గోదావరి నదీ జలాలను వినియోగించుకుంటున్న తెలంగాణ ప్రాజెక్టులపై పెత్తనానికి గోదావరి బోర్డు తెరలేపింది. ఆంధ్రప్రదేశ్ ఒత్తిళ్లకు తలొగ్గి శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం ముసారుుదా (డ్రాఫ్ట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఏపీ నుంచి కేవలం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీయే తమ యాజమాయిషీ పరిధిలోకి వస్తుందన్న బోర్డు... తెలంగాణ సూచించిన పట్టిసీమ, తాడిపూడి, పుష్కర, వెంకటాపురం ప్రాజెక్టుల అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు.