నెత్తురోడిన అమెరికా | California shooting leaves 12 dead in Thousand Oaks | Sakshi
Sakshi News home page

నెత్తురోడిన అమెరికా

Published Fri, Nov 9 2018 3:43 AM | Last Updated on Fri, Nov 9 2018 4:51 AM

California shooting leaves 12 dead in Thousand Oaks - Sakshi

కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి క్షతగాత్రుడిని తరలిస్తున్న పోలీసులు

థౌజండ్‌ ఓక్స్‌: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని థౌజండ్‌ ఓక్స్‌ నగరంలో ఉన్న బార్‌లోకి బుధవారం ప్రవేశించిన ఓ మాజీ సైనికుడు సెమీఆటోమేటిక్‌ తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ పోలీస్‌ అధికారి సహా 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమాయకుల్ని పొట్టనపెట్టుకున్న అనంతరం సదరు దుండగుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషయమై వెంచుర కౌంటీ షెరిఫ్‌ జియోఫ్‌ డీన్‌ మాట్లాడుతూ.. ‘బోర్డర్‌లైన్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌లో ప్రతి బుధవారం కాలేజ్‌ కౌంటీ నైట్‌ పేరుతో వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు వందలాది మంది కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. ఇంతలో ఓ వ్యక్తి రాత్రి 11.30(స్థానిక కాలమానం) గంటలకు బార్‌లోకి ప్రవేశించాడు. వస్తూనే నాలుగువైపులా స్మోక్‌ బాంబులను విసిరాడు. విద్యార్థులు, ఇతర కస్టమర్లు పొగకు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా తన సెమీఆటోమేటిక్‌ తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు.

ఇలా 30 రౌండ్ల పాటు కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. రంగంలోకి దిగిన పోలీస్‌ అధికారి రాన్‌ హెలుస్‌.. లోపల చిక్కుకున్న ప్రజలను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపారు. ఈ ఊచకోతకు పాల్పడిన వ్యక్తిని మాజీ మెరైన్‌ ఇయాన్‌ డేవిడ్‌ లాంగ్‌(28)గా గుర్తించామని జియోఫ్‌ డీన్‌ వెల్లడించారు. 12 మందిని పొట్టనపెట్టుకున్న అనంతరం ఇయాన్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఇయాన్‌పై తీవ్రమైన నేరాభియోగాలు ఏవీ లేవనీ, చిన్నచిన్న కేసులు ఉన్నాయన్నారు. యూఎస్‌ మెరైన్‌ కోర్‌లో 2008–13 మధ్యకాలంలో ఇయాన్‌ పనిచేశాడన్నారు. ఇందులో భాగంగా 2010 నవంబర్‌ నుంచి 2011 జూన్‌ వరకూ అఫ్గానిస్తాన్‌లో విధులు నిర్వర్తించాడని పేర్కొన్నారు.

అయితే ఈ దాడి ఎందుకు చేశారన్న విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. యుద్ధవాతావరణంలో ఉండే వ్యక్తులు ఎదుర్కొనే పోస్ట్‌ ట్రుమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌(పీటీఎస్‌డీ)తో ఇయాన్‌ ఇబ్బంది పడుతున్నాడన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అతడిని అదుపు చేయడానికి కుటుంబ సభ్యులు ఏకంగా పోలీసులను పిలవాల్సి వచ్చిందన్నారు. కాగా, ఈ దాడి సందర్భంగా పలువురు యువతీయువకులు కిటికీలు అద్దాలు పగులగొట్టి, బాల్కనీ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారని డీన్‌ పేర్కొన్నారు. మరికొందరు బాత్రూముల్లో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామన్నారు.

రెండువారాల్లో రెండోసారి
అమెరికాలో రెండు వారాల వ్యవధిలో ఇలాంటి దాడి జరగడం ఇది రెండోసారి. పిట్స్‌బర్గ్‌లోని యూదు ప్రార్థనామందిరంపై జరిగిన విద్వేషదాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. కాగా, థౌజండ్‌ ఓక్స్‌ కాల్పుల ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కార్ల్‌ ఎడ్గర్‌(24) మీడియాతో మాట్లాడుతూ..‘20 మంది స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి ఇక్కడి బోర్డర్‌లైన్‌ బార్‌కు వచ్చాను. అనంతరం కొద్దిసేపటికే కాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రాణాలు రక్షించుకోవడానికి మేమంతా తలోదిక్కు పరిగెత్తాం.

ఇప్పుడు నా స్నేహితులను ఫోన్‌ చేస్తే కలవడం లేదు. ఈ ఘటన అనంతరం వాళ్లంతా తమ ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేసుకుని ఉండొచ్చు. గతేడాది లాస్‌ఏంజెలిస్‌లో ‘రూట్‌ 91’ సంగీత విభావరిపై జరిగిన కాల్పుల నుంచి నేను, నా స్నేహితులు తప్పించుకోగలిగాం. దాన్నుంచే తప్పించుకోగలిగినప్పడు ఈ కాల్పుల నుంచి వాళ్లు సురక్షితంగా బయటపడి ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. లాస్‌ఏంజెలిస్‌లోని సంగీత విభావరిపై ఓ ఉన్మాది దాడిలో 57 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement