వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బైడెన్ తొలిసారిగా దేశంలోని తుపాకీల సంస్కృతికి చరమగీతం పాడటంపై దృష్టి సారించారు. దేశంలో గన్స్ అతి వాడకాన్ని నియంత్రిస్తూ బైడెన్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నట్టుగా వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ‘గన్ వయలన్స్ పబ్లిక్ హెల్త్ ఎపడిమిక్’ పేరుతో బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఫెడరల్ ఏజెంట్, తుపాకుల నియంత్రణ వ్యవస్థకి సలహాదారుడైన డేవిడ్ చిప్‌మ్యాన్‌ను బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్‌ఆర్మ్స్,ఎక్స్‌ప్లోజివ్స్‌కు (ఏటీఎఫ్)కు డైరెక్టర్‌గా నియమించారు.
అమెరికాలో ఘోస్ట్ గన్స్ తయారీని నియంత్రించడానికి బైడెన్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ గన్స్ రిజిస్టర్ అయినవి కావు. తుపాకీ విడి భాగాలను ఒక చోట అమర్చి ఇంట్లోనే తయారు చేస్తూ వీటిని యథేచ్ఛగా అమ్మేస్తూ ఉంటారు. అలాంటి తుపాకులతో కాల్పులకు దిగితే అదెక్కడ తయారైందో తెలుసుకోవడం కష్టం. అందుకే ఈ తుపాకుల నియంత్రణకు ఏయే చర్యలు తీసుకోవాలో చెప్పాలంటూ న్యాయశాఖని బైడెన్ ఆదేశించారు. ఇందుకోసం నెలరోజులు గడువు ఇచ్చారు.
నేషనల్ ఫైర్ ఆర్మ్స్ చట్టం కిందకి పిస్టల్స్‌ని నియంత్రించాలని నిర్ణయించారు. ఈ పిస్టల్స్‌ని అత్యవసర వినియోగానికి రైఫిల్స్ కింద మార్చే వీలుంటుంది. బౌల్డర్‌లో ఇటీవల జరిగిన కాల్పుల్లో రైఫిల్‌గా మార్చిన పిస్టల్‌నే నిందితుడు వినియోగించినట్టుగా తేలింది. దీంతో వీటిపైనా నియంత్రణ విధించాలని నిర్ణయించారు. ఎవరికైనా ప్రాణభయం ఉంటే తుపాకులు వెంట ఉంచుకుంటారు.
అలాంటి వారు కూడా తుపాకుల వాడకానికి దూరంగా ఉండేలా న్యాయశాఖ సిఫారసులు చేయాలి. తుపాకుల వినియోగాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాలంటే బైడెన్ చేపట్టిన చర్యలన్నీ చట్టంగా మారాల్సి ఉంది. కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు వీటికి మద్దతు ఇస్తారో లేదా అన్నది అనుమానమే. వీటిలో చాలా ప్రతిపాదనలకు రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్‌లో తుపాకుల నియంత్రణకు సంబంధించిన చట్టాలన్నీ ఆమోదం పొందేలా రాజకీయ మద్దతు కూడగట్టడానికి బైడెన్ సర్కార్ వ్యూహరచన చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment