
న్యూఢిల్లీ: సెల్‌ఫోన్ విషయంలో సోదరితో గొడవపడి గన్‌తో కాల్చుకొని బాలుడు (17) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఢిల్లీలోని బిందాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిందాపూర్‌కి చెందిన గుల్హన్(17) ఆదివారం రాత్రి ఫోన్ విషయంలో సోదరితో గొడవ పడ్డాడు. కోపంతో ఆమె ఫోన్‌ని ధ్వంసం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి కాలింగ్‌బెల్ నొక్కాడు.
అతని తండ్రి వచ్చి తలుపులు తెరిచి చూసే సరికి ఇంటి ముందు తీవ్ర గాయాలతో పడిపోయి ఉన్నాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు అతన్ని పరిశీలించి అప్పటికే మృతి చెందాడని నిర్దారించారు. ఈ విషయాన్ని పోలీసులకి తెలియజేశారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. బాలుడి చొక్కా నుంచి నాలుగు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయంపై బాలుడి తండ్రిని ప్రశ్నించగా ఫోన్ విషయంలో గొడవపడే ఇంటి నుంచి వెళ్లాడని, సోమవారం ఉదయం గన్‌తో కాల్చుకున్నాడని తెలిపాడు. తాను తలుపులు తీసే కొద్ది నిమిషాల ముందే గన్‌తో కాల్చుకున్నాడని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బాలుడికి గన్ ఎలా లభించిందనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment