సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అదనపు టీఎంసీ ఎత్తిపోసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కాళేశ్వరం అదనపు టీఎంసీ డీపీఆర్‌కు అనుమతుల జారీ ప్రక్రియ విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. సాంకేతిక అనుమతుల ప్రక్రియ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ)కు ఇటీవల లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాల్లో స్టేటస్ కో కొనసాగించాలని కేంద్ర న్యాయ శాఖ సూచించినట్లు గోదావరి బోర్డుకు జలశక్తి శాఖ తెలియజేసింది. దీంతో కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనను ప్రస్తుతానికి గోదావరి బోర్డు పక్కనబెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అదనపు టీఎంసీ ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా అనుమతుల ప్రక్రియకు సైతం బ్రేక్ పడినట్టు అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే రూ. 85 వేల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. అదనపు టీఎంసీ సహా ఇతర పనుల పూర్తికి మరో రూ. 30 వేల కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది.
డీపీఆర్ పరిశీలనకు గోదావరి బోర్డు నో
గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల జలాలను తరలించే లక్ష్యంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అన్ని రకాల అనుమతులతో చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ తర్వాత అదనపు టీఎంసీ తరలింపు పనులను మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండానే మొదలుపెట్టింది. అయితే ఈ పనులను అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చిన కేంద్ర జలశక్తి శాఖ... 6 నెలల్లోగా అనుమతి పొందాలని 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఆదేశించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... అదనపు టీఎంసీ తరలింపు కోసం చేపడుతున్న పనులు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమేనని... అందువల్ల అనుమతిలేని ప్రాజెక్టుల జాబితా నుంచి దీన్ని తొలగించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో సవరించిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించి అనుమతులు పొందాలని కేంద్రం సూచించింది. కేంద్ర జలసంఘానికి ఇప్పటికే సవరించిన డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించగా హైడ్రాలజీ, కాస్ట్ అప్రైజల్ అనుమతులు లభించాయి. అనంతరం సవరించిన డీపీఆర్‌ను గోదావరి బోర్డుకు సాంకేతిక అనుమతుల కోసం పంపింది. బోర్డు ఈ డీపీఆర్‌ను పరిశీలించి సంతృప్తి చెందితే కేంద్ర జలశక్తి శాఖలోని సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) ఆమోదం కోసం సిఫారసు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియను తాజాగా గోదావరి బోర్డు పక్కన బెట్టింది.
మరికొంత కాలం తప్పని జాప్యం...
పరిహారం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొందరు ప్రాజెక్టు భూనిర్వాసితులు... రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే అదనపు టీఎంసీ పనులు చేపడుతోందని నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. కాళేశ్వరం అదనపు టీఎంసీ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అంశాలపై స్టేటస్ కో కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ తుది తీర్పునకు లోబడి చర్యలు ఉండాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను ఉపసంహరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
ఇదీ చదవండి: మునుగోడులో పోస్టర్ వార్
Comments
Please login to add a commentAdd a comment