అది 2023, మే 6.. అమెరికాలోని టెక్సాస్ స్టేట్‌లోని ఎలన్ పట్టణంలోగల ఒక షాపింగ్ మాల్‌లో ఉన్నట్టుండి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కాల్పులకు పాల్పడిన వ్యక్తితో పాటు మొత్తం 9 మంది మృతి చెందారు. వీరిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. ఏడుగురు గాయపడ్డారు. హంతకుడిని పోలీసులు మట్టుబెట్టారు.
ప్రత్యక్ష సాక్షి చెప్పిందిదే..
ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలోను, ఫొటోలలోను రక్తపుమడుగులో నేలపై పడి ఆర్తనాదాలు చేస్తున్న బాధితులు, మృతులు దయనీయ స్థితిలో కనిపించారు. వారి మధ్య హంతకుడు కూడా ఉన్నాడు. అతని మృతదేహం వద్ద ఒక తుపాకీ కూడా ఉంది. ఈ ఘటనను చూసిన ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. అతను షాపింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి తుపాకీ కాల్పుల మోత వినిపించింది. వెంటనే అతను ఒక పక్కకు వెళ్లి దాక్కున్నాడు. ఇంతలో పోలీసులు షాపింగ్ మాల్‌లోని వారిని బయటకు వెళ్లిపోవాలని చెప్పడంతో తాను కూడా బయటకు వెళ్లిపోయానన్నారు. అక్కడ తనకు చాలా మృతదేహాలు కనిపించాయన్నారు.
తెలుగు యువతి దుర్మరణం
ఈ ఘటనలో ఒక తెలుగు యువతి దుర్మరణం పాలయ్యింది. హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఐశ్వర్య టెక్సాస్ కాల్పులలో మృతి చెందింది. ఆమె రంగారెడ్డి జిల్లా జడ్జి తాతికొండ నర్సరెడ్డి కుమార్తె. ఐశ్వర్య అమెరికాలోని ఒక కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తోంది.
అలెర్ట్ అయిన పోలీసులు
ఈ కాల్పుల ఘటన జరిగిన వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు. మారణాయుధంతో దాడులకు తెగబడిన నరరూపరాక్షసుడిని మట్టుబెట్టారు. అతనొక్కడే ఈ కాల్పులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. దుండగుడిని 33 ఏళ్ల మారిసియో గార్సియాగా గుర్తించారు. ఈ ఘటనకు కారణమేమిటన్నదానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
4 నెలల్లో 198 కాల్పుల ఘటనలు
గన్ కల్చర్ ఆర్కైవ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది అమెరికాలో ఇప్పటివరకూ మొత్తం 198 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 30న జరిగిన మాస్ షూటింగ్‌లో ఆగంతకుడు ఐదుగురిని తుపాకీ కాల్పులకు బలితీసుకున్నాడు. ఈ ఘటనలో 9 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు.
33 కోట్ల జనాభాలో 40 కోట్ల తుపాకులు
అమెరికా స్వాతంత్ర్యం సాధించి 231 ఏళ్ల దాటినా గన్ కల్చర్ అంతంకాలేదు. దీని వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. 2019కి సంబంధించిన ఒక రిపోర్టు ప్రకారం అమెరికాలో 63 వేల మంది గన్‌కల్చర్ డీలర్లు ఉన్నారు. వీరు అదే ఏడాది ఆమెరికా పౌరులకు 83 వేల కోట్ల రూపాయల విలువైన తుపాకులను విక్రయించారు. ప్రపంచంలోని మొత్తం 85.7 కోట్ల సివిలియన్ గన్‌లలో ఒక్క అమెరికాలోనే 39.3 కోట్లు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో అమెరికా జనాభా 5 శాతం. అయితే ప్రపంచం మొతంలో గల సివిలియన్ గన్‌లలో 46 శాతం కేవలం అమెరికాలోనే ఉండటం విశేషం.
ఇది కూడా చదవండి: ఫ్రాన్స్ అల్లర్లలో కొత్త కోణం.. అల్లరి మూకల చేతుల్లో ఆధునాతన ఆయుధాలు
Comments
Please login to add a commentAdd a comment