సాక్షి, అమరావతి: సీతారామ ఎత్తిపోతల, సీతమ్మ సాగర్ బహుళార్ధసాధక ప్రాజెక్టుకు నీళ్లెక్కడివని తెలంగాణ ప్రభుత్వాన్ని గోదావరి బోర్డు ప్రశ్నించింది. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేయలేదని, నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందమే కుదరలేదని స్పష్టంచేసింది. నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టును ఎలా చేపట్టారని తెలంగాణను నిలదీసింది. దమ్ముగూడెం ఆనకట్టకు 200 మీటర్ల దిగువన 36.57 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో సీతమ్మసాగర్ బ్యారేజీ, దానికి అనుబంధంగా 320 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్ కేంద్రం నిర్మించి రోజుకు 9 వేల క్యూసెక్కుల చొప్పున 70 టీఎంసీలను తరలించి 6.74 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా సీతారామ ఎత్తిపోతలను తెలంగాణ చేపట్టింది.
ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను గోదావరి బోర్డుకు అందజేసింది. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి, రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసే వరకు తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకూడదని, తద్వారా దిగువ రాష్ట్రం హక్కులను పరిరక్షించాలని గోదావరి బోర్డు, కేంద్ర జల్ శక్తి శాఖలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక లేఖలు రాసింది. ఇదే అంశంపై జనవరి 3న జరిగిన సర్వ సభ్య సమావేశంలోనూ సీడబ్ల్యూసీని కోరింది. తాజాగా సీతారామా ఎత్తిపోతలపై గోదావరి బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
పోలవరం ఆయకట్టుకు రక్షణ కల్పిస్తేనే
పోలవరం ప్రాజెక్టు వద్ద 75 శాతం లభ్యత ఆధారంగా 561 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) 141వ సమావేశంలో తేల్చింది. ఎగువన ఏ ప్రాజెక్టు చేపట్టినా పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన 561 టీఎంసీలకు రక్షణ కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. కానీ.. సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌లో సీతమ్మ సాగర్ వద్ద 347.06 టీఎంసీల లభ్యత ఉంటుందని తెలంగాణ పేర్కొంది. దీనిని అధ్యయనం చేసి నీటి లభ్యతను ఖరారు చేయాలని సీడబ్ల్యూసీకి గోదావరి బోర్డు ప్రతిపాదించింది. సీతారామ ఎత్తిపోతల చేపడితే పోలవరం వద్ద 561 టీఎంసీల లభ్యతపై స్పష్టత ఇవ్వాలని కోరింది.
కృష్ణా బేసిన్‌కు ఎలా తరలిస్తారు?
సీతారామ ఎత్తిపోతల ద్వారా 10.109 టీఎంసీల గోదవరి జలాలను కృష్ణా బేసిన్‌కి తరలించి నాగార్జునసాగర్, వైరా, పాలేరు ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరిస్తామని డీపీఆర్‌లో తెలంగాణ సర్కార్ పేర్కొంది. ఏ ప్రాతిపదికన గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తారో స్పష్టత ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌ను గోదావరి బోర్డు కోరింది. వీటిపై స్పష్టత ఇస్తేనే సీతారామ ఎత్తిపోతల, సీతమ్మసాగర్ డీపీఆర్ మదింపు, అనుమతి ప్రక్రియ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.
రెండు రాష్ట్రాల డిమాండ్ 1,743 టీఎంసీలు
ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలోని ప్రాజెక్టుల అవసరాలకు 776 టీఎంసీలు అవసరమని ఏపీ, 967 టీఎంసీలు అవసరమని తెలంగాణ ప్రతిపాదించాయని గోదావరి బోర్డు పేర్కొంది. అంటే.. రెండు రాష్ట్రాల అవసరాలు 1,743 టీఎంసీలని లెక్కగట్టింది. కానీ, గోదావరిలో ఆ మేరకు నీటి లభ్యత లేదని రెండు రాష్ట్రాలూ అంగీకరిస్తున్నాయని తెలిపింది. ఉమ్మడి ఏపీ 2014 జనవరి 2న రాసిన లేఖ ప్రకారం గోదావరిలో నీటి లభ్యత 1,486.155 టీఎంసీలని తెలంగాణ అంటుండగా, 2004 నాటి వ్యాప్కోస్ నివేదిక ప్రకారం గోదావరిలో కేవలం 1,360 టీఎంసీలని, పునరుత్పత్తితో కలిసి 1,430 టీఎంసీలని ఏపీ ప్రభుత్వం పేర్కొంటోంది.
పునరుత్పత్తి జలాలను పరిగణలోకి తీసుకోకూడదని గోదావరి ట్రిబ్యునల్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. వ్యాప్కోస్ నివేదిక ప్రకారం నీటి లభ్యత 1,360 టీఎంసీలే. ఇదిలా ఉండగా.. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల ద్వారా 2000 – 2020 మధ్య కాలంలో సగటున వరుసగా 72 టీఎంసీలు, 11 టీఎంసీలను వాడినట్టు తెలంగాణ పేర్కొంది. ఈ నేపథ్యంలో గోదావరి బేసిన్, సబ్ బేసిన్ల వారీగా నీటి లభ్యతపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని గోదావరి బోర్డు కోరింది.
Comments
Please login to add a commentAdd a comment