అమెరికా మరొకసారి కాల్పులతో దద్దరిల్లింది. న్యూమెక్సికోలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవ్వగా, అందులో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు సైతం ఉన్నారు. గాయపడ్డ పోలీస్ ఆఫీసర్ల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో తెలిపింది.
సోమవారం జరిగిన ఈ ఘటనలో అనుమానితున్ని పోలీసులు హతమార్చారు. 18 ఏళ్ల యువకుడు ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని న్యూ మెక్సికో రాష్ట్రంలోని చర్చికి బయటే హతమార్చినట్లు పేర్కొన్నారు. అయితే మృతులు వివరాలను కానీ, గాయపడిన వారి వివరాలను కానీ పోలీసులు వెల్లడించలేదు. సంఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని, నిందితుడి వివరాలు తెలియరాలేదని పేర్కొన్నారు. కాల్పులకు కారణం తెలియరాలేదన్నారు.
ఈ కాల్పుల ఘటనను కొంతమంది వీడియో రూపంలో చిత్రీకరించడమే కాకుండా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. బ్లాక్ డ్రెస్‌లో వచ్చిన ఆ 18 ఏళ్ల యువకుడు చేతిలో గన్ పెట్టుకుని హల్‌చేశాడు. ఈ క్రమంలోనే న్యూ మెక్సికోలోని క్రిస్ట్ సైంటిస్ట్ ఫస్ట్ చర్చి బయట కాల్పులకు దిగాడు. అయితే వెంటనే తేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని హతమార్చడంతో ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగారు.
కాగా, ఇటీవల కాలంలో అమెరికాలో కాల్పులు విపరీతంగా పెరిగాయి. అగ్రరాజ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి క్షేమంగా వస్తారనే భరోసా లేకుండా ఉంది. ఏ క్షణంలో ఎవరు కాల్పులకు తెగబడతారో చెప్పలేని దుస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment