ఈ పున్నమి ‘గౌతమి’కి మరింత విలక్షణం | Kartik Poornima | Sakshi
Sakshi News home page

ఈ పున్నమి ‘గౌతమి’కి మరింత విలక్షణం

Published Thu, Nov 6 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

Kartik Poornima

సాక్షి, రాజమండ్రి :మహారాష్ట్రలోని నాసిక్ నుంచి సుమారు 1465 కిలోమీటర్లు అవిశ్రాంతంగా ప్రయాణించి, కాటన్ బ్యారేజీ ముందు కొంత తడవు మజిలీ చేసి, ఆ వ్యవధిలోనే ఉభయగోదావరి జిల్లాలకు పెన్నిధులను ప్రసాదించే గోదావరికి ఏమిస్తే రుణం తీరుతుంది? ఆ తల్లి ఏమీ ఆశించకపోయినా.. బిడ్డలపై ఆ బాధ్యత ఉంది. అదిగో.. ఆ తలంపుతోనే బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ప్రతి పున్నమికీ గోదారమ్మకు హారతినిచ్చేందుకు సమకట్టింది. గురువారం నాటి కార్తిక పున్నమి రాత్రి అఖండ గౌతమికి ఇచ్చే హారతి ఈ రివాజులో 50వది.  పున్నమి హారతికి శ్రీకారం చుట్టిన నాటి నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న ట్రస్ట్ 50వ హారతిని ఘనంగా నిర్వహించనుంది. ఈ పున్నమి హారతికి ఓ ప్రత్యేకత ఉంది. ఆధ్యాత్మిక చింతనతోపాటు గోదావరిని పరిరక్షించుకోవాలనే పిలుపునకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. ‘స్వచ్ఛ గోదావరి’ పేరుతో నదీ కాలుష్య నివారణకు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.
 
 ఉభయగోదావరి జిల్లాల్లో నది వెంబడి ఉన్న పర్యాటక ప్రాంతాల్లో కాలుష్య నివారణను ఓ ఉద్యమంగా చేపట్టేందుకు నేడు చర్చావేదికను నిర్వహిస్తున్నారు. తొలి అడుగుగా పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని పాటించ్చ్ఛే ప్రజలను చైతన్యపరచనున్నారు. 50వ పున్నమి హారతి సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభా పాటవాలు కనపరిచిన గోదావరి పరీవాహక ప్రాంతపు ప్రముఖులకు విశేష పురస్కారాలను అందచేస్తున్నారు. ప్రముఖ కథా రచయిత, విమర్శకులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి రావులపాటి సీతారామారావుకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గోదావరి పురస్కారాన్ని, ప్రముఖ పాత్రికేయుడు, మానవహక్కుల పరిరక్షణకు కృషి చేసిన మల్లేపల్లి లక్ష్మయ్యకు ఎ.రవిశంకర్ ప్రసాద్ గోదావరి పురస్కారాన్ని, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బి.వి.ఎస్.రామారావుకు సర్ ఆర్థర్ కాటన్ గోదావరి పురస్కారాన్ని, ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత దాసరి నారాయణరావుకు ఎస్.వి.రంగారావు గోదావరి పురస్కారాన్ని, ప్రముఖ సంఘసేవకురాలు సునీతాకృష్ణన్‌కు జీఎంసీ బాలయోగి గోదావరి పురస్కారాన్ని అందచేయనున్నారు.
 
 హాజరు కానున్న ప్రముఖులు
 సీనియర్ సంపాదకులు, ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కె.శ్రీరామచంద్రమూర్తి చైర్మన్‌గా, ప్రముఖ సాహిత్య వేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమెస్కో పబ్లికేషన్స్ అధినేత డాక్టర్ డి.విజయకుమార్, సుప్రసిద్ధ రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు, సీనియర్ పాత్రికేయులు జి.వల్లీశ్వర్, మాజీ డీజీపీ కె.అరవిందరావులతో పాటు ట్రస్టు నుంచి ఒక ప్రతినిధితో కూడిన కమిటీ పురస్కారాలకు ప్రముఖులను ఎంపిక చేసిందనిట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు బి.ఎస్.ఎన్.కుమార్ తెలిపారు. పుష్కరాలరేవులో జరిగే ఈ కార్యక్రమాలకు కె.శ్రీరామచంద్రమూర్తి, డాక్టర్ డి.విజయకుమార్, శ్రీలంక పర్యావరణ పరిరక్షణ నిపుణుడు దయాదీన్ నాయకే, గంగా పరిరక్షణకు కృషి చేస్తున్న స్వామి విజ్ఞానానందజీ,  దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తదితరులు హాజరవుతున్నట్టు తెలిపారు.
 
 ఇదీ 50వ పున్నమి హారతి
 వేడుకల క్రమం..
 ఉదయం :
 9.00 గంటలకు : గోదావరి పరిరక్షణకు సామూహిక ప్రతిజ్ఞ
 10.00 గంటలకు : గోదావరి అందాల ప్రాధాన్యత, చారిత్రక ప్రాశస్త్యం
 వివరించే ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం
 10.30 గంటలకు : స్వచ్ఛ గోదావరిపై చర్చా గోష్టి
 సాయంత్రం :
 6.00 గంటలకు : సాంస్కృతిక
 కార్యక్రమాలు ప్రారంభం
 7.00 గంటలకు : ప్రముఖులకు
 గోదావరి పురస్కార ప్రదానం
 8.00 గంటలకు- గోదావరి
 మాతకు హారతి కార్యక్రమం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement