సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సవరణ డీపీఆర్‌పై పరిశీలన జరిపి, అనుమతుల కోసం కేంద్ర జలసంఘాని(సీడబ్ల్యూసీ)కి సిఫారసు చేసేందుకు గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) నిరాకరించింది. ఈ ప్రాజెక్టుపై కోర్టుల్లో కేసులుండటం వల్ల తాము డీపీఆర్‌ను పరిశీలించలేమని రాష్ట్ర నీటిపారుదల శాఖకు తేల్చిచెప్పింది. తొలుత రోజుకు 2 టీఎంసీల గోదావరి జలాలను తరలించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.
2 టీఎంసీల పనులకు సంబంధించిన డీపీఆర్‌కు ఇప్పటికే కేంద్రం నుంచి అన్ని అనుమతులు లభించాయి. తర్వాత కా లంలో రోజుకు అదనపు టీఎంసీ తరలించే పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అదనపు టీఎంసీ పనుల ప్రాజెక్టుకూ అనుమతులు తీసుకోవాలని గతేడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో కేంద్రం ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేనందున అదనపు టీఎంసీ పనులపై హైకోర్టు సైతం స్టే విధించింది.
2 టీఎంసీల పనులతో పాటు అదనపు టీఎంసీ పనులు సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినవేనని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కేంద్రం సూచనతో 2టీఎంసీల పనుల డీపీఆర్‌లో అదనపు టీఎంసీ పనులను సైతం చేర్చి సవరించిన డీపీఆర్‌కు అనుమతుల కోసం ఇటీవల గోదావరి బోర్డు కు సమర్పించింది. కోర్టు కేసులను కార ణంగా చూపి డీపీఆర్‌ను పరిశీలించడా నికి బోర్డు నిరాకరించగా, పనుల నిలుపుదలకే హైకోర్టు ఆదేశించిందని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు తెలియజేసింది. డీపీఆర్‌ను పరిశీలించి నిబంధనల ప్రకారం సీడబ్ల్యూసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి పంపించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment