
మాట్లాడుతున్న ఎంవీఎస్ శర్మ. పక్కన కేఎస్ చలం తదితరులు
విశాఖ ప్రజలంటే కూటమి ప్రభుత్వానికి చులకనగా ఉంది
తీర ప్రాంతాన్ని పెట్టుబడిదారులు చేజిక్కించుకుంటున్నారు
ప్రొఫెసర్ చలం, పర్యావరణ ఉద్యమ కార్యకర్త సోహన్,
మాజీ ఎమ్మెల్సీ శర్మ మండిపాటు
డాబాగార్డెన్స్: విశాఖ నగరంలో గజం స్థలం రూ.లక్ష, రూ.లక్షన్నర ఉంటే.. ఎకరా భూమిని 99 పైసలకే ఇవ్వడంలో ఆంతర్యమేంటని యూపీఎస్‌సీ మాజీ ఇన్‌చార్జి చైర్మన్ ప్రొఫెసర్ కేఎస్ చలం, పర్యావరణ ఉద్యమ కార్యకర్త సోహన్ హటంగడి, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖ ప్రజలంటే కూటమి ప్రభుత్వానికి చులకనగా ఉందని, ఇది పెద్ద భూ కుంభకోణమని, దీని వెనుక అధికార పార్టీ నాయకుడి హస్తం ఉందని ఆరోపించారు. ఈ భూముల విషయంపై చంద్రబాబు స్పందించకపోవడం శోచనీయమన్నారు.
విశాఖలో ప్రభుత్వ భూములు, ఆస్తుల బదలాయింపుపై వార్వా నివాస్ ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రొఫెసర్ కేఎస్ చలం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకుని పెట్టుబడిదారులు మన ఆస్తులు, భూములు కొట్టేస్తున్నారని, మనపై పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డిరు. విస్తారంగా ఉన్న రక్షిత అడవుల్ని, తీర ప్రాంతాన్ని కూడా చేజిక్కించుకుంటున్నారని అన్నారు.
టాటా ఏమైనా పేద సంస్థా?
పర్యావరణ కార్యకర్త సోహన్ హటంగడి మాట్లాడుతూ విశాఖకు ప్రాణవాయువు సరఫరా చేసే ప్రాంతాన్ని ఎకరా 99 పైసలు చొప్పున 22 ఎకరాలు టాటా (టీసీఎస్) కంపెనీకి ఇచ్చేయడానికి టాటా ఏమన్నా పేద సంస్థా? అని ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయమని, నగరంలోని పచ్చని ప్రదేశాల్ని కాంక్రీట్ అడవులుగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్‌కే బీచ్ నుంచి హార్బర్ పార్క్ వరకు 14 ఎకరాల్లో లూలు మాల్ పెడితే ఆ ప్రాంతం, పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ట్రాఫిక్‌తోపాటు, కాలుష్యం భయంకరంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తక్షణమే ఉపసంహరించుకోవాలి
మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అని, ప్రజల భూమిని ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాలని సూచించారు. ఉపాధి కల్పిస్తామనే ఉత్తుత్తి హామీలతో విశాఖలో భూముల్ని కార్పొరేట్లకు ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో ఇలాగే భూములు ఇచ్చారని, కానీ ఉద్యోగాలు మాత్రం కల్పించలేదన్నారు. అభివృద్ధి పేరిట భూముల అమ్మకం నగర వినాశనానికే దారి తీస్తుందన్నారు. ఇటువంటి నిర్ణయాల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రజా మద్దతుతో తిప్పి కొడతామని హెచ్చరించారు. వార్వా అధ్యక్షుడు ఎన్.ప్రకాశరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వార్వా ప్రధాన కార్యదర్శి బీబీ గణేష్, నివాస్ అధ్యక్షుడు బి.గురప్ప, ప్రధాన కార్యదర్శి పిట్టా నారాయణమూర్తి, హరి ప్రసాద్, బీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.