సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం కుడికాల్వ సామర్థ్య విస్తరణపై తెలంగాణ అభ్యంతరాలు లేవనెత్తింది. గోదావరి మిగులు జలాల్లో వాటాలు తేల్చకుండా కాల్వ విస్తరణ ద్వారా అదనంగా 3 టీఎంసీల నీటిని తీసుకోవడంపై బోర్డుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు విఘాతం కల్గించేలా ఉన్న ఈ చర్యలను అడ్డుకోవాలని గోదావరి నదీయాజమాన్య బోర్డును కోరింది.
ఈ మేరకు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ బోర్డుకు లేఖ రాశారు. గత నెల 16న ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలను అందులో పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంత కరువు నివారణ చర్యల్లో భాగంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం వేగం పెంచడంతోపాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా డెల్టా, సాగర్ కుడి కాల్వ కింది ఆయకట్టు అవసరాలను తీర్చేందుకు పోలవరం కుడి కాల్వ సామర్థ్యాన్ని 50 వేల క్యూసెక్కులకు పెంచుతామని గవర్నర్ పేర్కొన్న విషయాన్ని బోర్డు దృష్టికి తెచ్చారు.
ఈ ప్రసంగానికి బలాన్ని ఇస్తూ కొన్ని పత్రికలు పోలవరం కుడి కాల్వ ప్రస్తుత సామర్ధ్యం 17,633 క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచి మొత్తంగా 300 టీఎంసీల నీటిని తీసుకునేలా రూ.68 వేల కోట్లతో ఏపీ ప్రతిపాదనలు సిద్ధం చేసిందని రాసిన విషయాన్ని కూడా అందులో పేర్కొన్నారు. ఈ కాల్వ సామర్థ్యం పెంపుతో ప్రస్తుతం 1.5 టీఎంసీలు తీసుకెళ్లే సామర్థ్యానికి అదనంగా మరో 3 టీఎంసీలు కలిపి రోజుకు 4.5 టీఎంసీలు తీసుకునే అవకాశం ఏపీకి ఉంటుందని బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారాæ పోలవరం నుంచి గోదావరి జలాలను కృష్ణా బేసిన్ మీదుగా పెన్నా బేసిన్‌కు తరలించడం అవుతుందని తెలిపారు.
ఏలూరు కెనాల్‌కు అనుమతిచ్చినట్లు ప్రస్తావన
కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో 80 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీక రించేలా ఏలూరు కెనాల్‌కు పరిపాలనా అనుమతులు ఇచ్చిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికే పోలవరం, పట్టిసీమ మళ్లింపు జలాలతో తెలంగాణకు దక్కే నీటివాటా విషయం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని, ఈ వాటాపై తేల్చే విషయంలో కావాలనే ఏపీ ప్రతిసారీ జాప్యం చేస్తూ బోర్డు చర్చలపై దాటవేత ధోరణి ప్రదర్శిస్తోందని గుర్తు చేసింది.
ఈ నేపథ్యంలో గోదా వరి మిగులు జలాల వాటాల అంశం తేలకుండా ఈ నదీ ప్రవాహాన్ని కృష్ణా బేసిన్‌కు తరలించేలా ఏపీ చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలపై ముందుకెళ్లకుండా వాటిని అడ్డుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. గోదావరి మిగులు జలాల్లో వాటాను తేల్చకుండా ఈ ప్రాజెక్టులపై ఏపీ ముందుకెళితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల డీపీఆర్‌లను బోర్డుకు సమర్పించడంతోపాటు పారదర్శకంగా ప్రాజెక్టుల ఆమోదం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment