Cotton byareji
-
ఆరు రాష్ట్ర ప్రాజెక్టులపై గోదావరి బోర్డు పెత్తనం!
-
ఆరు రాష్ట్ర ప్రాజెక్టులపై గోదావరి బోర్డు పెత్తనం!
ఏపీ ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయం ► ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్, ఎల్లంపల్లి, కడెం, లోయర్ మానేరుపై అజమాయిషీ ► తమ పరిధిలోకి తీసుకుంటామంటూ ముసాయిదా నోటిఫికేషన్ ► ఏపీ నుంచి కాటన్ బ్యారేజీనే పేర్కొన్న బోర్డు ► ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టులకున్న కేటాయింపులే వాడాలని సూచన ► అభ్యంతరాలకు 29 వరకు గడువు సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను వినియోగించుకుంటున్న తెలంగాణ ప్రాజెక్టులపై పెత్తనానికి గోదావరి బోర్డు తెరలేపింది. ఆంధ్రప్రదేశ్ ఒత్తిళ్లకు తలొగ్గి శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం ముసారుుదా (డ్రాఫ్ట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఏపీ నుంచి కేవలం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీయే తమ యాజమాయిషీ పరిధిలోకి వస్తుందన్న బోర్డు... తెలంగాణ సూచించిన పట్టిసీమ, తాడిపూడి, పుష్కర, వెంకటాపురం ప్రాజెక్టుల అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు. ప్రాజెక్టుల పరిధిపై ఇప్పటికే కృష్ణా బోర్డుతో నెలకొన్న వివాదం ఏకంగా అపెక్స్ కౌన్సిల్ పంచాయితీ వరకూ వెళ్లగా ప్రస్తుతం గోదావరి ప్రాజెక్టుల నియంత్రణ అంశం ఎటువైపు మళ్లుతుందనేది ఆసక్తిగా మారింది. గోదావరి బోర్డు పరిధిలోకి తేవాల్సిన ప్రాజెక్టులు, పరిధి అంశాలపై మూడు రోజుల కిందట బోర్డు చర్చించింది. ఈ సందర్భంగా బోర్డు పరిధి, నిర్వహణపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపిన బోర్డు అందుకు తగ్గట్లే శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 29 లోగా దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని అందులో స్పష్టం చేసింది. నియంత్రణ అంతా బోర్డు చేతుల్లోకి.. బోర్డు విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం ఫేజ్-1లో భాగంగా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి తెలంగాణలో ఇప్పటికే ఉన్న ఆరు ప్రాజెక్టులు, ఏపీలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ బోర్డు పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాజెక్టుల బ్యారేజీ హెడ్‌వర్క్స్, డ్యామ్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు, రెగ్యులేటర్లతోపాటు విద్యుత్ పాంట్ల హెడ్ వర్క్‌లు, రిజర్వాయర్ల పరిధిలోని ఎత్తిపోతల పథకాలు, నీటిని విడుదల చేసే ఇతర నిర్మాణాలన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయి. గతంలో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాల మరకు లేదా ట్రిట్యునల్ ఇచ్చిన అవార్డుల మేరకు ప్రాజెక్టులవారీగా చేసిన కేటారుుంపుల మేరకే మేజర్, మీడియం ప్రాజెక్టుల్లో నీటి వినియోగం చేయాలి. ఇందుకు రాష్ట్ర విభజన సమయానికి ఉన్న నీటి కేటారుుంపులనే పరిగణనలోకి తీసుకుంటారు. మైనర్ ఇరిగేషన్‌కు సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. బోర్డు పరిధిలోకి రాకున్నా, రెండు రాష్ట్రాలతో సంబంధం ఉండే ఇతర ప్రాజెక్టులను సైతం బోర్డు స్వయంగా పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరా, విద్యుదుత్పత్తిని నియంత్రించడంతోపాటు డ్యామ్, రిజర్వాయర్, రెగ్యులేటర్, కాల్వల నిర్వహణను చూస్తుంది. రిజర్వాయర్ల పరిధిలో చేపల పెంపకం అనుమతి లీజుల అంశాలన్ని పర్యవేక్షిస్తుంది. బోర్డు పేర్కొన్న లోయర్ మానేరు, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులు ఇంకా నిర్మాణ దశలో ఉన్నందున వాటికి సంబంధించిన పురోగతి నివేదికలు, డ్రాయింగ్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. కొన్ని పనులు విడిగా..మరికొన్ని ఉమ్మడిగా.. రాష్ట్రాలు, బోర్డు విడివిడిగా, సంయుక్తంగా చేయాల్సిన పనుల అంశాన్ని సైతం గోదావరి బోర్డు నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొంది. ప్రాజెక్టుల చారిత్రక వివరాలు, ప్రస్తుత డేటా, నిర్వహణ విధానం, ప్రభుత్వ నిర్ణయాలను ఆయా రాష్ట్రాలు బోర్డుకు ముందుగానే చెప్పాలి. ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చు, భద్రాతాపరమైన అంశాలు, అవసరమైన మరమ్మతులను పేర్కొనాలి. బోర్డుకు అవసరమైన అధికారులు, బడ్జెట్‌ను రాష్ట్రాలు చూసుకోవాలి. వరద పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, డ్యామ్‌ల భద్రత వంటి అంశాలను బోర్డు, రాష్ట్రాలు సంయుక్తంగా చూసుకోవాలి. వీటన్నింటికీ ముందు ఇరు రాష్ట్రాలు అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు, డ్యామ్ సేఫ్టీకి తీసుకున్న చర్యలు, గతంలో విపత్తు నిర్వహణ, కావాల్సిన నిధులకు సంబంధించిన అన్ని నివేదికలు సమర్పించాలి. -
గోదావరిలోకి దూసుకెళ్లిన మృత్యు ‘తూఫాన్’
-
భగవంతుడా...
గోదావరిలోకి దూసుకెళ్లిన మృత్యు ‘తూఫాన్’ ఏపీలోని ధవళేశ్వరం వద్ద పెను విషాదం.. ఒకే ఇంట్లో 14 మంది మృతి మరో రెండు కుటుంబాల్లో 8 మందిని కాటేసిన మృత్యువు పుణ్యక్షేత్రాలను సందర్శించి వస్తుండగా ఘటన మాటలకందని మహా విషాదం అంటే ఇదేనేమో.. తిరుమలలో వెంకన్నకు, శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరునికి, శ్రీశైలంలో మల్లన్నకు, బెజవాడలో దుర్గమ్మకు మొక్కిన చేతులు.. తెల్లవారితే సింహాచలంలో అప్పన్న సన్నిధిలో జోడించాలనుకున్న చేతులు.. నిశ్చేతనమయ్యాయి. శుక్రవారం రాత్రి గోదారమ్మ తీరం వెంట పిల్లా పాపల కేరింతలతో సాగిపోతున్న వారి ప్రయాణం మధ్యలోనే ముగిసింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీపై ఎడమ వైపు వెళ్తున్న తూఫాన్ వాహనం డ్రైవర్ ఒక్క క్షణం రెప్ప వాల్చటంతో కుడివైపు తిరిగింది. నిశిరాత్రివేళ బ్యారేజీ గోడను ఢీకొట్టి 30 అడుగుల లోతులో పడటంతో పెను ప్రమాదం జరిగింది. 22 మంది మృత్యువాత పడ్డారు. ఇద్దరు బిడ్డల నిండు జీవితాలను కాపాడుకునేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన ఓ తండ్రి.. కుమారుడిని మాత్రం రక్షించుకుని కన్నుమూశాడు. ఆ బాలుడు ఈ ఘోరకలికి ప్రత్యక్షసాక్షిగా, మృత్యుంజయుడిగా మిగిలాడు.సాక్షి, విశాఖపట్నం, రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పెను ప్రమాదంలో 22 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఏడుగురు చిన్నారు లున్నారు. వీరంతా విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మోసయ్యపేటకు చెందిన వారి సమీప బంధువులు. ఇష్టదైవాల్ని దర్శించుకుని, తిరుగుముఖం పట్టిన వీరు గమ్యం చేరకుండానే మృత్యు వాతపడ్డారు. ఈ బృందంలోని ఒకే ఒక్క బాలుడు జరిగిన ఘోరకలికి ప్రత్యక్షసాక్షిగా, మృత్యుంజయుడయ్యూడు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ప్రధాన గేట్లు దాటిన వెంటనే వచ్చే మలుపులో వారు ప్రయాణిస్తున్న వాహనం నేరుగా స్కవర్ స్లూయిజ్లోకి బోల్తా కొట్టింది. ఆ వాహనం 30 అడుగుల ఎత్తు నుంచి కింద ఉన్న సిమెంట్ గచ్చుపై పడిపోయింది. ప్రయాణికులు గచ్చుపై పడడంతో బలమైన తీవ్ర గాయాలై మృతిచెందారని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన వాహనం శుక్రవారం అర్ధరాత్రి 12.51 సమయంలో ఏలూరు సమీపాన కలపర్రు టోల్గేట్ దాటినట్టు నమోదయింది. కలపర్రు నుంచి ధవళేశ్వరం సుమారు 95 కిలోమీటర్లు. దీన్ని బట్టి అర్ధరాత్రి రెండున్నర, మూడు గంటల మధ్యలో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాద సంఘటన తెల్లవారుజాము 5.30 వరకూ ఎవరికీ తెలియలేదు. మృత్యువు నుంచి బయటపడిన కిరణ్‌సాయి బ్యారేజీ దిగువ రోడ్డుకు వచ్చి ‘మా అక్కకు నీళ్లు కావాలంటూ..’ అరవడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులకు తెలిసింది. వారు దగ్గరలో ఉన్న లాకు కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. కార్యాలయ సిబ్బంది ధవళేశ్వరం పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన తూఫాన్ వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతుడు గోపి స్నేహితుడు జె.హేమంత్ మొదట చనిపోయినవారిని గుర్తిం చాడు. ఘటనాస్థలిలో 21 మంది మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన కిరణ్, బాలిక సంధ్యలను చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సంధ్య మృతిచెందింది. కిరణ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఎప్పుడూ తీర్థయాత్రలకు జనాన్ని తీసుకెళ్లే ఈగల అప్పారావు ఈ ఏడాది తన కుటుంబ సభ్యులను, బంధువులను 22 మందిని తీసుకెళ్లాడు. స్వతహాగా డ్రైవరు అయిన అప్పారావు సొంత తుఫాన్ వ్యాన్ (ఏపీ 31 టీసీ-3178)లో 6వ తేదీన తిరుపతి తదితర పుణ్యక్షేత్రాలకు వీరిని వెంటబెట్టుకువెళ్లాడు. 9వ తేదీన తిరుపతి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. 12వ తేదీన (శుక్రవారం) విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. అదే రోజు రాత్రి అక్కడి నుంచి బయలుదేరారు. శనివారం ఉదయం సింహాచలం అప్పన్నను దర్శించుకుని స్వగ్రామం మోసయ్యపేటకు వెళ్లాలనుకున్నారు. ఈలోపే ప్రమాదం బారిన పడ్డారు. తెల్లారేసరికి పిడుగులాంటి వార్త.. తమ వారంతా యాత్రలు ముగించుకుని వచ్చేస్తున్నారని ఇంటి వద్ద మిగిలిన వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. తెల్లవారే సరికి పిడుగులాంటి వార్త టీవీల్లో వచ్చింది. గోదావరిలో తూఫాన్ వ్యాన్ బోల్తాకొట్టిందని అందులో ఉన్న 22 మంది మృత్యువాతపడ్డారని.. విశాఖ జిల్లా అచ్యుతాపురం మోసయ్యపేట వాసులని. అంతే.. మన డ్రైవర్ ఆప్పారావు వ్యానే అని నిర్ధారణకొచ్చారు. తెల్లారగానే ఊరు ఊరంతా విషాదంలో మునిగిపోయింది. పరుగుపరుగున అప్పారావు, వారి బంధువుల ఇంటికి తండోపతండోలుగా వెళ్లారు. అప్పారావు కుటుంబంతా మృత్యువాతపడగా.. ఇప్పుడా కుటుంబంలో అప్పారావు తండ్రి 85 ఏళ్ల వెంకులు ఒక్కడే బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. అయిన వారందరినీ పోగొట్టుకుని విగతజీవిలా ఉన్నాడు. యాత్ర ముగించుకుని వీరు శనివారం సింహాచలం నృసింహస్వామిని దర్శించుకుని స్వగ్రామం మోసయ్యపేటకు చేరుకోవలసి ఉంది. వారి ఆచారం ప్రకారం గ్రామం నుంచి శుక్రవారం రాత్రే 20 మందితో కలిసి తోడపెద్దు (ఆంబోతు)ను సింహాచలం పంపించారు. వీరంతా సింహాచలంలో అప్పారావు కుటుంబం కోసం వేచి చూస్తున్న తరుణంలోనే ఘోరం జరిగిపోయింది. మోసయ్యపేటతో పాటు సమీపంలోని అచ్యుతాపురం, పరిసర గ్రామాలు శనివారం శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు మృతుల ఇళ్ల వద్దకు చేరుకుని కన్నీరు పెట్టుకున్నారు. డ్రైవర్ అప్పారావుగా పేరు గడించిన అప్పారావుకు ఈ ప్రాంతంలో మంచిపేరుంది. పాతికేళ్లుగా స్థానికుల్ని తీర్థయాత్రలకు తీసుకెళ్తుండడంతో అందరితో పరిచయాలున్నాయి. దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన ఆ కుటుంబీకులను ఓదార్చడానికి భారీ సంఖ్యలో ఇరుగుపొరుగు గ్రామాల వారు వచ్చారు. కాగా ఏపీ హోం మంత్రి చినరాజప్ప మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మృతుల వివరాలు ఈగల అప్పారావు(55), అతని భార్య కనక(40), పెద్ద కుమారుడు రాజు(27) కోడలు లక్ష్మి (23), రెండో కుమారుడు ప్రసాద్ (25), కోడలు అన్నపూర్ణ(21), మూడో కుమారుడు గోపి(24), అప్పారావు కుమార్తె కోనా వెంకటలక్ష్మి(27), అల్లుడు రమణ(30), అప్పారావు మనుమలు కోన సాయి(8), ఈగల హర్ష(2), ఈగల నవ్య(4), ఈగలఅమిత్(5), ఈగల కార్తీక్ (7) మృతి చెందారు. అప్పారావుకు వరసకు సోదరుడైన ఈగల రాంబాబు(32), అతని భార్య కొండమ్మ(30), తల్లి చిన్నమ్మ(60), రాంబాబు కుమార్తె సంధ్య(14), అప్పారావు సోదరి దార్ల చిట్టమ్మ(68), గాజువాక మండలం కుర్మన్నపాలెంకు చెందిన అప్పారావు మరదలు పుర్రే సునీత(29), మరో మరదలు రంబిల్లి మండలం కొత్తకోడూరుకు చెందిన అల్లు లక్ష్మి(35), సునీత కుమారుడు పుర్రే పవన్(8) మృతి చెందగా, రాంబాబు కుమారుడు కిరణ్‌సాయిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. మూడు గంటల తర్వాత వెలుగులోకి.. ధవళేశ్వరం నుంచి సాక్షి ప్రతినిధి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి తూఫాన్ వ్యాను బోల్తా పడి ప్రమాదం జరిగిన మూడు గంటల తరువాత కాని ఈ సంఘటన వెలుగు చూడలేదు. కాటన్ హయాంలో నిర్మించిన పాత ఆనకట్ట, తరువాత నిర్మించిన బ్యారేజీ స్కవర్ల ఆపరేషన్ నిర్వహించే స్లూయిజ్ వద్ద వ్యాను