సహనం కోల్పోతున్న సిబ్బంది.. | Constable Gun Fire in RTC Bus Hyderabad | Sakshi
Sakshi News home page

వెస్ట్‌.. వెపన్స్‌

Published Fri, May 3 2019 7:13 AM | Last Updated on Thu, May 9 2019 8:37 AM

Constable Gun Fire in RTC Bus Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సిటీలో మరోసారి తూటా పేలింది. ఆర్టీసీ సిటీ బస్సులో గురువారం ప్రయాణం చేస్తుండగా ఏపీ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌నాయుడు రెచ్చిపోయాడు. తన సర్వీస్‌ పిస్టల్‌తో బస్సులోనే ఓ రౌండ్‌ కాల్పులు జరిపాడు. మిట్ట మధ్యాహ్నం పంజగుట్ట ఠాణా పరిధిలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. వీఐపీ జోన్‌తో పాటు వెపన్స్‌ జోన్‌గానూ పేరున్న వెస్ట్‌జోన్‌లోనే తాజా ఘటన జరగడం గమనార్హం. నగరవ్యాప్తంగా ఉన్న లైసెన్స్‌డ్‌ ఆయుధాల్లో మూడొంతులు ఇక్కడే ఉన్నాయి. గత గణాంకాల ప్రకారం నగరంలోని 5 జోన్లలో కలిపి 5,145 ఆయుధ లైసెన్సులు, 6,568 వెపన్స్‌ ఉన్నాయి. వీటిలో కేవలం వెస్ట్‌జోన్‌లోనే 2,192 లైసెన్స్‌లు, 2,866 ఆయుధాలున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతోద్యోగులతో సహా ధనికవర్గం ఎక్కువగా ఉండే వెస్ట్‌జోన్‌లో ఆయుధాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రక్షణ కోసం కొందరు, స్టేటస్‌ సింబల్‌గా మరికొందరు వీటిని తమ దగ్గర ఉంచుకుంటున్నారు.

ఇక్కడే అత్యధికం..   
నగరంలో తుపాకీ ఉపయోగించి జరిగే నేరాల్లో అత్యధికం ఇక్కడే నమోదవుతూ ఉంటాయి. ఏడాదికి కనీసం ఒకటైనా ‘తుపాకీ’ సంచలనం జరుగుతూ ఉంటుంది. వీటిలో కొన్ని కొలిక్కి రానివీ ఉన్నాయి. ఆ

సంఘటనలివీ...
కేకే కుమారుడు వెంకట్రావ్‌ ఇంట్లో జరిగిన కాల్పుల్లో ప్రశాంత్‌రెడ్డి మరణించారు. ఈ కేసులో కోర్టులో వీగిపోయింది.  
వ్యాపారవేత్త రాజీవ్‌ సిసోడియాను కిరాయి హంతకులు కాల్చి చంపారు.  
రియాల్టర్‌ అర్షద్‌ సైతం తుపాకీ కాల్పుల్లోనే మరణించారు. ఇది కోర్టులో నడుస్తోంది.  
టైర్ల వ్యాపారి విజయ రాఘవన్‌పై కాల్పులు జరిగాయి. ఈ కేసు ఇప్పటికీ కొలిక్కి రాలేదు.  
అనంతపురం ఫ్యాక్షనిస్టు మద్దెలచెర్వు సూరిని బంజారాహిల్స్‌ పరిధిలోనే అతని అనుచురుడు భానుకిరణ్‌ కాల్చి చంపాడు. ఈ కేసులో భాను ఇంకా చిక్కలేదు.  
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, అదే నియోజకవర్గానికి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే సోదరికి మధ్య ఓ స్థలానికి సంబంధించి నెలకొన్న వివాదం కాల్పుల వరకు తీసుకెళ్లింది. సహనం కోల్పోయిన ఓ మాజీ ఎమ్మెల్యే గాల్లోకి మూడు రౌండ్లు కాల్చారు.  
అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్‌ ఉగ్రవాదుల, ఎస్పీ ఉమేశ్‌చంద్ర నక్సలైట్ల తూటాలకు బలైంది... గ్యాంగ్‌స్టర్‌ అజీజ్‌రెడ్డి పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించిందీ ఈ జోన్‌లోనే.  
ఎస్సార్‌నగర్‌ పరి«ధిలో అర్ధరాత్రి వేళ ప్లాట్‌ఫామ్‌పై నిద్రిస్తున్న చెప్పుల వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ కేసులో నిందితులు ఎవరనేది ఇప్పటికీ తేలలేదు.  

సహనం కోల్పోతున్న సిబ్బంది..   
నిత్యం విధులు, క్షణం తీరికలేని బతుకులు... ఇదీ ప్రస్తుతం పోలీసుల జీవన విధానం. ఈ పరిస్థితులతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న సిబ్బంది సహనం కోల్పోతున్నారు. చిన్ని చిన్న విషయాలకే తీవ్ర స్థాయిలో స్పందిస్తూ వివాదాస్పదులవుతున్నారు. ఏమాత్రం సమస్యలు ఎదురైనా ప్రాణాలు తీసుకోవడానికీ వెనుకాడట్లేదు. కొన్ని విపరీత సందర్భాల్లో కాల్పులకూ తెగబడుతున్నారు. వీటికి తోడు మిస్‌ఫైర్స్‌ ఉండనే ఉంటున్నాయి. ఆ సంఘటనలివీ...  
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఆర్‌ ఎస్సై భరత్‌ భూషణ్‌పై కానిస్టేబుల్‌ రవి దాడి చేసిన ఘటన సుల్తాన్‌బజార్‌ పరిధిలో జరిగింది.  
వారాసిగూడ బ్రాహ్మణ బస్తీలో నివసిస్తున్న కానిస్టేబుల్‌ జగదీశ్‌ నెల రోజుల్లో పెళ్లి ఉండగా... మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు.  
పేట్లబుర్జులో ఆరెస్సైగా పనిచేస్తున్న రామ్మోహన్‌ స్వల్ప వివాదమై అంబర్‌పేట్‌ ప్రాంతంలో ఓ వ్యక్తిపై తుపాకీ గురి పెట్టాడు.  
నగర కమిషరేట్‌ పరిధిలో పనిచేసిన ఇన్‌స్పెక్టర్‌ వీరమోహన్‌ క్షణం తీరిక లేని విధి నిర్వహణతో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఈ నిరాశ నిస్పృహలో తన తుపాకీతోనే కాల్చుకొని ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు.  
సీఆర్పీఎఫ్‌ 42వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ టి.స్టీఫెన్‌ పద్మారావునగర్‌లోని క్యాంప్‌ కార్యాలయంలో రైఫిల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  
నాంపల్లిలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో విధుల్లో ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ చేతిలో తుపాకీ మిస్‌ఫైర్‌ అయింది.  
పాతబస్తీలోని సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఏకే–47 మిస్‌ఫైర్‌ కావడంతో కానిస్టేబుల్‌ సోమప్ప మరణించాడు.
సైబర్‌ కంట్రోల్‌ ఎస్సై కె.వెంకటయ్య కుమారుడు చిన్నికృష్ణ కానిస్టేబుల్‌గా ఎంపికైనా... కిడ్నీ వ్యాధి బాధిస్తుండటంతో తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు.  
ప్రేమించి మోసం చేసిందని ఆరోపిస్తూ కూకట్‌పల్లి ఠాణాలో ఓ కానిస్టేబుల్‌ తోటి మహిళా కానిస్టేబుల్‌పై తుపాకీ గురిపెట్టాడు. ఆపై తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు యత్నించాడు.

బస్సునుపరిశీలించిన ఈడీ
మారేడుపల్లి: పంజగుట్టలో హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌నాయుడు కాల్పులకు పాల్పడిన బస్సును గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ ఈడీ వినోద్‌కుమార్, సికింద్రాబాద్‌ ఆర్‌ఎం శ్రీధర్‌ కంటోన్మెంట్‌ డిపోలో గురువారం పరిశీలించారు. ఈ డిపోకు చెందిన ఏపీ 28జడ్‌ 4468 నంబర్‌ బస్సు పైభాగం నుంచి బుల్లెట్‌ దూసుకుపోవడంతో టాప్‌కు రంధ్రం ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్‌ ఎస్‌డీవై పాషా, కండక్టర్‌ భూపతిలను విచారించనున్నట్లు ఈడీ వినోద్‌కుమార్‌ తెలిపారు. సంఘటన జరిగిన చోట బస్సును నిలపకుండా మణికొండకు వెళ్లి తిరిగి సికింద్రాబాద్‌కు రావడంపై విచారణ చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. పోలీసుల విచారణ అనంతరం ఆర్టీసీ విచారణ కొనసాగుతుందని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. తమకు సంఘటన జరిగిన వెంటనే సమాచారం అందిందని, దీనిపై అన్ని కోణాల నుంచి నివేదికను తెప్పించుకుని విచారణ చేపడతామన్నారు. ఈ బస్సు నైట్‌హాల్ట్‌ డ్యూటీ కావడంతో బుధవారం మధ్యాహ్నం 3:15గంటలకు డిపో నుంచి బయటకు వెళ్లింది. గురువారం మధ్యాహ్నం 12గంటలకు తిరిగి డిపోకు చేరాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement