గత బుధవారం ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసు వద్ద జరిగిన తుపాకీ కాల్పుల ఘటనలో 9 సంవత్సరాల పాపతోపాటు నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. దానికి కొద్దిరోజుల ముందు కొలరాడో సరుకుల దుకాణంలో పదిమంది, అట్లాంటా ప్రాంతంలోని మసాజ్ కేంద్రంలో 8 మంది వ్యక్తులు దుండగుల కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయారు. 1975 నుంచి అమెరికాలో జరిగిన ఆత్మహత్యలు, హత్యలు, ప్రమాదాలలో మరణాలు (15 లక్షల మంది), అమెరికా స్వాతంత్య్ర యుద్ధ కాలం నుంచి ఆ దేశ చరిత్రలో జరిగిన అన్ని యుద్ధాల్లో సంభవించిన మరణాలను (14 లక్షల మంది) మొత్తంగా కలిపి చూసినా సరే అమెరికాలో తుపాకీ కాల్పుల వల్లే ఇంకా ఎక్కువమంది ప్రజలు మరణించారని సమాచారం.
ఈ కాల్పుల్లో ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఒక ఏడాదిలోపే నాలుగేళ్ల పిల్లలను 80 మందిని తుపాకులు పొట్టన బెట్టుకుంటున్నాయి. అదే సమయంలో 50 మంది కంటే తక్కువగానే పోలీసు అధికారులు కాల్పుల్లో చనిపోతున్నారు.
భారీ కాల్పులకు ఉపయోగపడే తుపాకుల పట్ల చాలామందికి ఆకర్షణ ఎక్కువ. గతంలో అమెరికన్లు వేటాడటం కోసం ఉపయోగించే తుపాకులు నేరాలకు ఎన్నడూ వాడేవారు కాదు. కానీ గడిచిన కొన్ని దశాబ్దాలుగా అంతగా ప్రమాదం కలిగించని ఆయుధాల స్థానంలో మిలటరీ ఉపయోగించే సెమీ–ఆటోమేటిక్ రైఫిల్స్ అంటే ఏఆర్–15 లేదా ఏకే–47 వంటి మారణాయుధాలు వచ్చి చేరుతున్నాయి. వీలైనంత ఎక్కువ మందిని చంపాలని కోరుకున్నప్పుడు మారణాయుధాలే వ్యక్తుల ఎంపికగా మారుతున్నాయి.
అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్‌లో ఇపుడున్న పరిస్థితుల్లో తుపాకుల నిరోధక చట్టం వంటిది తీసుకురావడం అసాధ్యం, అసంభవమే అని చెప్పాలి. ఉదారవాదులు పదేళ్లపాటు మారణాయుధాలపై నిషేధించాలని కోరుతూ వచ్చారు కానీ అది ప్రాణాలను కాపాడినట్లు బలమైన సాక్ష్యం కనిపించడం లేదు. కానీ ఏఆర్–15 ఒక సాంప్రదాయిక చిహ్నంగా మారిపోయింది కాబట్టే ఈరోజు అమెరికా సైన్యం వద్ద కంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఏఆర్, ఏకే రైఫిల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా రైఫిల్స్ కంటే ఇలాంటి హ్యాండ్ గన్స్ వల్లే ఎక్కువగా నేరాలు, హత్యలు జరుగుతున్నాయి.
ఎలాంటి రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా మార్కెట్లోకి వస్తున్న ఈ మారణాయుధాలను (వీటినే అమెరికాలో దెయ్యపు తుపాకులు అంటారు) తన కార్యనిర్వాహక ఆదేశం ద్వారా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అరికట్టవచ్చు. ఎందుకంటే వీటిలో చాలావరకు పూర్తి తయారీ కాని తుపాకులుగానే ముద్రపడుతూ బయటికి వస్తున్నాయి. కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన తుపాకీ హింసలపై నిపుణుడు డాక్టర్ గరెన్ వింటెముట్ దీనిపై జోక్ చేస్తూ ‘దెయ్యపు తుపాకులను సొంతం చేసుకున్నారు. వాటిని కనిపెట్టడం అసాధ్యం’ అంటూ వ్యాఖ్యానించారు.
జాతీయవాదులు దీన్ని సాకుగా తీసుకుని ఈ ఘోస్ట్ గన్స్ నుంచి రహస్యంగా మారణాయుధాల తయారీకి పూనుకుంటున్నారు. గత సంవత్సరం అలాంటి తుపాకీతోనే అతివాద ఉద్యమ మద్దతుదారు నిఘా అధికారిని కాల్చి చంపాడు. పోతే మిచిగాన్ గవర్నర్ గ్రెచెన్ విట్మార్‌ని అపహరించాలని ప్రయత్నించిన వ్యక్తి కూడా ఈ ఘోస్ట్ గన్‌నే కలిగి ఉండటం గమనార్హం.
2019లో ఒక్క సంవత్సరంలోనే 10 వేలకు పైగా దెయ్యపు తుపాకులను నిఘా సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. అధ్యక్షుడు బైడెన్ ఈ ఘోస్ట్ గన్స్ ప్రమా దాన్ని తగ్గించడానికి వెంటనే కార్యనిర్వాహక ఆదేశాన్ని ఇవ్వడం మంచిది. ఈ తుపాకులను ఎక్కడెక్కడ నేరాల్లో ఉపయోగించారో డేటాను సేకరించాలి. రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం తుపాకుల నియంత్రణలో ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు కూడా అమెరికాలో తుపాకీ మరణాలను అంత సులభంగా తగ్గించలేవు. కానీ తుపాకుల నిషేధం దిశగా తీసుకునే కనీస చర్యలు కూడా అమెరికా సమాజాన్ని ఎంతో కొంత సురక్షితంగా ఉంచుతాయనడంలో సందేహం లేదు..
వ్యాసకర్త: నికోలస్ క్రిస్టాఫ్
అమెరికన్ జర్నలిస్ట్, పులిట్జర్ గ్రహీత
తుపాకీ మరణాలు ఆగేదెన్నడు?
Published Thu, Apr 8 2021 1:16 AM | Last Updated on Thu, Apr 8 2021 4:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment