సాక్షి, హైదరాబాద్ : గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉందన్న తెలంగాణ వాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. గోదావరి జలాలపై తెలంగాణ నీటిపారుదల అధికారులు వాదనకు ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చేసిందో చూపించాలని ఏపీ అధికారులు నిలదీశారు. కాగా గోదావరి నదిపై రెండు తెలుగు రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, వర్కింగ్ మాన్యువల్ ఖరారు, బడ్జెట్, సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై చర్చించేందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన భేటీ ముగిసింది. (డీపీఆర్‌లు ఇవ్వాల్సిందే)
బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికం
గోదావరి బోర్డు సమావేశంలో భాగంగా గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉందన్న తెలంగాణ వాదననలు ఏపీ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటన ఆధారంగా గోదావరిలో 967 టీఎంసీలు వాటా ఉంటుందని తెలంగాణ బోర్డు దృష్టికి తీసుకురాగా.. దీనిపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. బచావత్ ట్రిబ్యునల్లో తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చూపలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికంగా తీసుకోవాలని ఏపీ అధికారులు బోర్డు చైర్మన్‌కు విన్నవించారు.
కొత్త ప్రాజెక్టులకు బ్రేక్..
అలాగే బచావత్ ట్రిబ్యునల్‌లో ఎక్కడా కూడా తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు చేయలేదని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ఇరు రాష్ట్రాల అధికారుల వాదనలు విన్న బోర్డు చైర్మన్ చంద్రశేఖర్.. నీటి వినియోగం లెక్కలు తేల్చేందుకు టెలీమీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని రెండు రాష్ట్రాలను ఆదేశించారు. ఈ నెల 10వ తేదీలోగా ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లు ఇవ్వాలని ఇరు రాష్ట్రాలకు సూచించారు. బోర్డు సూచనకు ఇరు ప్రభుత్వాల అధికారులు అంగీకరించారు. ఈ సమావేశంలో ఏపీ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నుంచి నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్ వాదనలు విపించారు.
కేంద్రం ఆదేశాలతో..
కాగా విభజన చట్టానికి విరుద్ధంగా, ‘అపెక్స్ కౌన్సిల్’ అనుమతి లేకుండా గోదావరిపై తెలంగాణ చేపట్టిన ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు, నీటి మళ్లింపు ప్రాజెక్టులు, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు తదితర అంశాలపై గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచుతుండటాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ అనుమతించే వరకూ ఆ ప్రాజెక్టులను నిలుపుదల చేసేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గోదావరి బోర్డు చైర్మన్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ దృష్ట్యా వాటిని నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్‌ను గోదావరి బోర్డు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బోర్డు సమావేశం జరిగింది. గురువారంమే కృష్ణా బోర్డు సమావేశం జరిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment