‘గోదావరి’పై మరో రచ్చ | AP, Telangana Fight for godavari water | Sakshi
Sakshi News home page

‘గోదావరి’పై మరో రచ్చ

Published Fri, Dec 19 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

AP, Telangana Fight for godavari water

* నదీ జలాలపై రాజుకుంటున్న కొత్త వివాదం
* బూర్గంపహాడ్ మండలంలోని మిగతా గ్రామాలనూ తమకే ఇవ్వాలని కేంద్రంపై ఏపీ ఒత్తిడి
* అక్కడి 10 వేల ఎకరాల ఆయకట్టు ముంపు పరిధిలోనిదేనంటూ వాదన
* గోదావరి బోర్డు భేటీలో చర్చించాలంటూ పట్టు
* కిన్నెరసానిలో 10 టీఎంసీల నీటిని కొట్టేసేందుకే ఆంధ్రప్రదేశ్ యత్నమంటున్న తెలంగాణ సర్కారు
* ఇప్పటికే ఆ ప్రాజెక్టు పనులు 69 శాతం పూర్తి
* 24న జరగనున్న బోర్డు సమావేశం.. వాదనలకు సిద్ధమవుతున్న ఇరు రాష్ట్రాల అధికారులు
* పోలవరం ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న గోదావరి బోర్డు చైర్మన్ ఎంఎస్ అగర్వాల్
* నేటి నుంచి రెండు రోజులపాటు పోలవరం, గోదావరి పరీవాహక జిల్లాల్లో పర్యటన

సాక్షి, హైదరాబాద్: పోలవరం ముంపు ప్రాంతాలను కలుపుకోవడం ద్వారా ఇప్పటికే సీలేరు విద్యుత్ ప్రాజెక్టును దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్... ఇప్పుడు కిన్నెరసాని నీటిపైనా కన్నేసింది. అదే ముంపును సాకుగా చూపుతూ.. పది టీఎంసీల నీటికి టెండర్ పెట్టింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ మండలం పరిధిలోని మిగతా ముంపు గ్రామాలనూ తమకే కేటాయించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకురావడంతో పాటు గోదావరి బోర్డు సమావేశంలోనూ చర్చకు పెట్టేలా యత్నాలు ముమ్మరం చేసింది. దీంతో గోదావరి నది నీటి వాడకంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరో చిచ్చు రగులుకుంటోంది.

పోలవరం ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరాలు లేవనెత్తినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ ఏడు మండలాల విలీనంతో తెలంగాణకు చెందాల్సిన సీలేరు జల విద్యుత్ కేంద్రాలు కూడా ఏపీ పరిధిలోకి వెళ్లిపోయాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. గోదావరిలో నీటి లోటు ఉన్న సమయంలో ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రమే అవసరాల మేరకు నీటిని వినియోగించుకుంటే... దిగువన ఉన్న తమ పరిస్థితి ఏమిటో తేల్చాలంటూ గోదావరి బోర్డును ఆశ్రయించింది.

ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల అంశాన్ని కూడా బోర్డు ఎజెండాలో పెట్టాలని నిర్ణయించడం కొత్త వివాదానికి దారి తీస్తోంది. ఇంతకుముందు తెలంగాణ ముంపు గ్రామాలను ఏపీలో విలీనం చేసే క్రమంలో... ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని 11 గ్రామ పంచాయతీల్లో ఆరు పంచాయతీలు ఏపీలోకి వెళ్లాయి. ఇప్పుడు అదే పోలవరం ముంపును సాకుగా చూపుతూ మిగతా గ్రామాలను సైతం ఏపీలో కలపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లిన ఏపీ... గోదావరి బోర్డు సమావేశంలోనూ దీన్ని చర్చకు పెట్టి, బోర్డు నుంచి సానుకూలత తెచ్చుకునేలా ప్రయత్నాలు ప్రారంభించింది.

అసలు ఉద్దేశం ఆ నీళ్లే..
మిగతా ముంపు గ్రామాలను ఏపీలో కలపాలన్న డిమాండ్ వెనుక అసలు ఉద్దేశం గోదావరి ఉపనది అయిన కిన్నెరసాని నీటిని సొంతం చేసుకోవడమేనని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఏటా 8 నుంచి 10 టీఎంసీల నీటి లభ్యత ఉండే ‘కిన్నెరసాని’తో కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం పారిశ్రామిక యూనిట్లకు నీటిని సరఫరా చేయాలని, 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కిన్నెరసాని ప్రాజెక్టును చేపట్టి ఇప్పటికే 69 శాతం పనులను సైతం పూర్తి చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం.. కిన్నెరసాని కింది ఆయకట్టు ప్రాంతం అంతా పోలవరం ముంపు ప్రాంతమేనని, దాన్ని విలీనం చేయకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యం కాదని వాదిస్తోంది. ఈ దృష్ట్యా 10 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న గ్రామ పంచాయతీలను మొత్తంగా ఏపీలో కలపాలని కోరుతోంది.

అయితే ఈ ప్రాంతం ఏపీ పరిధిలోకి వెళితే కిన్నెరసాని నీటి వినియోగంపై పూర్తి ఆధిపత్యం ఆ రాష్ట్రం చేతుల్లోకి వెళుతుందని తెలంగాణ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంపును సాకుగా చూపి ‘కిన్నెరసాని’లో లభించే 10 టీఎంసీల నీటిని మళ్లించుకోవాలన్నదే ఏపీ ఉద్దేశమని భారీ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ‘ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక ఇ చ్చాం. తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. బోర్డు సమావేశం నాటికి పూర్తి స్థాయిలో దీనిపై నిలదీస్తాం..’ అని ఆ అధికారి చెప్పారు. ఈ నెల 24న జరగనున్న బోర్డు సమావేశంలో ఈ అంశంపై ఇరు పక్షాలు వాదనలు వినిపించనున్నాయి.

నేటి నుంచి బోర్డు చైర్మన్ పర్యటన..
గోదావరి నది జలాల వాడకంపై తెలంగాణ, ఏపీల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్న నేపథ్యంలో...  గోదావరి బోర్డు చైర్మన్ ఎంఎస్ అగర్వాల్ శుక్రవారం నుంచి రెండు మూడు రోజుల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. శుక్రవారం ఆయన ధవళేశ్వరం వద్ద పర్యటించి, అనంతరం ఉభయ గోదావరి జిల్లాల్లో, పోలవరం ముంపు ప్రాంతాల్లో పరిశీలన చేపడతారని బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఆ తరువాత ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా భద్రాచలం దాకా గోదావరి నీటిమట్టాలు, దాని తీరుతెన్నులపైనా పరిశీలన చేసే అవకాశముందని పేర్కొన్నాయి.

పోలవరం పర్యటనలో భాగంగా ముంపు ప్రాంతాలు, కిన్నెరసాని ప్రాజెక్టును కూడా ఆయన సందర్శించవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని.. వచ్చే బోర్డు సమావేశం నాటికి ఇరు రాష్ట్రాల అభిప్రాయాలతో పాటు తనకు ఒక అవగాహన ఉండాలనే ఆయన పర్యటిస్తున్నారని తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement