
శంకర్‌గౌడ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తున్న సిబ్బంది
నిర్మల్‌టౌన్: కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ శంకర్‌గౌడ్ చేతిలో ఉన్న తుపాకి మిస్‌ఫైర్ అయి ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శంకర్‌గౌడ్ గార్డుగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం తన తుపాకిని శుభ్రం చేస్తుండగా, అనుకోకుండా ట్రిగ్గర్‌కు వేలు తగిలి తుపాకి పేలింది. దీంతో శంకర్‌గౌడ్ ఎడమభాగంలోని ఛాతి, భుజం భాగం ప్రాంతాల్లో తీవ్ర గాయాలయ్యాయి. బుల్లెట్ బయటకు రావడంతో పెనుప్రమాదం తప్పింది. బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్తే ప్రాణానికి ప్రమాదం సంభవించే అవకాశం ఉండేది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది చికిత్స నిమిత్తం క్షతగాత్రున్ని జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి శంకర్‌గౌడ్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.