New mexico
-
తిరిగొచ్చిన స్టార్‌లైనర్
వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) వెళ్లిన స్టార్ లైనన్ స్పేస్‌క్రాఫ్ట్ ఒంటరిగానే తిరిగొచ్చింది. ఆరు గంటల ప్రయాణం తర్వాత స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 9.31 గంటలకు అమెరికాలో న్యూమెక్సికో ఎడారిలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్ సమీపంలో క్షేమంగా దిగింది. ఐఎస్ఎస్ నుంచి కేవలం 10 రోజుల్లో తిరిగి రావాల్సిన స్టార్ లైనర్ సాంకేతిక లోపాల వల్ల మూడు నెలలకు పైగా ఆలస్యంగా భూమిపై అడుగుపెట్టింది. స్టార్ లైనర్‌లో వెనక్కి రావాల్సిన సునీత, విల్మోర్ ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారు భూమిపైకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా ఐఎస్ఎస్లోనే ఉండి, అంతరిక్ష పరిశోధనల్లో పాలుపంచుకోనున్నారు. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో వ్యోమగాములతో అంతరిక్షంలోకి వెళ్లి, ఒంటరిగా తిరిగివచ్చిన మొట్టమొదటి స్పేస్‌క్రాఫ్ట్‌గా స్టార్ లైనర్ రికార్డుకెక్కింది. ఏమిటీ స్టార్ లైనర్? ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి అంతరిక్ష వాహక నౌక స్టార్ లైనర్. ఈ ఏడాది జూన్ 5వ తేదీన ప్రయోగాత్మకంగా ఇద్దరు వ్యోమగాములతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించారు. సునీతా విలియమ్స్, విల్మోర్ స్టార్ లైనర్‌లో ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ప్రయాణం మధ్యలో ఉండగానే సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఇంజన్‌లోని కొన్ని థ్రస్టర్లు విఫలమయ్యాయి. హీలియం గ్యాస్ లీకైనట్లు గుర్తించారు. తాత్కాలిక మరమ్మత్తులతో స్టార్ లైనర్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. వాస్తవానికి సునీతా విలియమ్స్, విల్మోర్ 8 రోజులపాటు అక్కడే ఉండి, ఇదే స్టార్‌లైనర్‌లో వెనక్కి తిరిగిరావాలి. మరమ్మత్తులు చేయడం సాధ్యం కాకపోవడంతో వారిని వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేకుండాపోయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ‘డ్రాగన్’ స్పేస్‌క్రాఫ్ట్‌లో వారిద్దరూ భూమిపైకి తిరిగి రానున్నారు. ‘డ్రాగన్’లో నలుగురు వ్యోమగాములు ప్రయాణించడానికి వీలుంది. కానీ, ఇద్దరే ఐఎస్ఎస్కు వెళ్లనున్నారు. వచ్చేటప్పుడు సునీతా విలియమ్స్, విల్మోర్ను కూడా తీసుకురానున్నారు. – వాషింగ్టన్ -
‘రస్ట్’ కేసు కొట్టివేత
శాంటా ఫే: ‘రస్ట్’ సినిమా షూటింగ్ రిహార్సల్స్ సమయంలో 2021లో అలెక్ బాల్డ్విన్(61) చేతిలోని తుపాకీ పేలి సినిమాటోగ్రాఫర్ హలియానా హట్చిన్ ప్రాణాలు కోల్పోయిన ఘటన కేసు మూడేళ్లకు అనూహ్యంగా సుఖాంతమయింది. నటుడు అలెక్ బాల్డ్‌విన్‌పై ఉన్న ‘అసంకల్పిత హత్య’ ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగానే న్యూ మెక్సికో కోర్టు జడ్జి అకస్మాత్తుగా కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. కేసులో సాక్షులను అడ్డుకుంటూ పోలీసులు, లాయర్లు వ్యవహరించిన తీరు ఆధారంగానే తీర్పు ఇచ్చినట్లు జడ్జి మేరీ మార్లో సోమర్ తెలిపారు. కోర్టు హాల్లోనే ఉన్న బాల్డ్విన్ తీర్పు విని పట్టరాని ఆనందంతో ఏడ్చేశారు. మూడు దశాబ్దాలకు పైగా మంచి నటుడిగా పేరున్న బాల్డ్విన్ కెరీర్ 2021 నాటి ఘటనతో ప్రశ్నార్థకంలో పడింది. -
ఈ వాతావరణంలో చెట్టుచేమలకే తావులేదు. కానీ ఈ అద్భుతం అక్కడిదే..!
సాధారణంగా వసంత సంరంభమంతా చెట్లు చేమలు ఉన్న చోటనే కనిపిస్తుంది. ఎడారుల్లో వసంతరాగం దాదాపుగా వింతే! వసంతకాలంలో ఎడారిలో పూలు పూసిన దృశ్యం కనిపిస్తే ‘ఎడారిలోన పూలు పూచెనెంత సందడి’ అను పాడుకోక తప్పదు. ఈ పొటోలు అమెరికా న్యూమెక్సికోలోని ‘వైట్ శాండ్స్ నేషనల్ మాన్యుమెంట్’ ప్రాంతంలో తీసినవి. వైట్ శాండ్స్ నేషనల్ మాన్యుమెంట్ ప్రాంతం అంతటా దాదాపు 590 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎటు చూసినా తెల్లని ఇసుక తిన్నెలే కనిపిస్తాయి. ఇది ఎడారి. ఇక్కడ ఏడాది పొడవునా ఎండలు భగభగలాడుతుంటాయి. ఇక్కడి వాతావరణంలో చెట్టుచేమలు పెరగడమే అరుదు. అలాంటిది అక్కడ మొక్కలకు పూలు పూయడమంటే, ఊహాతీతమైన సంగతే! ఈ ఎడారిలోని ఇసుక జిప్సమ్ స్ఫటికాల రేణువులతో నిండి ఉండటంతో చాలా తెల్లగా కనిపిస్తుంది. ఈ ఇసుక తిన్నెలు ముప్పయి నుంచి అరవై అడుగుల ఎత్తులో చిన్న కొండల్లా కనిపిస్తాయి. ఈ ఎడారిలో చాలా అరుదుగా అప్పుడప్పుడు మొక్కలు మొలుస్తుంటాయి. ఇంకా అరుదుగా వసంతంలో అవి పూలు పూస్తుంటాయి. ఇటీవల అలాంటి అరుదైన దృశ్యమే ఈ ఎడారిలో కెమెరాకు చిక్కింది. ఇవి చదవండి: ఈ తవ్వకాల్లో ఏం దొరికాయో తెలుసా..!? -
మళ్లీ అమెరికాలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి
అమెరికా మరొకసారి కాల్పులతో దద్దరిల్లింది. న్యూమెక్సికోలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవ్వగా, అందులో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు సైతం ఉన్నారు. గాయపడ్డ పోలీస్ ఆఫీసర్ల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ తన ఫేస్బుక్ అకౌంట్లో తెలిపింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో అనుమానితున్ని పోలీసులు హతమార్చారు. 18 ఏళ్ల యువకుడు ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని న్యూ మెక్సికో రాష్ట్రంలోని చర్చికి బయటే హతమార్చినట్లు పేర్కొన్నారు. అయితే మృతులు వివరాలను కానీ, గాయపడిన వారి వివరాలను కానీ పోలీసులు వెల్లడించలేదు. సంఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని, నిందితుడి వివరాలు తెలియరాలేదని పేర్కొన్నారు. కాల్పులకు కారణం తెలియరాలేదన్నారు. ఈ కాల్పుల ఘటనను కొంతమంది వీడియో రూపంలో చిత్రీకరించడమే కాకుండా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. బ్లాక్ డ్రెస్‌లో వచ్చిన ఆ 18 ఏళ్ల యువకుడు చేతిలో గన్ పెట్టుకుని హల్చేశాడు. ఈ క్రమంలోనే న్యూ మెక్సికోలోని క్రిస్ట్ సైంటిస్ట్ ఫస్ట్ చర్చి బయట కాల్పులకు దిగాడు. అయితే వెంటనే తేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని హతమార్చడంతో ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగారు. కాగా, ఇటీవల కాలంలో అమెరికాలో కాల్పులు విపరీతంగా పెరిగాయి. అగ్రరాజ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి క్షేమంగా వస్తారనే భరోసా లేకుండా ఉంది. ఏ క్షణంలో ఎవరు కాల్పులకు తెగబడతారో చెప్పలేని దుస్థితి నెలకొంది. -
ఈమె దెయ్యమా.. మనిషా..? అనుమానం వస్తే తప్పులేదు.. ఎందుకంటే?
ఎదురుగా ఉన్నది దెయ్యమో మనిషో తేల్చుకోవడానికి కాళ్లు వెనక్కు తిరిగి ఉండటాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు జానపదులు. ఇక్కడ ఉన్న కెల్సీ గ్రబ్ దెయ్యమేమో అని అనుమానం వస్తే తప్పులేదు. ఎందుకంటే ఏకంగా ఆమె తన పాదం మొత్తాన్ని వెనక్కు తిప్పి గిన్నెస్ రికార్డును బద్దలు కొట్టింది. మే 2న ఈ రికార్డు నమోదైంది. ప్రస్తుతం ఈమె కాళ్ల వైపే లోకం అబ్బురంగా చూస్తోంది ‘పిల్లలకు గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే క్రేజ్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాక్కూడా ఉండేది. కాని నేను కూడా ఆ రికార్డ్ సాధిస్తాననుకోలేదు’ అని సంబరపడుతోంది కెల్సీ గ్రబ్. అమెరికాలోని న్యూ మెక్సికోలో ఆల్ బకాకీ అనే ఊరికి చెందిన 32 ఏళ్ల కెల్సీ తన కాలిని171.4 డిగ్రీలు వెనక్కు తిప్పడం ద్వారా గిన్నెస్ రికార్డు స్ధాపించింది. ‘గత సంవత్సరం ఏదో షాపులో గిన్నెస్ రికార్డ్–2021 పుస్తకం తిరగేశాను. అందులో కాలు వెనక్కు తిప్పే వ్యక్తి ఫొటో ఉంది. అతని కంటే ఎక్కువగా వెనక్కు ఎందుకు తిప్పకూడదు అనిపించింది’ అంది కెల్సీ. చదవండి: రిలేషనే కాదు.. ఎదో తెలియని ఎమోషన్.. జుకర్‌బర్గ్ ఫోటో వైరల్ ఐస్ స్కేటింగ్‌ను తరచూ సాధన చేసే కెల్సీ స్కేటింగ్‌లో పాదాలు చురుగ్గా ఉండాలి కనుక తను సాధన చేస్తే కాలిని వెనక్కు తిప్పగలదు అనుకుంది. ‘నేను పెద్దగా కష్టపడలేదు. అప్పుడప్పుడు పాదాన్ని వెనక్కు తిప్పుతూ ఉండేదాన్ని. కొన్నిసార్లు మోకాల్లో నొప్పి అనిపించేది. అప్పుడు మాత్రం కొంచెం మెల్లగా తిప్పేదాన్ని’ అని తెలిపింది కెల్సీ. ఆమె ఇప్పుడు ఎంత సాధన చేసిందంటే ‘జనం వెనక్కు తిరిగిన పాదాన్ని కాకుండా అంత సులభంగా పాదాన్ని తిప్పినందుకే ఎక్కువ ఆశ్చర్యపోతుంటారు’ అని నవ్వింది. స్నేహితులు ఆమె విన్యాసాన్ని పూర్తిగా గమనించాక గిన్నెస్ రికార్డ్స్ వారికి మెయిల్ పెట్టింది కెల్సీ. ‘ఇదేదో రికార్డు స్థాయి ఫీట్లాగానే ఉంది. వచ్చి పరీక్షించండి అని మెయిల్ పెట్టాను. చిన్నపిల్లల్లాగే ఉత్సాహంగా ఎదురు చూశాను. రికార్డు కన్ఫర్మ్ అయ్యాక చాలా సంబరపడ్డాను’ అందామె. సాధారణ జనంలో చాలా మంది కాలిని 90 డిగ్రీల వరకూ వెనక్కు తిప్పగలరు. కాని కెల్సీ దాదాపు 180 డిగ్రీలు వెనక్కు తిప్పడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. -
పని మనిషి కాస్త.. ఓనర్ అయ్యింది!
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం అంటే.. దాని వెనుక బోలెడంత కథాకమీషు ఉంటుంది. అయితే అనుకున్న దానిని నెరవేర్చుకునేందుకు కొందరు పడే తాపత్రయం.. ఆకట్టుకోవడమే కాదు, వాళ్ల లక్ష్యసాధన చాలామందిలో స్ఫూర్తిని నింపుతుంది కూడా. ఒకప్పుడు ఆమె ఆ విలాసవంతమైన ఇంట్లో పని మనిషి. ఇల్లు ఊడ్చి.. తుడిచి.. ఇంటి పనులు చేసేది. కాలచక్రం గిర్రున తిరిగి 43 ఏళ్లు గడిచింది. అదే ఇంట్లో ఇప్పుడామె ఓనర్‌గా దర్జాగా కాలు మీద కాలేసి కూర్చుంది!. న్యూమెక్సికో అల్బుకెర్కీకి చెందిన మార్గరెట్ గాక్సియోలా.. 1976లో 29 ఏళ్ల వయసున్నప్పుడు పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లైంది. అయితే భర్త ఆమెను వదిలేసి.. మరో వ్యక్తితో వెళ్లిపోయాడు. దీంతో పిల్లల బాధ్యత ఆమెపై పడింది. ఓ పూల షాపులో పని చేస్తూనే.. నాలుగు ఇళ్లల్లో పని మనిషిగా చేసింది. ఆ సమయంలో చిన్నకూతురు నికోల్‌ను వెంటపెట్టుకుని వెళ్లేది. అయితే అన్నింట్లోకి ఆమెకు ఒక ఇల్లు ఎంతో ప్రత్యేకంగా ఉండేది. ఆ ఇల్లు చాలా విలాసవంతమైంది కావడమే అందుకు కారణం. తన పూర్తి జీవితం అందులోనే గడిపితే బాగుండేదని తరచూ గాక్సియోలా పిల్లలతో చెబుతూ ఉండేదట. కానీ, అది సాధ్యం కానీ అంశమని ఆమెకు కూడా తెలుసు!. ఇక నికోల్‌కు కూడా ఆ ఇంట్లో ఎంతో నచ్చింది. ఓ టేబుల్ కింద కూర్చుని ఎక్కువ సేపు ఆడుకునేది. ఆ ఇల్లు గాక్సియోలా ఉండే చిన్ని అద్దెయింటికి కేవలం 20 నిమిషాల దూరంలోనే ఉండేది. ఇక ఇంటి ఓనర్ పమేలా కీ లిండెన్ కూడా ఈ తల్లీబిడ్డలను సొంతవాళ్లుగా భావించేది. అలా చాలా ఏళ్లు గడిచాయి. 2018లో పమేలా అనారోగ్యంతో చనిపోయాక.. గాక్సియోలా ఆ ఇంటి పనులకు వెళ్లడం మానేసింది. ఈలోపు తన ముగ్గురు పిల్లలు మంచి చదువులతో.. మంచి ఉద్యోగాల్లో చేరారు. ఇద్దరు కొడుకులు భార్యాపిల్లలతో సుఖంగా వేరే ఊళ్లలో స్థిరపడ్డారు. గాక్సియోలా మాత్రం ఒంటరిగా ఆ చిన్ని అద్దె ఇంట్లోనూ ఉంటూ వచ్చింది. అయితే తన తల్లి మనసును అర్థం చేసుకుంది కూతురు నికోల్ నారంజో(44). పెళ్లై ఇద్దరు బిడ్డలకు తల్లి అయినా కూడా.. తన తల్లి కలను నెరవేర్చేందుకు ప్రయత్నించింది. భర్త సాయంతో.. తానూ ఉద్యోగం చేస్తూ డబ్బును కూడబెడుతూ వచ్చింది. తమ కోసమే జీవితాన్ని త్యాగం చేసిన తల్లికి.. వెలకట్టలేని బహుమతిని అందించాలనుకుంది. నవంబర్ 2020లో ఆ ఇల్లును కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. చివరకు.. ఆ ఇంటిని కొనుగోలు చేసి.. ఈ మధ్యే ఆ ఇంట్లో తల్లిని అడుగుపెట్టించింది. కోరుకున్న కలను కళ్ల ముందు ఉంచిన బిడ్డను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని.. ఆ క్షణాలను భావోద్వేగంగా మల్చుకుంది ఆ తల్లి. -
‘‘విమానం ల్యాండ్ చేస్తారా.. దూకేయనా’’
వాషింగ్టన్: ఓ ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన వల్ల విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చింది. లాస్ ఏంజెల్స్ నుంచి నాష్‌విల్లేకు వెళ్లే విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు.. డెల్టా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 386 విమానం లాస్ ఏంజెల్స్ నుంచి నాష్‌విల్లేకు వెళ్తుంది. ఈ క్రమంలో దానిలో ఉన్న ఓ ప్రయాణికుడు సడెన్‌గా లేచి.. ‘‘విమానాన్ని ఆపండి.. లేదంటే నేను దూకేస్తాను’’ అంటూ.. లాక్ చేసిన కాక్పిట్ట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇతర ప్రయాణికులు అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినా కుదరలేదు. అతి కష్టం మీద అతడిని విమానంలో వెనక సీటులో కట్టి పడేశారు. ఆ తర్వాత విమానాన్ని న్యూమెక్సికోలోని అల్బుకెర్కీ ఇంటర్నేషనల్ సన్పోర్ట్కు మళ్లీంచారు. "విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎఫ్‌బీఐ, పోలీసులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తసుకున్నారు’’ అని డెల్టా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని.. దీనిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. అల్బుకెర్కీలోని ఎఫ్బిఐ ప్రతినిధి ఫ్రాంక్ ఫిషర్ తెలిపారు. ఈ ఘటన వల్ల ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని అన్నారు. చదవండి: విమానంలో పుట్టి.. బంపర్ ఆఫర్ కొట్టేశాడు! -
కుప్పకూలిన మరో జెట్ ఫ్లైట్
వాషింగ్టన్ డీసీ: అమెరికా వైమానిక దళానికి చెందిన మరో అమెరికా విమానం మంగళవారం కూలిపోయింది. న్యూమెక్సికోలో తెల్లవారు జాయిన 3:50 గంటల సమయంలో యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16 జెట్ కుప్పకూలింది. హోలోమన్ ఎయిర్ బేస్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో జెట్ విమానం అదుపు తప్పింది. కాగా, ఫైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు 5 సార్లు ఇలా అమెరికా వైమానిక దళానికి చెందిన విమానాలు కుప్పకూలాయి. గడిచిన రెండు వారాలలో రెండు ఎఫ్-6 జెట్లు ప్రమాదానికి గురి కావడం గమనార్హం. చదవండి: కుప్పకూలిన అమెరికా విమానం -
మీ దేశానికి వెళ్లిపోండి: రెస్టారెంట్ ధ్వంసం
వాషింగ్టన్: అమెరికాలోని భారతీయ హోటల్‌ను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. అనంతరం విద్వేషపూరిత వ్యాఖ్యలతో హోటల్ గోడలను నింపేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది. న్యూ మెక్సికోలోని సాంటే ఫె సిటీలో బల్జీత్ సింగ్ అనే సిక్కు వ్యక్తి భారతీయ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉన్నట్టుండి కొందరు దుండగులు హోటల్లోకి చొచ్చుకు వచ్చి అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. దేవుళ్ల విగ్రహాలను కిందపడేశారు. వంటగదిని సర్వనాశనం చేశారు. గోడలపై 'వైట్ పవర్', 'ట్రంప్ 2020', 'స్వదేశానికి వెళ్లిపో' అంటూ బెదిరింపు వ్యాఖ్యలను రాశారు. (సియాటిల్‌లో ఆందోళనలకు భారతీయురాలి సారథ్యం) అనంతరం కంప్యూటర్లను దొంగిలించారు. ఈ దాడి వల్ల రెస్టారెంట్ యజమానికి లక్ష డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ చర్యను సిక్ అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్(ఎస్ఏఎల్డిఈఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి హింస ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంతో అమెరికా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. స్పానిష్ వలసవాదుల విగ్రహాలను తొలగించడంతో ఈ ఆందోళనలు మరింత భగ్గుమన్నాయి. (ఒంటి కాలితో గెంతుకుంటూ వెళ్లమన్నారు) (ప్రజాగ్రహం: భారతీయ రెస్టారెంట్‌కు నిప్పు) -
నేలకు దిగిన బోయింగ్ ఆశలు!
కేప్ కెనవెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో నింగిలోకి దూసుకెళ్లిన బోయింగ్ కంపెనీ స్టార్‌లైనర్ క్రూ క్యాప్సూ్యల్ డమ్మీ అంతరిక్ష నౌక ఆదివారం న్యూమెక్సికోలోని ఎడారిలో సురక్షితంగా ల్యాండైంది. అయితే అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లకుండానే వెనుదిరిగి రావడంతో వచ్చే ఏడాది వ్యోమగాములతో చేయాల్సిన ప్రయోగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కిందకు దిగే క్రమంలో మూడు పారాచ్యూట్లు తెరుచుకోవడంతోపాటు ఎయిర్‌బ్యాగులు కూడా సరిగా పనిచేయడం వల్ల సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. వారం రోజులకు పైగా అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సిన నౌక.. కేవలం ప్రయోగించిన రెండు రోజులకే వెనుదిరగాల్సి వచ్చింది. సురక్షిత ల్యాండింగ్ కావడం కొంతమేర సానుకూల అంశం. నాసా భాగస్వామ్యంతో నిర్మించిన స్టార్‌లైనర్ క్యాప్సూ్యల్ డమ్మీ అంతరిక్ష నౌకను మానవరహితంగా ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం ప్రయోగించారు. అట్లాస్–5 రాకెట్‌తో నింగిలోకి ఎగిరిన స్టార్‌లైనర్ 15 నిమిషాలకు దాని నుంచి వేరుపడింది. అయితే ఆ తర్వాత కొన్ని నిమిషాలకు తమ అంతరిక్ష నౌక నిర్దేశిత కక్ష్య నుంచి దారి తప్పిందంటూ బోయింగ్ ట్వీట్ చేసింది. దాన్ని సరైన కక్ష్యలోకి తెచ్చే ప్రయత్నాల్లో తాము నిమగ్నమైనట్లు తెలిపింది. వచ్చే ఏడాది వ్యోమగాములను స్టార్‌లైనర్ ద్వారా అంతరిక్ష యాత్రకు పంపాలని సంకల్పించిన క్రమంలో తాజా వైఫల్యం తీవ్ర ఆందోళన కలిగించే అంశం కానుంది. వచ్చే ఏడాది స్టార్‌లైనర్ కాప్సూ్యల్లో ముగ్గురు వ్యోమగాములను పంపేందుకు బోయింగ్ సన్నాహాలు చేస్తోంది. -
నిర్బంధ కేంద్రాల్లో భారతీయులు
వాషింగ్టన్/హూస్టన్: ఇటీవల అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి నిర్బంధానికి గురైన వారిలో వంద మంది వరకు భారతీయులు కూడా ఉన్నారు. న్యూ మెక్సికో రాష్ట్రంలోని నిర్బంధ కేంద్రంలో 40 నుంచి 45 మంది, ఓరెగాన్ రాష్ట్రంలోని కేంద్రంలో మరో 52 మంది భారతీయులు ఉన్నారనీ, ఆ రెండు నిర్బంధ కేంద్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 52 మందిలో అత్యధికులు సిక్కులు, క్రైస్తవులేనని అధికారులు చెప్పారు. ‘ఓరెగాన్‌లోని నిర్బంధ కేంద్రాన్ని ఇప్పటికే మా అధికారి సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. న్యూ మెక్సికోలోని కేంద్రానికి కూడా మరో అధికారి వెళ్తారు’ అని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడి జైళ్లలో మగ్గుతున్న భారతీయుల్లో అత్యధికులు సిక్కులే ఉంటున్నారు. 2013–17 మధ్యలో దాదాపు 27 వేల మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ నిర్బంధానికి గురవ్వగా, చాలామంది ఇప్పటికీ జైళ్లలోనే ఉన్నారు. నిర్బంధ కేంద్రం సందర్శించిన మెలానియా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ శుక్రవారం టెక్సాస్‌లోని నిర్బంధ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ కేంద్రంలో హొండురాస్, గ్వాటెమాలా, ఎల్‌సాల్వడార్ దేశాలకు చెందిన 55 మంది చిన్నారులు ఉండగా వారితో మెలానియా నేరుగా మాట్లాడారు. అక్కడి సామాజిక కార్యకర్తలు, ప్రభుత్వాధికారులతో మాట్లాడుతూ.. పిల్లలను తమ తల్లిదండ్రుల వద్దకు వీలైనంత తొందరగా చేర్చడానికి తన నుంచి ఎలాంటి సాయం కావాలో చెబితే చేస్తానని ఆమె హామీనిచ్చారు. అయితే నిర్బంధ కేంద్రానికి బయల్దేరే ముందు మెలానియా ధరించిన వస్త్రాలపై ‘ఐ రియల్లీ డోంట్ కేర్. డూ యూ?’ (నేను ఏ మాత్రం లెక్కచేయను. మీరు చేస్తారా?) అని రాసి ఉండటం వివాదాస్పదమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య ధరించిన వస్త్రాలపై స్పందిస్తూ ‘ఆమె వస్త్రాలపై రాసిన వ్యాఖ్యలు నకిలీ వార్తల మీడియాను ఉద్దేశించినవి’ అని ట్వీట్ చేశారు. -
ప్రయోగాల కోసం ఓ నిర్మానుష్య ప్రయోగం
అమెరికాలోని న్యూ మెక్సికో సరిహద్దుల్లో కొత్తగా ఓ టౌన్‌షిప్‌ను కట్టేస్తున్నారు. దాదాపు 35 వేల మందికి సరిపడా ఇళ్లు, రోడ్లు, ఆఫీసు బిల్డింగ్లు, హైవే... వంటి అన్ని హంగులూ ఉంటాయి దీంట్లో. అయితే ఏంటట? ఇదో కొత్త రియల్ ఎస్టేట్ వెంచరో, గేటెడ్ కమ్యూనిటీ టైపో అయివుంటుందని అనుకుంటున్నారా? అక్కడే ఉంది మెలిక. దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ టౌన్షిప్లో మనిషన్నవాడు ఉండడు!! ఆశ్చర్యపోకండి! ఇంత డబ్బు పోసి దీన్ని కడుతోంది రేపటితరం టెక్నాలజీలను పరీక్షించేందుకట! పెగసస్ గ్లోబల్ హోల్డింగ్ అనే సంస్థ దీన్ని నిర్మిస్తోంది. టౌన్షిప్ పేరు.. సెంటర్ ఫర్ ఇన్నొవేషన్, టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్. మొత్తం 15 చదరపు మైళ్ల విస్తీర్ణంలో కడుతున్న ఈ టౌన్షిప్లో హైటెక్ రవాణా వ్యవస్థ (డ్రైవర్లు లేనివి, ఇతరత్రా)తోపాటు, కొత్తకొత్త సంప్రదాయేతర ఇంధన వనరులు (సోలార్, జియోథర్మల్ వంటివి), స్మార్ట్ గ్రిడ్, టెలీకమ్యూనికేషన్స్, సెక్యూరిటీ, సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే నిర్లవణీకరణ వంటి అనేక టెక్నాలజీలపై రిమోట్‌గా (టౌన్షిప్ బయటనుంచి) ప్రయోగాలు జరుగుతాయి. మనుషులుంటే వారి భద్రత తదితర అంశాలు ఈ ప్రయోగాలకు అడ్డంకిగా మారతాయని కంపెనీ భావిస్తోంది. అందుకే నిర్మానుష్యమైన నగరాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ప్రయోగ ఫలితాలతో అమెరికా ఆయా రంగాల్లో సరికొత్త ఇన్నొవేషన్స్ చేయగలదని, అంతేకాకుండా సుక్షితులైన పనిమంతులూ దొరుకుతారని పెగసస్ అంచనా వేస్తోంది. కరెంటు, నీళ్లు, ఇంటర్నెట్, మురుగునీటి సౌకర్యం వంటివి టౌన్షిప్లో ఉన్న అన్ని బ్లాకులకు అందేలా బ్యాక్‌బోన్ వ్యవస్థ ఒకటి ఉంటుంది. దీన్ని బ్యాక్‌బోన్ హబ్ ద్వారా పర్యవేక్షిస్తూంటారు. ప్రయోగాలు నిర్వహించేందుకు ఈ టౌన్షిప్ సరిహద్దుల్లో ఓ భారీ భవనాన్ని కూడా కడుతున్నారు. దీన్ని సిటీ క్యాంపస్ అని పిలుస్తున్నారు. రిమోట్‌గా పనిచేసే శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు అందరూ దీంట్లో ఉంటారుగానీ.. టౌన్‌షిప్‌లోకి మాత్రం అడుగుపెట్టరన్నమాట. ఇంకో విషయం... ఈ టౌన్షిప్ నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందుకోసం కొన్ని వందల మంది కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నట్లు పెగసస్ అంటోంది.