Andhra Pradesh Demands Setting Up New Tribunal for Water Distribution - Sakshi
Sakshi News home page

నీటి పంపిణీ తర్వాతే డీపీఆర్‌లు

Published Thu, Apr 28 2022 3:56 AM | Last Updated on Thu, Apr 28 2022 6:59 PM

Andhra Pradesh demands setting up new tribunal for water distribution - Sakshi

సాక్షి, అమరావతి: ‘కొత్తగా గోదావరి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలి. నదిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా మదింపు చేసి, రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయాలి. అప్పటివరకు ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల డీపీఆర్‌లకు సాంకేతిక అనుమతి ఇవ్వకూడదు. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించాలి’ అని గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. తెలంగాణ చేపట్టిన చనాకా – కొరటా, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లను మదింపు చేయవద్దని కోరింది. గోదావరి ట్రిబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయలేదని గుర్తు చేసింది. వాటికి అనుమతి ఇస్తే గోదావరి డెల్టా, పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.

విభజన చట్టం ప్రకారం వాటికి సాంకేతిక అనుమతి ఇచ్చి, సీడబ్ల్యూసీ ఆమోదానికి పంపాలని పట్టుబట్టింది. గోదావరి బోర్డు చైర్మన్‌ మహేంద్ర ప్రతాప్‌సింగ్‌ ఏపీ వాదనతో ఏకీభవించారు. తెలంగాణ ప్రతిపాదించిన మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లకు సాంకేతిక అనుమతి ఇవ్వకుండా రెండు రాష్ట్రాల వాదనలను సీడబ్ల్యూసీకి పంపుతామని చెప్పారు. హైదరాబాద్‌లోని గోదావరి బోర్డు కార్యాలయంలో బుధవారం చైర్మన్‌ ఎంపీ సింగ్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, సీఈ మోహన్‌కుమార్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పరిధిపై తలోమాట
గోదావరి ప్రధాన పాయపై ఎస్సారెస్పీ నుంచి సీతారామసాగర్‌ వరకు అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ అధికారులు ప్రతిపాదించగా.. తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగును మాత్రమే బోర్డు పరిధిలోకి తేవాలని అన్నారు. దీనికి ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. పరిధిపై మరో మారు చర్చిద్దామని, బోర్డుకు తగినంత మంది సిబ్బందిని కేటాయించాలని చైర్మన్‌ కోరారు. ఇందుకు ఏపీ సుముఖత వ్యక్తం చేయగా.. 
తెలంగాణ అంగీకరించలేదు. 

జూలై 15లోగా అనుమతి తీసుకోవాల్సిందే
గోదావరి బేసిన్‌లో అనుమతి లేని ప్రాజెక్టులకు జూలై 15లోగా అనుమతి తీసుకోవాలని, లేదంటే వాటి ద్వారా నీటి వినియోగాన్ని అనుమతించబోమని ఛైర్మన్‌ స్పష్టంచేశారు. గోదావరిలో నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి, మదింపు చేయాలని 2020 అక్టోబర్‌ 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో కోరామని ఏపీ అధికారులు గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయడానికి కొత్తగా గోదావరి ట్రిబ్యునల్‌ వేయాలని కోరామన్నారు. వీటిపై బోర్డు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ రెండు అంశాలు బోర్డు పరిధిలో లేవని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని బోర్డు చైర్మన్‌ చెప్పారు కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి సంప్రదించాలని ఏపీ అధికారులకు సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement