
రాజధానిపై ‘తుపాకీ’!
పెరుగుతున్న గన్ కల్చర్..
కబ్జాలు సెటిల్‌మెంట్లలో తుపాకుల వినియోగం
విజయవాడ కేంద్రంగా విడిభాగాల దిగుమతి!
ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాల్లో పోలీసుల తనిఖీలు
సాక్షి, అమరావతి బ్యూరో/చిట్టినగర్: ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి, విజయవాడల్లో ఉత్తర భారతదేశంలో మాదిరి తుపాకీ సంస్కృతి పెరుగుతోందా? తుపాకుల వినియోగం ఎక్కువైందా? అందుకు తగినట్టుగా విడి భాగాలు దేశ రాజధాని ఢిల్లీ నుంచి దిగుమతి అవుతున్నాయా? పోలీసుల్లో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత రాజకీయ, ఆర్థిక కార్యకలాపాలు పెరిగిపోయాయి. వాటితో పాటే భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లు ఎక్కువయ్యాయి. ఎంతగా అంటే అనంతపురం నుంచి విజయవాడకు వచ్చి ఇంటిని కబ్జా చేసే స్థాయికి చేరాయి. ఇలాంటి వివాదాల్లో తుపాకుల వినియోగం ఎక్కువైందని, తుపాకులతో బెదిరించడం వంటి చర్యలు ఎక్కువయ్యాయని పోలీసువర్గాల సమాచారం.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారంలోనూ తుపాకీ వినియోగం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. గన్ కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో తుపాకులను అక్రమంగా కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. కొంత కాలంగా విజయవాడ కేంద్రంగా తుపాకీ విడిభాగాలు నగరానికి చేరుతున్నాయనే సమాచారం పోలీసులకు అందింది విజయవాడ ఎప్పటినుంచో హోల్‌సేల్ వ్యాపారానికి ప్రసిద్ధి పొందింది. ఇందులో రవాణా రంగానిది కీలక పాత్ర. నిత్యం వందల కోట్ల రూపాయల విలువైన సరుకు నగరానికి దిగుమతి అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్రమార్కులు రవాణా రంగాన్ని తమ వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారని తెలిసింది. ట్రాన్స్‌పోర్టు ద్వారా తుపాకీ విడిభాగాలను పంపితే ఎవరికీ అనుమానం రాదనే భావనతో అక్రమార్కులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది.
పాతబస్తీ పంజాలో తనిఖీలు
విజయవాడకు ప్రతిరోజూ ముంబయి, చెన్నై, బెంగళూరు, కొల్‌కతా, ఢిల్లీ, జైపూర్‌ల నుంచి సరుకుల రవాణా జరుగుతుంది. అయితే బొమ్మలు, ప్లాస్టిక్ వస్తువుల పేరిట ఢిల్లీ నుంచి విజయవాడకు తుపాకీ విడి భాగాలు రవాణా అవుతున్నాయని నగర పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో వన్‌టౌన్‌లోని పంజా సెంటర్ సమీపంలోని డ్రైన్ వీధిలో ఉన్న ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీ గోడౌన్‌లో శనివారం తనిఖీలు చేశారు. గోడౌన్‌లోని వెయ్యికి పైగా పార్సిల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాన్స్‌పోర్టు కంపెనీల్లో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఈ తనిఖీలు జరిగాయి.
ముఖ్యంగా ఢిల్లీ నుంచి నగరానికి రెగ్యులర్‌గా సరుకును దిగుమతి చేసుకునే వ్యాపారుల వివరాలతో పాటు వారి ఫోన్ నంబర్లు సేకరించారు. సరుకు దిగుమతి చేసుకున్న వారిలో అనుమానితులు ఎవరైనా ఉన్నారా అనే దిశగా విచారణ చేపట్టారు. తనిఖీలతో పనై పోలేదని, తుపాకీ విడిభాగాల రవాణా అనుమానాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. శాంతిభద్రతలకు సంబంధించిన కీలకమైన అంశం కావడంతో పోలీసులు ఈ తనిఖీల వ్యవహారమంతటినీ అత్యంత గోప్యంగా నిర్వహించారు.