
ఎలుగుబంటి కళేబరాన్ని పరిశీలిస్తున్న అటవీ అధికారులు
ప్రకాశం, గిద్దలూరు: అడవిలో అరుదుగా కనిపించే ఎలుగుబంటిని నాటు తుపాకీతో కాల్చి చంపిన సంఘటన మండలంలోని ఉయ్యాలవాడ పంచాయతీ పరిధి అంకాలమ్మపల్లె సమీప నల్లమల అడవిలో జరిగింది. ఈ సంఘటన గురువారం జరగ్గా శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం.. నల్లమల అడవులకు దగ్గరగా ఉన్న అంకాలమ్మపల్లెకు చెందిన ఇద్దరు అడవిలో తిరిగే ఎలుగుబంటిని నాటు తుపాకీతో కాల్చి చంపారు. మృతి చెందిన ఎలుగుబంటి కళేబరాన్ని గ్రామానికి సమీపంలో ఉన్న కొత్త చెరువులోకి తీసుకొచ్చారు. ఎలుగుబంటికి చర్మం తీసి మాంసం ముక్కలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతలో సమాచారం అందుకున్న అటవీ అధికారులు కొత్తచెరువుకు వెళ్లి దాడులు నిర్వహించగా ఎలుగుబంటి కళేబరం వద్ద ముగ్గురు కనిపించారు. ఇందులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అటవీ అధికారులు కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలంలో దొరికిన వారిలో అంకాలమ్మపల్లెకు చెందిన ఉయ్యాలవాడ బాలచెన్నయ్య, దిగువమెట్ట తండాకు చెందిన లక్ష్మీనాయక్ ఉన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన అటవీ అధికారులు స్థానిక కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించారు.
ఇన్‌ఫార్మరే వేటగాడయ్యాడా?
అడవుల్లో ఎలాంటి చట్టవ్యతిరేక చర్యలు జరిగినా అధికారులకు తక్షణమే సమాచారం ఇచ్చేందుకు ప్రతి గ్రామంలోనూ కొంత మందిని ఇన్‌ఫార్మర్‌లుగా ఏర్పాటు చేసుకోవడం పోలీసు, అటవీ, ఎక్సైజ్ వంటి శాఖలకు అవసరం. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తిని అటవీశాఖాధికారులు ఇన్‌ఫార్మర్‌గా నియమించుకున్నారు. ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించిన వ్యక్తే నాటు తుపాకీతో ఎలుగుబంటిని చంపేసి మాంసం విక్రయించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సంఘటన జరిగినప్పుడు సమాచారం ఇవ్వాల్సిన ఇన్‌ఫార్మర్ ఎలుగుబంటి కళేబరాన్ని, నిందితులు పట్టుబడిన తర్వాత అటవీశాఖ ఉన్నతాధికారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. మీ అధికారులకు సమాచారం ఇచ్చానని, వారు పట్టించుకోలేదని కింది స్థాయి ఉద్యోగులపై ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానం వచ్చిన వారు ఆరా తీయగా అసలు నిందితుడు ఇన్‌ఫార్మరే అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనలో పట్టుబడిన ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నామని, ఇందులో ఇంకా ఎవరైనా ఉంటే వారిని కూడా త్వరలో అరెస్టు చేయనున్నట్లు గిద్దలూరు రేంజి అధికారి కుమారరాజ తెలిపారు.
పెద్దల సమక్షంలో దహనం
అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్న కళేబరానికి సంజీవరాయునిపేట పశువైద్యాధికారి సాయిచక్రవర్తి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో కళేబరాన్ని సంఘటన స్థలంలోనే దహనం చేశారు. అటవీ జంతువులను చంపడం నేరమని, ఎవరైనా ఇలాంటి దారుణాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని, నేరగాళ్లు ఎంతటి వారైనా వదిలి పెట్టమని అటవీశాఖ సబ్ డీఎఫ్‌ఓ నాగభూషణం, రేంజర్ కుమారరాజ, డిప్యూటీ రేంజర్ వెంకటరమణలు ప్రజలను హెచ్చరించారు. అటవీ జంతువులను కాపాడుకోవాలని అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment