు 48 నిమిషాలపాటు కాల్పులు కొనసాగాయి. అయితే మధ్యాహ్నం 12.50 గం. ప్రాంతంలో యూఎస్ బార్డర్ పాట్రోల్ ఏజెంట్లు తలుపులు బద్ధలు కొట్టి కాల్చి చంపారు.
చదవండి: ఆ చిన్నారి ఒంటికి రక్తాన్ని పూసుకుని బతికి బయటపడింది