
సాక్షి, అమరావతి: కృష్ణానదీ జలాల బోర్డు వర్కింగ్ మాన్యువల్, రెండోదశ టెలీమీటర్ల ఏర్పాటు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. గోదావరి బోర్డు తరహాలో కృష్ణా బోర్డు వర్కింగ్ మాన్యువల్‌ను ఆమోదించలేమని తెలంగాణ సర్కార్ పేర్కొంది. కృష్ణా బోర్డు చైర్మన్‌కు ఓటు హక్కు ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించగా తెలంగాణ సర్కార్ అందుకు అభ్యంతరం తెలిపింది. ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను తెలంగాణ తోసిపుచ్చింది. రెండోదశలో టెలీమీటర్ల ఏర్పాటు ప్రాంతాలపైనా ఏకాభిప్రాయం కుదరలేదు.
కృష్ణా నదీజలాల బోర్డు ఇన్‌ఛార్జ్ చైర్మన్ హెచ్‌కే సాహూ నేతృత్వంలో బోర్డు బుధవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. బోర్డు అధికారులతోపాటు సభ్య కార్యదర్శి పరమేశం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీఈ నారాయణరెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా నాగేంద్రరావు దీనికి హాజరయ్యారు. గోదావరి బోర్డు తరహాలోనే కృష్ణా బోర్డు వర్కింగ్ మ్యాన్యువల్ రూపకల్పనపై చర్చ జరిగింది. గోదావరి బోర్డు వర్కింగ్ మ్యాన్యువల్ ప్రకారం చైర్మన్‌కు ‘విచక్షణ’ అధికారాలుంటాయి. ఓటు హక్కు కూడా ఉంటుంది. బోర్డు సమావేశంలో ఏదైనా ఒక అంశంపై ఓటింగ్ నిర్వహిస్తే రెండు రాష్ట్రాలకూ సమానంగా ఓట్లు వస్తే చైర్మన్ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అయితే కృష్ణా బోర్డు చైర్మన్‌కు ఓటు హక్కు కల్పించే ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించింది. ఈ మేరకు వర్కింగ్ మ్యాన్యువల్‌లో మార్పులు చేయాలని పేర్కొంది.
ట్రిబ్యునల్ తీర్పు వచ్చాకేనన్న తెలంగాణ
ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డు పరిధిలోకి తెచ్చి నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో తెలంగాణ సర్కార్ విభేదించింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడి అమల్లోకి వచ్చేవరకూ బోర్డు పరిధిని నిర్ణయించరాదంది. దీంతో వర్కింగ్ మాన్యువల్ కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది.
టెలీమీటర్లపై మరోసారి చర్చకు నిర్ణయం
రెండు రాష్ట్రాల అభిప్రాయాల మేరకు వర్కింగ్ మాన్యువల్‌లో మార్పుచేర్పులు చేస్తామని బోర్డు ఇన్‌చార్జ్ చైర్మన్ హెచ్‌కే సాహూ తెలిపారు. రెండోదశలో 29 ప్రదేశాల్లో టెలీమీటర్లు ఏర్పాటు చేయాలని బోర్డు ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్‌లోని 21 ప్రదేశాల్లో, తెలంగాణలోని 8 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించింది. శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద టెలీమీటర్లు ఏర్పాటు చేస్తే సరిపోతుందని తెలిపింది. కండలేరు, సోమశిల తదితర ప్రాజెక్టుల వద్ద వీటి ఏర్పాటు అవసరం లేదంది. పులిచింతల, ప్రకాశం బ్యారేజీ వద్ద సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) ఏర్పాటు చేసిన టెలీమీటర్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.
కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన అన్ని ఎత్తిపోతల పథకాలపై టెలీమీటర్లు అమర్చాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ సర్కార్ తోసిపుచ్చింది. చిన్న నీటివనరుల విభాగంతోపాటు మధ్య తరహా ప్రాజెక్టుల కింద వినియోగిస్తున్న కృష్ణా జలాల లెక్కలను తెలంగాణ సర్కార్ వెల్లడిస్తే ఎత్తిపోతల పథకాల లెక్కలు చెప్పడానికి తాము సిద్ధమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెండో దశ టెలీమీటర్ల ఏర్పాటుపై మరోసారి చర్చించాలని బోర్డు నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment