అగ్రరాజ్యంలో మరోసారి గన్ కల్చర్ కోరలు చాచింది. ఫాదర్స్ డే వీకెండ్ సందర్భంలో చికాగో ప్రజలు ఓవైపు సంబురాలు మునిగిపోగా.. మరోవైపు కాల్పుల ఘటనలు తొమ్మిది మంది ప్రాణాల్ని బలిగొన్నాయి. దాదాపు 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ హింస అత్యంత విషాదకరమని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో సంతాపం తెలిపింది.
శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు సబర్బన్ చికాగో, వాషింగ్టన్ స్టేట్, సెంట్రల్ పెన్సిల్వేనియా, సెయింట్ లూయిస్, సదర్న్ కాలిఫోర్నియా, బాల్టిమోర్ ప్రాంతాల్లో వేర్వేరు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.
► సౌత్‌వెస్ట్ చికాగోకు 20 మైళ్ల దూరంలో ఇల్లినాయీస్ రాష్ట్రం లోని విలోబ్రూక్‌లో ఆదివారం ఉదయం ఓ భవన పార్కింగ్ ప్రదేశంలో జూన్ టీన్త్ వేడుకల్లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు.
► ఇక శనివారం వాషింగ్టన్ స్టేట్ క్యాంప్ గ్రౌండ్‌లో ఆగంతకుడు యాధృచ్ఛికంగా కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
► కాలిఫోర్నియా లోని కార్సన్‌లో ఓ ఇంటివద్ద పూల్ పార్టీ జరుగుతుండగా కాల్పులు సంభవించి ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. బాధితులంతా 16 నుంచి 24 ఏళ్ల లోపు వాళ్లే.
► జార్జి నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు.
► పెన్సిల్వేనియా లోని వాకర్ టౌన్‌షిప్‌లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ప్రభుత్వ సైనికుడు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటనలో నిందితుడు తన ట్రక్కుని డ్రైవ్ చేసుకుంటూ లూయిస్‌టౌన్ బారక్స్ వైపు రాత్రి 11 గంటల సమయంలో దూసుకు వచ్చి అక్కడ ఉన్నవారిపై కాల్పులు జరిపి పారిపోయాడు.
► బాల్టిమోర్‌లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారు.
ఆయా ఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్ష భవనం.. తుపాకీ సంస్కృతి కట్టడికి ఇకనైనా ముగింపు పలకాలని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో ఘటనలపై దర్యాప్తులు కొనసాగుతున్నాయని ఆయా రాష్ట్ర గవర్నర్లు, పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment