..అస్మదీయుడు అధికారంలో ఉంటే.. తప్పు చేసినా ఒప్పేనని వంకర రాతలు అచ్చేయడంలో ‘ఈనాడు’ తనకు తానే సాటి. ..అదే తస్మదీయుడు అధికారంలో ఉంటే.. ఒప్పు చేసినా తప్పేనని నీచపు రాతలు అచ్చేయడంలో ఆ పత్రికే మేటి. గడచిన రెండున్నరేళ్లలో దాదాపు 16 నెలలపాటు కరోనా మహమ్మారి విరుచుకుపడింది. ప్రపంచ, దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఇన్ని ఇబ్బందుల్లోనూ.. సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు దన్నుగా నిలవడంతోపాటు సాగునీటి ప్రాజెక్టులకూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారు. నిర్వాసితుల సమస్యను పరిష్కరించడం ద్వారా పులిచింతల, సోమశిల, కండలేరు, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల చరిత్రలో తొలిసారిగా గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వచేశారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను వడివడిగా పూర్తిచేస్తున్నారు. 2019, 2020లలో కోటి ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు.. ఈ ఏడాదీ అదే స్థాయిలో నీళ్లందిస్తున్నారు. ..తన వాడు కాకుండా.. పరాయివాడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంటే ఈనాడుకి కడుపుమంట. నిజమైన కడుపులో మంటకు చికిత్స చెయ్యొచ్చు. కానీ.. ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో వచ్చే కడుపుమంటకు ఏ మందు ఉంటుంది? ‘‘పూర్తి చేసేదెప్పుడో’’ శీర్షికతో సోమవారం ఆ పత్రికలో అదే కడుపుమంటతో ఓ కథనం ప్రచురించారు. అందులోని నిజానిజాలేమిటో చూద్దాం..
సాక్షి, అమరావతి: కరోనా ప్రతికూల పరిస్థితులు.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా.. వరదలు ముంచెత్తినా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను వడివడిగా పూర్తిచేస్తోంది. సంక్షేమ పథకాల ద్వారా పేదలకు భరోసా కల్పిస్తూనే 28 నెలల్లో రూ.14,971.79 కోట్లను సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చుచేసింది. 2019, 2020లలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగాయి. ఓ వైపు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తూనే.. పంట విరామ సమయంలో ప్రాజెక్టుల పనులను సర్కారు పరుగులు పెట్టిస్తోంది. దాంతో సకాలంలో ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. పెన్నా డెల్టాకు పునరుజ్జీవం పోసే నెల్లూరు, సంగం బ్యారేజీల పనులు పూర్తయ్యాయి. వాటిని ఈ ఏడాదే ప్రారంభించనున్నారు.
వంశధార ప్రాజెక్టు రెండో దశ, వంశధార–నాగావళి అనుసంధానం, వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ, గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ వచ్చే ఏడాదికి పూర్తవుతాయి. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో జీవచ్ఛవంలా మార్చిన పోలవరం ప్రాజెక్టుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జీవం పోశారు. రీయింబర్స్ చేయడంలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తున్నా.. రాష్ట్ర ఖజానా నుంచే నిధులు కేటాయిస్తూ పోలవరం పనులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. స్పిల్ వే పూర్తయింది. ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తిచేసి జూన్ 11 నుంచే గోదావరి వరదను స్పిల్ వే గేట్ల ద్వారా మళ్లించారు. రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాదికి పూర్తికానుంది.
చదవండి: (ఏపీపై ‘ఈనాడు’ డ్రగ్స్ విషం)
సుభిక్షం చేసే దిశగా వడివడిగా అడుగులు..
అతివృష్టి.. అనావృష్టి పరిస్థితులవల్ల కృష్ణా నది నుంచి శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గాయి. శ్రీశైలానికి వరద వచ్చే 40 రోజుల్లోగానే ఆ ప్రాజెక్టుపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేందుకు కాలువల సామర్థ్యాన్ని పెంచే పనులను సీఎం వైఎస్ జగన్ చేపట్టారు. 854 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నా శ్రీశైలం నుంచి నీటిని తరలించి.. సాగు, తాగునీటి కష్టాలు తీర్చడానికి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. తద్వారా దేశంలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సుభిక్షం చేయడానికి ప్రణాళిక రచించారు. గోదావరి జలాలను తరలించి పల్నాడును.. కృష్ణాపై మూడు బ్యారేజీల ద్వారా కృష్ణా డెల్టా, కొల్లేరును పరిరక్షించడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి శ్రీకారం చుట్టారు. బడ్జెట్ కేటాయింపులతోపాటూ నాలుగు ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్)లను ఏర్పాటుచేశారు. జాతీయ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తేవడం ద్వారా నిధుల కొరతలేకుండా చేసి.. సకాలంలో పూర్తిచేయడానికి ప్రణాళిక రచించారు.
‘చంద్ర’ దోపిడీ ఇంపుగా కనిపించిందా?
పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను రూ.17,368 కోట్లతోనే పూర్తిచేస్తామని జూలై 28, 2014న సాగునీటి ప్రాజెక్టులపై నాటి సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో స్పష్టంచేశారు. 2014, జూన్ 8 నుంచి మే 29, 2019 వరకూ సాగునీటి ప్రాజెక్టులకు రూ.56,228.75 కోట్లను టీడీపీ సర్కార్ ఖర్చుచేసింది. ఈ సమయంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయింది. కమీషన్లు ఇవ్వని కాంట్రాక్టర్లను 60–సీ నిబంధన కింద తొలగించి.. మిగిలిన పని అంచనా వ్యయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచేసి.. అడిగినంత కమీషన్ ఇచ్చిన కాంట్రాక్టర్లకు అప్పగించి ఖజానాను దోచేయడంవల్లే రూ.56,228.75 కోట్లు ఖర్చుచేసినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయింది. కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేకపోయింది. కమీషన్ల కోసం పోలవరాన్ని ఏటీఎంగా చంద్రబాబు మార్చారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు సాగించిన దోపిడీ అప్పట్లో ఈనాడుకు ఇంపుగా అనిపించినట్లుంది.
ఈ పనులు కంటికి కన్పించడం లేదా?
► పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్‌ఆర్) సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు అభివృద్ధిచేసే పనులను రూ.570.45 కోట్లతో చేపట్టారు. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టుకు 2020లో పీహెచ్‌ఆర్ ద్వారా దాదాపు 8 నెలలపాటు నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది జూలై నుంచి విడుదల చేస్తున్నారు. పంట విరామ సమయంలో ఈ పనులు చేస్తున్నారు.
► ఎస్సార్బీసీ, గాలేరు–నగరి కాలువ సామర్థ్యాన్ని 20 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచడం.. ఈ క్రమంలో అవుకు వద్ద 10వేల క్యూసెక్కులు, గండికోట వద్ద మరో 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో అదనపు టన్నెళ్ల తవ్వకం పనులు చేపట్టారు. ఈ టన్నెళ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పంట విరామ సమయంలో కాలువ పనులు చేస్తున్నారు.
► రూ.3,825 కోట్ల వ్యయంతో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పనులను డీపీఆర్ తయారీకి అవసరమైన మేర పూర్తిచేశారు. ఈ ఎత్తిపోతలపై తెలంగాణ సర్కార్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. పర్యావరణ అనుమతి తీసుకుని.. ఆ ఎత్తిపోతలను పూర్తిచేసే దిశగా సర్కార్ చర్యలు చేపట్టింది.
► కమీషన్ల కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలిదశ పనులకు 2019 ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచిన చంద్రబాబు సర్కార్ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. తొలిదశతోపాటూ రెండో దశ పనులను వైఎస్సార్‌సీపీ సర్కార్ చేపట్టింది. ఈ రెండు దశల పనులు సర్వే పూర్తి కాగా.. పనులు జరుగుతున్నాయి.
► దుర్భిక్ష పల్నాడుకు గోదావరి జలాలను తరలించేందుకు రూ.6,020 కోట్లతో చేపట్టిన వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం పనులు చకచకా సాగుతున్నాయి.
► తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన చిత్తూరు జిల్లా పశ్చిమ మండలాల్లో సాగు, తాగునీటి కష్టాలను కడతేర్చేందుకు రూ.2,145 కోట్లతో ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల పనులను సర్కార్ చేపడితే.. దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ నేతలతో ఎన్జీటీలో కేసులు వేయించి, మోకాలడ్డుతున్నారు. ఇవేవీ ఈనాడు కంటికి కన్పించలేదేమో!?
Comments
Please login to add a commentAdd a comment