సాక్షి, అమలాపురం/అయినవిల్లి: కేరళతో చాలా విషయాల్లో కోనసీమకు దగ్గర పోలికలుంటాయి. ప్రకృతి అందాలు.. కొబ్బరి చెట్లు.. పచ్చని చేలు.. విస్తారమైన సముద్ర తీరంతో రెండు ప్రాంతాలూ దాదాపు ఒకేలా అగుపిస్తాయి. కోనసీమను మినీ కేరళగా కూడా అభివర్ణిస్తారు. ఆ ప్రభావమో ఏమో కానీ అరుదైన వాయిద్య కళ కేరళ చెండా మేళానికి ఈ సీమలో ఘనమైన గుర్తింపు లభిస్తోంది. దేవాలయాల వద్ద జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల సమయంలో నిర్వహించే ఊరేగింపుల్లో కేరళ చెండా మేళం అగ్రస్థానంలో నిలుస్తోంది.
ఈ కళలో కేరళలో శిక్షణ పొందిన స్థానిక కళాకారులు తమ ప్రతిభా పాటవాలతో ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రదర్శనలు ఇస్తూ శభాష్ అని కితాబులందుకుంటున్నారు. కేరళ అనగానే కథాకళి, కొడియాట్టం, తెయ్యం వంటి కళారూపాలు గుర్తుకు వస్తాయి. అటువంటి వాటిలో చెండా మేళం ఒకటి. దీని ప్రదర్శనలో స్థూపాకార పెర్కషన్ వాయిద్యాన్ని వాయిస్తారు. దాని నుంచి వచ్చే లయబద్ధమైన శబ్దానికి అనుగుణంగా నృత్యం చేస్తూ వీరు చేసే ప్రదర్శన ఆకట్టుకుంటోంది.
బృందంలోని మహిళా కళాకారులు పెద్దపెద్ద చిడతలతో తాళం వేస్తారు. కేరళలో 300 సంవత్సరాలకు పైగా అత్యంత ప్రజాదరణ పొందిన కళారూపం చెండా మేళం. ఇందులో 30 నుంచి 100 మంది వరకూ సభ్యులుంటారు. కేరళలోని అన్ని పండగల్లో చెండా మేళం తప్పనిసరి. కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడుల్లో దీనికి విశేష ఆదరణ ఉంది. సామాజిక మాధ్యమాలు విస్తృతమైన తరువాత దీనికి దేశవ్యాప్తంగా ఆదరణ వచ్చింది.
కేరళ కళాకారులకు దీటుగా..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా గడచిన ఒకటిన్నర దశాబ్దాలుగా ఈ కళా ప్రదర్శన జరుగుతోంది. తొలి రోజుల్లో కేరళ నుంచి వచ్చిన కళాకారులు దీనిని ప్రదర్శించేవారు. అయితే ఇది వ్యయప్రయాసలతో కూడుకొని ఉండేది. దీంతో అయినవిల్లి మండలం ముక్తేశ్వరానికి చెందిన నాయీ బ్రాహ్మణులు ఈ కళలో శిక్షణ పొంది, 30 మందితో బృందాన్ని తయారు చేశారు. స్థానికంగా ఉన్న ఎల్.గురునాథం తొలుత మంగళ వాయిద్యాలు వాయించేవారు. తరువాత తీన్‌మార్‌లోకి మారారు.
వీటికన్నా కేరళ చెండాకు ఆదరణ ఉందని తెలుసుకుని ఈ బృందాన్ని తయారు చేశారు. తరువాత ముక్తేశ్వరంతోపాటు ఇదే మండలంలో అయినవిల్లి, విలస గ్రామాల్లో కూడా కేరళ చెండా బృందాలు తయారయ్యాయి. గురునాథం కేరళలోని త్రిశూర్‌లో ప్రముఖ గురువు రాజేష్ మాలా వద్ద శిక్షణ పొందారు. అనంతరం ఇక్కడకు వచ్చి, స్థానికులకు శిక్షణ ఇచ్చారు. అయితే మెరుగైన మేళంగా శిక్షణ ఇచ్చేందుకు ఏటా కొంతమందిని త్రిశూర్ పంపుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ
కేరళ చెండా కళను ప్రదర్శించే కోనసీమ బృందాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఉంది. ఈ బృందాలు కేరళ సంప్రదాయ వ్రస్తాలు ధరించి మరీ ప్రదర్శన ఇవ్వడం విశేషం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రాంతాల్లో వీరు ప్రదర్శనలు ఇచ్చారు. సింహాచలం, అన్నవరం, అంతర్వేదితో పాటు హైదరాబాద్ మియాపూర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి తదితర ఆలయాల వద్ద వీరు ప్రదర్శన ఇచ్చారు.
వీటితో పాటు పలు జిల్లాల్లో ఆలయాల ప్రారంభోత్సవం, రథోత్సవాలు, అమ్మవార్ల ఊరేగింపులు, తీర్థాలు, జాతర్లలో చెండా ప్రదర్శన తప్పనిసరిగా మారింది. ఇక ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థల ప్రచార హోరు, పెళ్లి ఊరేగింపుల్లో కేరళ చెండా ప్రదర్శన ఉండాల్సిందే. చివరకు చిన్న పిల్లల పుట్టిన రోజులకు సైతం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ప్రదర్శనకు దూరం, సమయాన్ని బట్టి రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకూ వసూలు చేస్తున్నారు. కేరళలో చెండా మేళం తరహాలోనే తంబోళా మేళానికి కూడా ఆదరణ పెరుగుతోంది. దీంతో స్థానిక కళాకారులు ఈ కళను సైతం నేర్చుకుని రాణిస్తున్నారు.
మా ప్రదర్శన ప్రత్యేకం
వివిధ రకాల ఊరేగింపుల్లో మా ప్రదర్శన ప్రత్యేకంగా నిలుస్తోంది. వీక్షించేందుకు వచ్చే వారిలో ఎక్కువ మంది మా ప్రదర్శన తిలకిస్తారు. ఇటీవలి కాలంలో మా చెండా మేళానికి డిమాండ్ పెరుగుతోంది. – కోటి, చెండా మేళం కళాకారుడు
త్వరలో కాంతారా ప్రదర్శన
మొదట తారసాలు, తరువాత తీన్‌మార్ వాయించే వాళ్లం. ఇప్పుడు కేరళ చెండా, తంబోళం మేళాలు ప్రదర్శిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల కొద్దీ ప్రదర్శనలు ఇచ్చాం. ఇటీవల విశాఖ జిల్లాలో కాంతారా కళను ప్రదర్శించాము. కాంతారాను త్వరలో పూర్తి స్థాయి ప్రదర్శనగా మారుస్తాం.
– ఎల్.గురునాథం, ముక్తేశ్వరం, అయినవిల్లి మండలం
Comments
Please login to add a commentAdd a comment