
ఎందుకు, ఏమిటి, ఎలా?
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ చేస్తున్న రీ ఇంజనీరింగ్ ప్రణాళికలపై గోదావరి బోర్డు ముందు స్పష్టత తెచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 20న జరగనున్న బోర్డు సమావేశంలో గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులు ప్రాణహిత-చేవెళ్ల, ఇందిరమ్మ వరద కాల్వ, కంతనపల్లి, దుమ్ముగూడెం ప్రాజెక్టులపై తెలంగాణ విధానాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రీ ఇంజనీరింగ్ ద్వారా గోదావరి జలాల వినియోగం ఏమైనా పెరుగుతుందా? దిగువకు నీటి ప్రవాహాలకు ఆటంకం ఉంటుందా? తదితరాలపై తెలంగాణ వివరణ కోరే అవకాశాలున్నాయని నీటిపారుదల శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పాటే సీలేరు విద్యుత్ వినియోగం, నీరజామాధూర్ కమిటీ నివేదిక, బోర్డుకు కార్యాలయం కేటాయింపు, వాహనాల కూర్పు తదితరాలపైనా చర్చించనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
వ్యాప్కోస్ ప్రతినిధులతో ఈఎన్‌సీ భేటీ: గోదావరి ప్రాజెక్టులపై రాష్ట్రం నుంచి ఏపీ వివరణ కోరనున్న నేపథ్యంలో తెలంగాణ సైతం అప్రమత్తమైంది. గోదావరిపై ప్రాజెక్టుల సర్వే బాధ్యతలు చూస్తున్న వ్యాప్కోస్ సంస్థ ప్రతినిధులతో శాఖ ఈఎన్‌సీ మురళీధర్ బుధవారం సమావేశం నిర్వహించారు. సర్వే వివరాలపై ఆరా తీశారు. పూర్తిస్థాయి వివరాలు అందేందుకు ఆలస్యమైతే ప్రాథమిక నివేదికనైనా తమకు సమర్పించాలని ఈఎస్‌సీ కోరినట్లు తెలిసింది.
21న కృష్ణా బోర్డు సమావేశం: ఈ నెల 21న మరోమారు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, ఇరు రాష్ట్రాల వినియోగం, భవిష్యత్ అవసరాలపై సమావేశం చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటే ప్రస్తుతం డిసెంబర్ 15 వరకు జరిపిన కేటాయింపుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని తెలంగాణ కోరుతోంది. ముఖ్యంగా శ్రీశైలం నుంచి గతంలో నీటి విడుదలకు అనుమతిచ్చినా, 2 టీఎంసీలను తాము వినియోగించుకోలేకపోయామని, ఆ నీటిని ప్రస్తుతం జరిపిన కేటాయింపుల్లో కలపకపోవడంతో ఆ మేరకు నష్టం జరుగుతుందని తెలంగాణ ఇటీవల బోర్డు దృష్టికి తెచ్చింది. దీనిపై బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.