
సందర్భం
తన ప్రజలకు తాను అనాలోచితంగా ఇచ్చిన అనర్ధదాయక స్వేచ్ఛ వల్ల పిల్లలు, పెద్దలు, ఎలా పడితే అలా తుపాకులు వాడి కాల్చేసే ఒక సమాజ వ్యవస్థను తనపై తానే విధించుకున్నది కూడా ఆ దేశమే. దీని పర్యవసానమే వంటింటి పట్టకార్లూ, గరిటలూ, తోట పని పారలూ, బొరిగెలూ కొన్నట్టుగా, మారణాయుధాలను అతి తక్కువ నియంత్రణ, నిబంధనలతో అమెరికాలో సాధారణ పౌరులు కొనుగోలు చేయగలరు. మూడేళ్ల పిల్లలు సైతం వాటిని ఉపయోగించగలరు. దాని పర్యవసానం మరీ దారుణం.
ఆకు రాలు కాలంలో అమెరికాలో జరిగే పంటల పండుగలే హార్వెస్ట్ ఫెస్టివల్స్. ఆ ఏడాది కొత్త పంటలు అమ్మవార్లకు నివేదించనిదే తినని ఆచారాలు ఇప్పటికీ మన గ్రామీణుల్లో, గిరిజనుల్లో ఉన్నాయి. వాటిలో ఒక ఆచారాన్ని ‘కంది కొత్తలు’అంటారు. దేశాలు ఎంత ఆధునికం అయినా నేలకూ, నీటికీ, పంటలకూ, మనుషులకూ ఉండే విడదీయరాని సంబంధాలే మన దేశపు బతుకమ్మ పండుగలైనా, సంక్రాంతి గొబ్బెమ్మలైనా, భోగిపిడకల దండలైనా! అమెరికా దేశం నలుమూలలా శిశిరంలో జరిగే ఇరవై ఒక్క పంటల పండుగలు ఇచ్చేదైనా ఇదే సందేశం. ఇదే సంబరం వాటి మూలతత్వం. ఆ పండుగ వేళల్లో వంటకాలూ, పాటలూ, ఆటలూ, పోటీలూ, ఒక ‘పచ్చనాకు సాక్షిగా జీవించే’మానవ సమాజపు సహజమైన ఉత్సవం. ఇలా అక్టోబర్ఫెస్ట్ నుంచి వైన్ ఫెస్ట్‌ల దాకా (ఫెస్ట్ అంటే జాతర/తిరునాళ్ళ, అమెరికాలో అయినా సరే) అమెరికాలో ఏటేటా జరుగుతాయి.
పండుగ మీద ప్రతాపం
సమస్త ఉత్పత్తులకూ, శ్రమకూ అమెరికాలో జరుపుకునే పండుగలు ఇవి. కాయగూరలూ(ఒహియో), గుమ్మడి కాయల పండుగలూ(కొలరాడో), గొర్రెల పండుగలూ (ఇదాహొ), ఎద్రియోన్ డాక్ గాలిగుమ్మటాల పండుగలూ (న్యూయార్క్), క్రేన్ బెర్రీ ఫెస్టివల్ (మెసాచూసెట్స్), ఆర్బోరేటమ్‌లో ఆటమ్ రుతువు అంటూ డెబ్భై అయిదు వేల గుమ్మడికాయలూ, ఆనపకాయలతో చేసే అలంకరణ పండుగలూ (డల్లాస్, టెక్సాస్‌లలో), మేడిసన్ కంట్రీ కవర్డ్ బ్రిడ్జ్ ఫెస్టివల్, సోనొమా కంట్రీ హార్వెస్ట్ ఫెస్టివల్ (వైన్ తయారీ కోసం ద్రాక్షపళ్ళు కాళ్లతో తొక్కే –గ్రేప్ స్టోంపింగ్– పోటీలు ఉంటాయి), సెయింట్ చార్లీలో దిష్టిబొమ్మల పండుగలూ, పెకన్ గింజల డుగ (నార్త్ కరొలినా), కోనా కాఫీ పండుగ (కోనా, హవాయి), హుడ్ రివర్ వేలీ ఫెస్టివల్ (హుడ్ రివర్, ఆరెగాన్), జర్మన్ సంప్రదాయ వంటల పండుగ జిన్ జిన్నాట్టి, (సిన్సినాటీలో), నేషనల్ ఆపిల్ హార్వెస్ట్ ఫెస్టివల్ (పెన్సిల్వేనియా), వారెన్స్ క్రేన్ బెర్రీ ఫెస్టివల్ (విస్కాన్సిన్), హెరిటేజ్ హార్వెస్ట్ ఫెస్టివల్ (మాంటిసెల్లో, వర్జీనియా), వెర్మూంట్ పంప్కిన్ చకింగ్ ఫెస్టివల్ (స్టౌవే, వెర్మాంట్), ఫాల్ ఫర్ గ్రీన్ విల్లే (ఆ ఊరి నలభై హోటళ్ల వంటకాల పండుగ), అకడియా నేషనల్ ఫెస్టివల్ (ఆకడియా, మెయిన్)... ఇలా పంటల, పొలాల, వంటల వినోదాల గ్రామీణ అమెరికా జరుపుకునే సంబరమే మొన్న లాస్‌వెగాస్‌లో జరుగుతున్నది కూడా. అంటే అది కూడా ఒక హార్వెస్ట్ ఫెస్టివల్. మనకు కావలసింది ఈ పచ్చని అమెరికా పది కాలాలు జీవించడం.
పరమ వికృతులు చేసే పని
ఇక్కడ ఈ ప్రజలపైనే మనకు సానుభూతి. అక్కడ విచ్చలవిడిగా తుపాకులు కొనుక్కోనిచ్చే తుపాకుల వ్యాపారుల సంఘంతో కాదు. అస్సాల్ట్ రైఫిల్స్, హై కెపాసిటీ బరస్ట్ ఆటోమేటిక్ ఆయుధాలు సామాన్య పౌరులకు ఎంతో తేలిగ్గా అమ్మే దేశం అమెరికా. ఈ పంటల పండుగలో ఆటా, పాటా, ఆహారం కోసం గుమిగూడి, హాయిగా పాల్గొంటున్న బతుకు సందళ్ల కలుపుగోలు అమెరికా సమాజంపై కాల్పులు జరిపినవాడు– అరవై నాలుగేళ్ల తాతయ్య వయసు వ్యక్తి. ఒక హోటల్ ముప్పయ్ రెండో అంతస్తు నుంచి పది నిమిషాల పాటు, సెకనుకు ముప్పయ్ తూటాలు పేల్చే శక్తి గల మారణాయుధాలతో నిరాయుధులు, సంబరాల్లో పాల్గొన్న, సంతోష హృదయులూ, స్త్రీ, బాల, వృద్ధులున్న సమూహం మీద కాల్పులు జరపడం ఇరవయ్యొకటో శతాబ్దపు వికృతరూపులు మాత్రమే చెయ్యగల పని.
అమెరికా ప్రజల ఈ జీవోల్లాసాలను ఎంతగా అయినా ప్రేమించవచ్చు. అదే సమయంలో ఒక సైనిక, సాంకేతిక, సామ్రాజ్యవాద, ఏకధృవ పెట్టుబడిదారీ వ్యాపార ధోరణులతో, తానే ప్రపంచం అనుకునే అమెరికా తన ప్రజలను ఎటు వైపు తోస్తున్నదీ అన్నదే ప్రశ్న. ప్రపంచపటంలో నూట డబ్బయ్ ఏడు దేశాల్లో, ఎనిమిది వందల సైనిక కేంద్రాలతో, ఏడాదికి నూరు బిలియన్ల డాలర్లు వీటిపై ఖర్చు పెడుతున్న దేశం. ఇంతకన్నా ఆధిపత్య జోక్యందారీ విధానం ఏదన్నా ఉంటుందా? ఇంతకు ముందు ఏ దేశంలోనైనా, ఎంత వలస
పాలనలోనైనా ఉన్నదా అన్నదే పెద్ద ప్రశ్న.
అమెరికా అంటేనే ఆయుధాల పోటా పోటీ ఉత్పత్తి. అణ్వాయుధాల తయారీకి పరుగులు. చివరికి తన పారిశ్రామిక, సైనిక విధానాల వలన పర్యావరణ పరంగా కూడా, అతి పెద్ద హానికారక దేశంగా ప్రపంచ దేశాలు నిందిస్తున్నాయి. అయినా తాము అనుసరించే విధానాలకు, పర్యావరణకు జరుగుతున్న నష్టానికి ఏ సంబంధమూ లేదని బీరాలు పలుకుతున్న దేశం అది. ఆ నష్టంతో తమకు ఏమీ సంబంధం లేదని పర్యావరణ ప్రపంచ స్థాయి సదస్సులలోనే చేతులు దులుపుకోగలిగిన అవకాశవాద దేశం అమెరికా. తన ప్రజలకు తాను అనాలోచితంగా ఇచ్చిన అనర్ధదాయక స్వేచ్ఛ వల్ల పిల్లలు, పెద్దలు, ఎలా పడితే అలా తుపాకులు వాడి కాల్చేసే ఒక సమాజ వ్యవస్థను తనపై తానే విధించుకున్నది కూడా ఆ దేశమే.
దీని పర్యవసానమే వంటింటి పట్టకార్లూ, గరిటలూ, తోట పని పారలూ, బొరిగెలూ కొన్నట్టుగా, మారణాయుధాలను అతి తక్కువ నియంత్రణ, నిబంధనలతో అమెరికాలో సాధారణ పౌరులు కొనుగోలు చేయగలరు. మూడేళ్ల పిల్లలు సైతం వాటిని ఉపయోగించగలరు. దాని పర్యవసానం మరీ దారుణం. అమెరికాలో ఇంతవరకూ1968 – 2011 మధ్య కాలంలో తుపాకీ కాల్పుల దురంతాల్లో చనిపోయిన వారి సంఖ్య లక్షలలోనే ఉంది. ఆ దేశమే ఇస్తున్న లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇంతవరకూ (240 రోజులకు) 244 కాల్పుల సంఘటనలు జరిగాయి. చిల్లర మల్లర లెక్కేస్తే ఒక్క ఏడాదిలో ఇప్పటి వరకూ, 44, 695 సంఘటనలుగా చెబుతున్నారు. చనిపోయిన వారు పదకొండు వేల ఆరు వందల ఎనభై ఆరు. ఎంత భద్రత ఉన్నదీ సమాజంలో! మన ఆలోచనలకు విరుద్ధమైన ఆలోచనలున్నవారిని కాల్చేస్తూ ఈ సంస్కృతిని మనమూ అనుకరిస్తున్నామా?
సొంతింటిని చక్కబరుచుకోలేరు
ప్రపంచాన్ని కలవరపరుస్తున్నప్పటికీ ఇలాంటి దుర్దశ గురించి అమెరికాలో ఏ చట్టసభలూ మాట్లాడవు. ఏ సెనేటర్లూ ఈ విషయమై రాజీనామా చేయరు. వీరు తమ దేశాన్ని కాపాడుకోలేని వారు. తుపాకులకు మించిన సహన సంపదే దేశ ప్రగతికి కీలకం అని నేతలు ప్రజలకు బోధించలేరు. పౌరులకు గల జీవించే హక్కు ఎవరూ భంగపరచ వీల్లేనంత విలువ గలదని చెప్పలేరు. ఇతర దేశాలపై మాత్రం తమ ఆధిపత్య వికృతాలకు దౌత్యనీతి అని పేర్లు పెట్టగలరు.
వీరిని ‘ఇరవయ్యో శతాబ్దపు వికృత శిశువులు’ అన్నాడు బ్రిటిష్ చరిత్రకారుడు ఆర్నాల్డ్ టాయన్ బీ(1889 – 1975). ప్రపంచ సంపదలను తమ దేశానికి అవసరమైనంత మేరకు ప్రజాస్వామ్యపరంగా పొందగల హక్కు ప్రపంచంలో ప్రతీ దేశానికి ఉన్నదన్న స్పృహ లేకుండా, ఆ న్యాయబద్ధమైన పంపిణీ నిర్వహణను ఒక పెద్దన్నగా చేయవలసిన బాధ్యత వదిలిపెట్టి, ఒక ప్రపంచ దురహంకారిగా మారిన దేశం అమెరికా. ఆ దేశం ఇప్పుడు తన ఇంట్లో తనే ఎలా బొక్క బోర్లా పడుతున్నదో చూస్తుంటే సామాజిక అధ్యయనవేత్తలకు ఆందోళన కలుగుతున్నది.
గన్ కల్చర్‌కు స్వస్తి పలకాలి
అమెరికా ఇప్పటికైనా తమ గన్ కల్చర్ శాసనాలు, పౌరులు తుపాకులు కలిగి ఉండే హక్కు గురించి తక్షణమే సమీక్షించుకోవాలి. దాదాపు మనిషికొక్క తుపాకీ నిష్పత్తి దాటిపోయి ముప్పయి ఒక్క కోట్ల తుపాకులు ఆ దేశ పౌర సమాజం వద్ద ఉన్నాయి. అలాంటి సమాజం ఎంత కట్టుబాటులో, ఎంత నియంత్రణలో ఉండగలదు? ఈ ఫొటో చూడండి, ఇది అమెరికాను వెంటాడుతున్న తుపాకీ మశూచి. దీన్ని ఆపాలంటే, ఏ ప్రజాస్వామిక ఔదార్య విలువలతో ఆ దేశం ఏర్పడిందో, వాటి సాయం తోనే ఈ దిగజారుడునీ, తమ బతుకుల చుట్టూ అకాల శ్మశానాలను నిర్మించుకోవడమనే విషాదాన్నీ ఆపగలదు. ఆ దిశగా తుపాకీ ఉన్మాదాల అమెరికా కృషి చేయాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.
వ్యాసకర్త ప్రముఖ కవి విమర్శకుడు
మొబైల్: 9849200385
రామతీర్థ