
ఎదురుగా మృత్యువు.. ఉన్మాది రూపంలో ఉంది. తుపాకుల మోత.. బుల్లెట్లతో చిధ్రమైన పసికందుల దేహాలు..
ప్రాణాలు పోతున్నా.. తుపాకీ ఘటనలకు అడ్డుకట్ట వేయడంలో అగ్రరాజ్యం ఘోరంగా విఫలమవుతోంది. టెక్సాస్ స్కూల్ కాల్పుల ఘటనపై బైడెన్ ప్రభుత్వాన్ని విమర్శించని వాళ్లంటూ లేరు ఇప్పుడు. చనిపోయిన పిల్లలు, టీచర్ల కుటుంబాల వ్యథ ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది.
‘‘మీకు దణ్ణం పెడతాం. ఏదో ఒకటి చేయండి. చనిపోయిన ఈ పిల్లల్ని గుర్తుపెట్టుకుని.. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడండి. నా మనవరాలు చిన్నపిల్ల. అలాంటి ప్రాణాలు మరిన్ని పోకుండా చూడండి. దయచేసి చర్యలు తీసుకోండి’’ అని కన్నీళ్లతో బతిమాలుతోంది 63 ఏళ్ల ఓ బామ్మ. ఆమె పదేళ్ల మనవరాలు అమెరీ గార్జా.. కాల్పుల ఘటనలో కన్నుమూసింది.
ఇదిలా ఉంటే.. 11 ఏళ్ల వయసున్న మియా సెర్రిల్లో కాల్పుల ఘటన నుంచి ప్రాణాలతో బయటపడింది. సమయస్ఫూర్తితో ఆమె వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో కాల్పుల సమయంలో మియా.. ఓ స్నేహితురాలు పూర్తిగా రక్తపుమడుగులో పడి ఉండడం గమనించింది. వెంటనే ఆ రక్తం తన ఒంటికి, బట్టలకు రాసుకుని చనిపోయినట్లు నటించింది. ఇంతలో తుపాకీతో వచ్చిన దుండగుడు.. ఆమె శరీరాన్ని తన్నుకుంటూ పరీక్ష చేసి వెళ్లిపోయాడట.
అంతేకాదు.. అలా నటించే ముందు చనిపోయిన తన టీచర్ దగ్గరి నుంచి ఫోన్ తీసుకుని.. 911 ఎమర్జెన్సీ నెంబర్‌కు సాయం కోసం ఫోన్ చేసినట్లు వెల్లడించింది. కాల్పులు జరిపిన వ్యక్తి తన దగ్గరకు వచ్చినప్పుడు.. తనను కూడా కాలుస్తాడని భయపడిపోయిందట!.
అయితే దాడిలో బుల్లెట్ శకలాలతో స్వల్పంగా గాయపడిన ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకున్నా.. దాడి భయం మాత్రం ఆమెలో ఇంకా పోలేదు. ఇదిలా ఉంటే 19 మందిని పొట్టనబెట్టుకున్న 18 ఏళ్ల సాల్వడోర్ రామోస్‌ను మట్టుపెట్టేందుకు గంటకు పైగా సమయం తీసుకున్నారు. దీంతో టెక్సాస్ పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చదవండి: నరమేధాలకు కారణం వాళ్లేనా?