బోల్తా కొట్టింది. అక్కడ 30 అడుగుల లోతున సిమెంట్ తొట్టెలా ఉంటుంది. ప్రమాదం జరిగిన చోట బ్యారేజీపై లైటింగ్ లేకపోవడం వల్ల ప్రమాదాన్ని గుర్తించ లేకపోయారు. ప్రమాదానికి గురైన వాహనం శుక్రవారం అర్ధరాత్రి 12.51 గంటల సమయంలో ఏలూరు సమీపాన కలపర్రు టోల్ గేట్ దాటినట్టు నమోదయింది. కలపర్రు నుంచి ధవళేశ్వరం సుమారు 95 కిలోమీటర్లు. దీన్నిబట్టి అర్ధరాత్రి సుమారు రెండున్నర, మూడు గంటల మధ్యలో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాద సంఘటన తెల్లవారుజాము 5.30 గంటల వరకూ ఎవరికీ ఈ విషయం తెలియలేదు. ముందే తెలిస్తే కొందరి ఊపిరైనా నిలిచేది: ప్రమాదం జరిగిన వెంటనే ఎవరికైనా తెలిసి ఉంటే కొంతమందైనా ప్రాణాలతో బయటపడేవారు. వాస్తవానికి కాటన్ బ్యారేజీపై సిబ్బంది రాత్రి గస్తీ నిర్వహిస్తారు. తెల్లవారుజాము వరకూ విషయం ఇరిగేషన్ సిబ్బందికి కూడా తెలియలేదు. ఘటనా స్థలానికి కూతవేటు దూరంలోనే లాకు కార్యాలయం ఉన్నప్పటికీ అక్కడ ఉన్న సిబ్బందికి మత్స్యకారులు చెప్పేవరకూ ప్రమాద విషయం తెలియక పోవడం గమనార్హం. -
ఈ పున్నమి ‘గౌతమి’కి మరింత విలక్షణం
సాక్షి, రాజమండ్రి :మహారాష్ట్రలోని నాసిక్ నుంచి సుమారు 1465 కిలోమీటర్లు అవిశ్రాంతంగా ప్రయాణించి, కాటన్ బ్యారేజీ ముందు కొంత తడవు మజిలీ చేసి, ఆ వ్యవధిలోనే ఉభయగోదావరి జిల్లాలకు పెన్నిధులను ప్రసాదించే గోదావరికి ఏమిస్తే రుణం తీరుతుంది? ఆ తల్లి ఏమీ ఆశించకపోయినా.. బిడ్డలపై ఆ బాధ్యత ఉంది. అదిగో.. ఆ తలంపుతోనే బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ప్రతి పున్నమికీ గోదారమ్మకు హారతినిచ్చేందుకు సమకట్టింది. గురువారం నాటి కార్తిక పున్నమి రాత్రి అఖండ గౌతమికి ఇచ్చే హారతి ఈ రివాజులో 50వది. పున్నమి హారతికి శ్రీకారం చుట్టిన నాటి నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న ట్రస్ట్ 50వ హారతిని ఘనంగా నిర్వహించనుంది. ఈ పున్నమి హారతికి ఓ ప్రత్యేకత ఉంది. ఆధ్యాత్మిక చింతనతోపాటు గోదావరిని పరిరక్షించుకోవాలనే పిలుపునకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. ‘స్వచ్ఛ గోదావరి’ పేరుతో నదీ కాలుష్య నివారణకు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో నది వెంబడి ఉన్న పర్యాటక ప్రాంతాల్లో కాలుష్య నివారణను ఓ ఉద్యమంగా చేపట్టేందుకు నేడు చర్చావేదికను నిర్వహిస్తున్నారు. తొలి అడుగుగా పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని పాటించ్చ్ఛే ప్రజలను చైతన్యపరచనున్నారు. 50వ పున్నమి హారతి సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభా పాటవాలు కనపరిచిన గోదావరి పరీవాహక ప్రాంతపు ప్రముఖులకు విశేష పురస్కారాలను అందచేస్తున్నారు. ప్రముఖ కథా రచయిత, విమర్శకులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి రావులపాటి సీతారామారావుకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గోదావరి పురస్కారాన్ని, ప్రముఖ పాత్రికేయుడు, మానవహక్కుల పరిరక్షణకు కృషి చేసిన మల్లేపల్లి లక్ష్మయ్యకు ఎ.రవిశంకర్ ప్రసాద్ గోదావరి పురస్కారాన్ని, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బి.వి.ఎస్.రామారావుకు సర్ ఆర్థర్ కాటన్ గోదావరి పురస్కారాన్ని, ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత దాసరి నారాయణరావుకు ఎస్.వి.రంగారావు గోదావరి పురస్కారాన్ని, ప్రముఖ సంఘసేవకురాలు సునీతాకృష్ణన్‌కు జీఎంసీ బాలయోగి గోదావరి పురస్కారాన్ని అందచేయనున్నారు. హాజరు కానున్న ప్రముఖులు సీనియర్ సంపాదకులు, ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కె.శ్రీరామచంద్రమూర్తి చైర్మన్‌గా, ప్రముఖ సాహిత్య వేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమెస్కో పబ్లికేషన్స్ అధినేత డాక్టర్ డి.విజయకుమార్, సుప్రసిద్ధ రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు, సీనియర్ పాత్రికేయులు జి.వల్లీశ్వర్, మాజీ డీజీపీ కె.అరవిందరావులతో పాటు ట్రస్టు నుంచి ఒక ప్రతినిధితో కూడిన కమిటీ పురస్కారాలకు ప్రముఖులను ఎంపిక చేసిందనిట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు బి.ఎస్.ఎన్.కుమార్ తెలిపారు. పుష్కరాలరేవులో జరిగే ఈ కార్యక్రమాలకు కె.శ్రీరామచంద్రమూర్తి, డాక్టర్ డి.విజయకుమార్, శ్రీలంక పర్యావరణ పరిరక్షణ నిపుణుడు దయాదీన్ నాయకే, గంగా పరిరక్షణకు కృషి చేస్తున్న స్వామి విజ్ఞానానందజీ, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తదితరులు హాజరవుతున్నట్టు తెలిపారు. ఇదీ 50వ పున్నమి హారతి వేడుకల క్రమం.. ఉదయం : 9.00 గంటలకు : గోదావరి పరిరక్షణకు సామూహిక ప్రతిజ్ఞ 10.00 గంటలకు : గోదావరి అందాల ప్రాధాన్యత, చారిత్రక ప్రాశస్త్యం వివరించే ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం 10.30 గంటలకు : స్వచ్ఛ గోదావరిపై చర్చా గోష్టి సాయంత్రం : 6.00 గంటలకు : సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం 7.00 గంటలకు : ప్రముఖులకు గోదావరి పురస్కార ప్రదానం 8.00 గంటలకు- గోదావరి మాతకు హారతి కార్యక్రమం -
ఎగువ ఉపశమనం.. దిగువ ఉపద్రవం
80 వేల ఎకరాల్లో పంటల మునక కాటన్ బ్యారేజీ నుంచి 16,57,782 క్యూసెక్కులు సముద్రంలోకి.. అమలాపురం/ఏలూరు/కొవ్వూరు: గోదావరికి ఎగువ ప్రాంతాలైన దుమ్ముగూడెం, భద్రాచలంల వద్ద వరద తగ్గుముఖం పడుతుండగా, ఉభయ గోదావరి జిల్లాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. అనేక లంక, ఏజెన్సీ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నారుు. ఆయూ గ్రామాలకు రాకపోకలు స్తంభించారుు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మంగళవారం వరద ప్రవాహం మరింత పెరిగి నిలకడగా కొనసాగుతోంది. ఉదయం 15.60 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం 1గంటకు 16.10 అడుగులకు పెరిగింది. అక్కడ నుంచి రాత్రి 7 గంటల వరకూ అదేస్థాయిలో నిలకడగా ఉంది. బ్యారేజీ నుంచి 16,57,782 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఖమ్మం జిల్లా నుంచి తూర్పు గోదావరిలో కొత్తగా చేరిన కూనవరం, చింతూ రు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలతో పాటు జిల్లాలోని మరో 15 మండలాల్లోని 75 గ్రామా లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోనసీమ దేవీపట్నం, పి.గన్నవరం మండలాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. సుమారు 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లికి చెందిన చింతా కృష్ణమూర్తి(45) వరద ఉధృతిలో గల్లంతయ్యారు. గోదావరి లంకలో చిక్కుకుపోయిన అయినవిల్లి మండలం వీరవల్లిపాలానికి చెందిన ఏడుగురు సురక్షితంగా ఇళ్లకు చేరారు. లంక గ్రామాల్లో సుమారు 60వేల ఎకరాల్లో కూరగా య, వాణిజ్య పంటలు ముంపుబారిన పడ్డాయి. జిల్లాలో ఇంతవరకూ 591 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. పుదుచ్చేరి పరిధిలోని యానాంలో ఫెర్రీ రోడ్డు నీట మునిగింది. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాలలంక, పెదలంకలకు అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆచంట మండలంలోని అనగారలంక, అయోధ్యలంక, కోడేరులంక, మర్రి మూల, పుచ్చల్లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొవ్వూరు, ఆచంట, నరసాపురం, నిడదవోలు, పోలవరం ప్రాంతాల్లో11.7 వేల హెక్లార్లలో అరటి, 4.8 వేల హెక్టార్లలో కూరగాయ పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. కాళేశ్వరం, పేరూరు, దుమ్ముగూడెం, కూనవరం, కుంట, కొయిదాలలోనూ నీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. కూనవరంలో 20.23 మీటర్లు, కుంటలో 11.36, పోలవరం 14.14, కొవ్వూరు రోడ్ కం రైలు వంతెన వద్ద 17.69, రాజమండ్రి రైల్వే బ్రిడ్జి వద్ద 17.68 మీటర్ల చొప్పున నీటిమట్టాలు నమోదయ్యాయి. బలహీనపడిన అల్పపీడనం విశాఖపట్నం: అల్పపీడనం కాస్త బలహీనపడి ప్రస్తుతం పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌ను ఆనుకుని కొనసాగుతోంది. దీనిపై మధ్య ట్రోపో ఆవరణం వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు మినహా పెద్దగా ప్రభావం ఉండబోదని వాతావరణ నిఫుణులు చెబుతున్నారు. మంగళవారం నెల్లూరులో 37.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. మంగళవారం ఉదయానికి కోస్తాంధ్రలోని పోలవరంలో గరిష్టంగా 4 సెం.మీ. వర్షం కురిసింది. తెలంగాణలోని రామాయంపేటలో 3 సెం.మీల వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బాధితులను అన్ని విధాలా ఆదుకోండి: సీఎం సాక్షి, హైదరాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టి బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వరద నేపథ్యంలో తాజా పరిస్థితిని ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ముంపు గ్రామాల్లో ఉపాధి కోల్పోయిన కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి పది కిలోల బియ్యం, లీటరు కిరోసిన్ చొప్పున అందించాలని ఆదేశించారు. ప్రాణనష్టం నిర్ధారణయ్యాక నష్టపరిహారం కోసం ప్రతిపాదనలు పంపించాలన్నారు. నీటి ప్రవాహం తగ్గాక పంట నష్టం అంచనాలను రూపొందించాలని సూచించారు. సీజన్లో మరికొంత కాలం పాటు వరదలు వచ్చే అవకాశం ఉన్నం దున యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.