అమెరికా స్కూళ్లలో ఇదేమి ‘దృశ్యం’
న్యూయార్క్: అది మంచు కురుస్తున్న శీతాకాలం ఓ రోజు. ఎముకలు కొంకర్లు తిరిగిపోయే పరిస్థితి. బ్రూక్లిన్‌లోని ఓ హైస్కూల్ ముందు పిల్లలంతా వరుసగా క్యూలో నిలబడ్డారు. ఒకరి తర్వాత ఒకరు చలి నుంచి కాపాడే జాకెట్లను, చేతి గ్లౌజులను, ఆ తర్వాత బెల్టులను, సాక్సులను, షూలను ఒక్కొక్కటిగా విప్పేశారు. గజగజ వణుకుతూ మెటల్ డిటెక్టర్ ద్వారం గుండా వెళ్లేందకు నిలుచున్నారు.
ఈలోగా తమ పుస్తకాల బ్యాగులను ఎక్స్ రే యంత్రానికి పంపించారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది తదేకంగా స్కానర్ల వైపు చూస్తున్నారు. అచ్చం మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించే లాంటి ఈ దృశ్యం గంటసేపు కనిపిస్తుంది. ఇది ఒక్క రోజు జరిగేది కాదు. ప్రతి రోజు జరిగేదే. ఇది ఒక్క స్కూల్లో కనిపించే దృశ్యం కాదు. మొత్తం న్యూయార్క్ లోని వేలాది స్కూళ్లలో ప్రతిరోజు కనిపించే దృశ్యం.
మెటల్ డిటెక్టర్లు, స్కానింగ్ పరీక్షల కోసం పిల్లలంతా స్కూల్ ప్రారంభ వేళకన్నా గంట ముందే వచ్చి క్యూలో నిలబడాలి. ఇక్కడా వివక్షత కొనసాగుతోంది. శ్వేతజాతీయుల పిల్లలు ఒక్కసారి మెటల్ డిటెక్లర్ల గుండా వెళ్లాల్సి వస్తే, నల్లజాతీయుల పిల్లలు, ఇస్పానిక్ విద్యార్థులు మూడుసార్లు వెళ్లాల్సి ఉంటుంది. జాతి విద్వేషాలకు అంకురార్పణ జరిగేది ఇక్కడే. దాదాపు 22 ఏళ్ల క్రితం మొదలైన్ ఈ చెకింగ్ విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. 1992, ఫిబ్రవరి నెలలో బ్రూక్లిన్‌లోని థామస్ జఫర్ స్కూల్‌లో ఇద్దరు విద్యార్థులు తుపాకీ గుళ్లకు బలయ్యారు. అదే రోజు అదే స్కూల్‌కు చెందిన మరో విద్యార్థి ఇంటి వద్ద పొరపాటున తుపాకీ పేలడం వల్ల చనిపోయారు. మధ్యాహ్నం అదే స్కూల్లో జరగాల్సిన ఓ కార్యక్రమానికి అప్పటి నగర మేయర్ డేవిడ్ బింకిన్స్ హాజరుకావాల్సి ఉంది. కాల్పుల సంఘటన కారణంగా ఆ కార్యక్రమం రద్దయింది. ఈ సంఘటన నేపథ్యంలోనే నగరంలోని దాదాపు 40 స్కూళ్లలో మెటల్ డెటెక్టర్లు ఏర్పాటు చేశారు. రెండోసారి కూడా మేయర్‌గా డేవిడ్ ఎన్నికవడంతో దీన్ని 1,069 స్కూళ్లకు విస్తరించారు. అదనంగా స్కానర్లను కూడా ఏర్పాటు చేశారు.
1992, 93 ప్రాంతంలో న్యూయార్క్ సిటీ క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మేయర్ డేవిడ్ అప్పట్లో తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. 2003 నాటికి తనికీ వ్యవస్థను అన్ని స్కూళ్లకు విస్తరించారు. అప్పటికి క్రైమ్ రేటు దాదాపు 48 శాతం తగ్గినప్పటికీ ఈ వ్యవస్థను తొలగించలేదు. కాకపోతే కొత్త స్కూళ్లలో ఏర్పాటు చేయలేదు. ఆ తర్వాత ప్రజా సంఘాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఓ స్క్రూటినీ కమిటీ ఏర్పాటు చేసి రెండు స్కూళ్లలో ఈ తనిఖీ వ్యవస్థను తొలగించారు. దీనిపైనా గొడవవడంతో గత జూలైలో పోలీసు విభాగం మరో కమిటీని వేసింది. సరైన మార్గదర్శకాలను సూచించాల్సిందిగా ఆ కమిటీ ఉపాధ్యాయుల కమిటీని కోరింది. ఈ వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదు.
స్కూళ్లలో ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్లు, స్కానింగ్ యంత్రాల తనిఖీలో ఇప్పటి వరకు అన్‌లోడెడ్ హ్యాండ్ గన్ ఒకటి, బీబీ గన్స్ మూడు, 73 చాకులు, వందలాది బ్లేడ్లు దొరికాయని పోలీసుల నివేదిక వెల్లడిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దేశంలో తుపాకీ సంస్కృతిని అరికట్టేందుకు చట్టాలను కఠినతరం చేస్తున్నానంటున్న నేపథ్యంలో స్కూళ్లలో తనిఖీ వ్యవస్థ గురించి మళ్లీ చర్చకు వచ్చింది. ఈ వ్యవస్థను కొనసాగించడం వల్ల విద్యార్థులపై దుష్ర్పభావం ఎక్కువగా ఉంటుందని కొంతమంది టీచర్లు వాదిస్తుండగా, కొనసాగించాలని మెజారిటీ ఫ్యాకల్టీ లీడర్లు వాదిస్తున్నారు.
దీనికి సమాధానం మెటల్ డిటెక్టర్లు, స్కానర్ల లాంటి యంత్రాల్లో లేదు. మానవ సంబంధాల్లో ఉంది. మరి రేపటి పౌరులైన విద్యార్థులకు ఎలాంటి సంబంధాలను మనం బోధిస్తున్నాం. గురువులైన టీచర్లు, ప్రభుత్వ పెద్దలే విద్యార్థులను నమ్మకపోతే వారు మాత్రం తోటివారిని, ఇతరులను ఎలా నమ్ముతారు. వారికి సరైన సంస్కృతి బాటను చూపించనంతకాలం స్కూళ్లలో మెటల్ డిటెక్టర్లున్నా, లేకపోయినా లోపలికి తుపాకులు వెళుతూనే ఉంటాయి.