
గోదావరి బోర్డు మొక్కుబడి భేటీ
* బోర్డు చైర్మన్ పదవీ విరమణ నేపథ్యంలో సమావేశం
* సీలేరు, బూర్గంపహాడ్ అంశాలను ప్రస్తావించిన తెలంగాణ
* సీలేరు విద్యుత్ వివాదం కేంద్రం పరిధిలోనిదని చెప్పిన బోర్డు
సాక్షి, హైదరాబాద్: గోదావరి బోర్డు రెండో సమావేశం మంగళవారం మొక్కుబడిగా సాగింది. బోర్డు చైర్మన్ ఎం.ఎస్.అగర్వాల్ బుధవారం పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన వీడ్కోలుకే పరిమితమైంది. సీలేరు విద్యుత్‌పై చర్చించినప్పటికీ, విద్యుత్ షెడ్యూలింగ్‌పై సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి వచ్చిన నివేదికకు కేంద్ర విద్యుత్ శాఖ ఆమోదం తెలపకపోవడం, ఆ నివేదిక బోర్డుకు అందకపోవడంతో ఏ విషయం తేల్చలేదు. సీలేరుపై తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిదే అంటూ సమావేశాన్ని ముగించింది.
బోర్డు తొలి సమావేశం జరిగిన సమయానికి పూర్తిస్థాయి చైర్మన్ లేరు. చైర్మన్‌గా అగర్వాల్‌ను నియమించిన తర్వాత బోర్డు భేటీ జరగలేదు. ఆయన బుధవారం పదవీ విరమణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అధ్యక్షతన ఒక్కసారైనా బోర్డు సమావేశమవ్వాలనే ఉద్దేశంతో మంగళవారం భేటీ ఏర్పాటు చేశారు. జలసౌధలో జరిగిన ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖల కార్యదర్శులు ఎస్‌కే జోషీ, ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వర్‌రావులు హాజరయ్యారు. సమావేశం అనంతరం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘బోర్డుకు అవసరమైన సదుపాయాల కల్పనకు, సిబ్బంది, నిధులను కేటాయించడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. బోర్డు మార్గదర్శకాలు, వర్కింగ్ మాన్యువల్ ముసాయిదాపై జనవరి 10లోగా అభిప్రాయాలు పంపడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. బోర్డును సాంకేతికంగా బలోపేతం చేయడానికి గోదావరి బేసిన్‌లో అన్ని ప్రాజెక్టుల సమాచారాన్ని అందుబాటులో ఉంచడానికి ఒప్పుకున్నాయి. బోర్డు చైర్మన్‌గా అగర్వాల్ విశిష్ట సేవలు అందించారని రెండు రాష్ట్రాలూ తెలిపాయి’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ ఈ సమావేశంలో సీలేరు వివాదాన్ని ప్రస్తావించింది. ఈ ప్రాజెక్టుకు 740 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉందని, 58:42 నిష్పత్తిలో తెలంగాణకు ఇవ్వాల్సిన వాటాను ఆంధ్రప్రదేశ్ ఇవ్వడంలేదని తెలిపింది. దీనిపై ఏపీ స్పందిస్తూ.. సీలేరు ప్రాజెక్టు పూర్తిగా ఏపీకే చెందుతుందని, విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణకు సంబంధం లేదని చెప్పింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం చెబుతూ, గోదావరి పరీవాహకంలో ఉన్న ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయని, సీలేరు సైతం బోర్డు పరిధిలో అంశమేనని వాదించింది.
ఈ సమయంలో బోర్డు జోక్యం చేసుకుంటూ.. దీనిపై కేంద్రం ఇవ్వాల్సిన నివేదిక రానందున ఈ అంశాన్ని తాము తేల్చలేమని, కేంద్రమే తేల్చాలని స్పష్టం చేసింది. పోలవరం ముంపును కారణంగా చూపుతూ ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో మిగతా ప్రాంతాన్నీ ఏపీలో కలపాలని వస్తున్న డిమాండ్‌లపై తెలంగాణ స్పష్టత కోరింది. దీనిపై ఏపీ స్పందిస్తూ, ఈ విషయంపై జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని తెలిపింది. బూర్గంపహాడ్‌పై తామెలాంటి లేఖలు రాయలేదని, సర్వేలు చేయలేదని స్పష్టం చేసింది.