
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం అమలులో ఉన్న ఆయుధ చట్టంలో కేంద్ర ప్రభుత్వం కీలక సవరణ చేసింది. వ్యక్తిగత భద్రత కేటగిరీలో గరిష్టంగా రెండు తుపాకులు మాత్రమే కలిగి ఉండేలా మార్పు తీసుకువచ్చింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం మూడో ఆయుధం కలిగిన వారు తక్షణం దానిని డిపాజిట్ చేయాలని స్పష్టం చేశారు. సాధారణంగా తుపాకీ లైసెన్సును మూడు కేటగిరీల్లో జారీ చేస్తారు. వ్యక్తిగత భద్రత, సెక్యూరిటీ గార్డులు, ఫైరింగ్, క్రీడల సంబంధికులకు వీటిని ఇస్తుంటారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఒక లైసెన్సుపై గరిష్టంగా మూడు తుపాకులు కలిగి ఉండేందుకు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కేవలం 4,700 లైసెన్సులు ఉండగా.. ఆయుధాల సంఖ్య మాత్రం 10 వేల వరకు ఉంది. అయితే సదరు లైసెన్సుపై ఎన్ని ఆయుధాలు కలిగి ఉండవచ్చనే అంశాన్ని జారీ సమయంలోనే స్పష్టం చేస్తారు.
అంతకుమించి తుపాకులు కలిగి ఉండటానికి ఆస్కారం ఉండదు. వ్యక్తిగత భద్రత కేటగిరీలో ఆయుధ లైసెన్సు తీసుకుని దాని ఆధారంగా దానిని ఖరీదు చేసిన వారు మరో కేటగిరీలో వినియోగించడం చట్ట విరుద్ధం. గతంలో అమలులో ఉన్న ఆయుధ చట్టం నిబంధనల ప్రకారం వ్యక్తిగత భద్రత కేటగిరీలో ఒక్కో వ్యక్తి గరిష్టంగా మూడు ఆయుధాలు కలిగి ఉండటానికి ఆస్కారం ఉండేది. అయితే దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నట్లు గుర్తించిన కేంద్రం గత ఏడాది కీలక సవరణలు చేసింది. దాని ప్రకారం ఈ కేటగిరీలో గరిష్టంగా రెండు ఆయుధాలు మాత్రమే కలిగి ఉండాలి. దీనికి సంబంధించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని అధికారికంగా అందుకున్న నగర పోలీసు విభాగం అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా సోమవారం సీపీ వ్యక్తిగత కేటగిరీలో రెండు ఆయుధాలు మాత్రమే కలిగి ఉండాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూడో ఆయుధాన్ని తక్షణం స్థానిక పోలీస్ స్టేషన్ లేదా అధీకృత ఆయుధ విక్రేతల వద్ద డిపాజిట్ చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న లైసెన్సు రెన్యువల్ సమయంలో ఆయుధాల సంఖ్యను రెండుకు తగ్గించనున్నారు. లైసెన్సుదారుడు డిపాజిట్ చేసిన ఆయుధాన్ని మరో లైసెన్సుదారుడికి లేదా లైసెన్డ్సు ఆయుధ విక్రేతకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. దీనికి ఏడాది గడువు ఇస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. లైసెన్సు ఆయుధాలు కలిగి ఉన్న వారి జాబితా, వివరాలు పోలీసుస్టేషన్ల వారీగా అందుబాటులో ఉంటాయి.
లాక్‌డౌన్ హడావుడి ముగిసిన తర్వాత ఆడిటింగ్ చేపట్టాలని పోలీసు విభాగం నిర్ణయించింది. అందులో ఎవరైనా తమ మూడో ఆయుధం డిపాజిట్ చేయనట్లు తేలితే వారికి నోటీసులు జారీ చేయడంతో పాటు చట్ట పరంగా చర్యలు తీసుకోనున్నారు. నగర పోలీసు విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘తొలుత కేంద్రం వ్యక్తిగత భద్రత కేటగిరీలో ఒకరికి ఒక ఆయుధం మాత్రమే ఉండేలా మార్పులు చేయాలని భావించింది. అయితే అనేక వర్గాల నుంచి వచ్చిన ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని రెండు ఆయుధాలకు పరిమితం చేసింది. మూడో ఆయుధం కలిగిన వారు వెంటనే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది’ అని అన్నారు. ఇకపై ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పోలీసులు, సాయుధ బలగాల నుంచి ఆయుధం లాక్కుంటే వారికి గరిష్టంగా జీవితఖైదు పడేలా మరో సవరణను కేంద్రం తీసుకువచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment