మద్యం షాపులు పెరగవ్‌! | New Liquor Shops May Not Increase In Telangana | Sakshi
Sakshi News home page

మద్యం షాపులు పెరగవ్‌!

Published Mon, Aug 16 2021 8:14 AM | Last Updated on Mon, Aug 16 2021 12:46 PM

New Liquor Shops May Not Increase In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వైన్‌షాపుల గడువు మరో మూడు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో కొత్త విధానంపై ఎక్సైజ్‌ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. షాపుల సంఖ్యను పెంచాలా? ప్రస్తుతమున్న ఆయా షాపుల పరిధిని మార్చాలా? దరఖాస్తు ధర ఎలా ఉండాలి? శ్లాబుల్లో మార్పులు చేయాలా? ఇప్పటికే మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో వినియోగదారులపై ఎక్కువ భారం పడకుండా ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా రాబడి ఎలా రాబట్టాలి అనే దానిపై ఎక్సైజ్‌ శాఖ అధికారుల్లో తర్జనభర్జనలు మొదలయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలు (ఏ4 షాపులు) ఉన్నాయి. కొత్త ఎక్సైజ్‌ పాలసీపై ప్రాథమిక చర్చల అనంతరం ఈసారి కూడా పాత సంఖ్యలోనే దుకాణాలను కొనసాగించాలని అధికారులు సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దరఖాస్తు ఫీజు, లైసెన్సు ఫీజు, ఏ4 షాపుల పరిధుల్లో మార్పులు చేసినా, షాపుల సంఖ్యను మాత్రం పెంచవద్దని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం. 2019–21 ఎక్సైజ్‌ పాలసీ ఈ ఏడాది అక్టోబర్‌ 31తో ముగియనుంది.

పరిశీలనలో రెండు అంశాలు
ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ వర్గాలు రెండు అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతమున్న లైసెన్సు ఫీజును కట్టించుకుని మరో ఏడాది పాటు లైసెన్సుల గడువు పొడిగించాలని, లేదంటే కనీసం రెండు లేదా మూడు నెలల పాటు ఎలాంటి ఫీజు లేకుండా పొడిగించాలనే ప్రతిపాదనలపై ఆ శాఖ ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. లేదంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయనే అంశాన్ని కూడా ఆ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 31 తర్వాత రానున్న రెండేళ్ల పాటు రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్‌ పాలసీ వస్తుందా? వాయిదా పడుతుందా అన్నది త్వరలోనే తేలనుంది.

మాకూ న్యాయం చేయండి...
ప్రస్తుతం కరోనా వైరస్‌ గుబులు ఎక్సైజ్‌ శాఖను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి తేవాలా లేక పాత షాపులనే మరికొన్నాళ్లు పొడగించాలా అనే చర్చ జరుగుతోంది. ఐదు నెలల క్రితం రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీల్లో 159 కొత్త బార్‌ షాపులను ప్రభుత్వం నోటిఫై చేసి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 59 బార్లు ఉండగా, ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే బార్లను ఏర్పాటు చేశారని, మిగిలిన వారంతా లైసెన్సులు తీసుకుని ఎప్పుడు బార్లు పెట్టాలన్న దానిపై మీమాంసలో ఉన్నారని తెలుస్తోంది.

ఇందుకు కరోనా వైరస్‌ కారణంగా జరగని వ్యాపారమే కారణమని ఎౖMð్సజ్‌ వర్గాలంటున్నాయి. మరోవైపు కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలోని బార్లు, వైన్‌షాపులు, బీర్, లిక్కర్‌ తయారీ పరిశ్రమలు 2–3 నెలలు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో బార్లు, బీర్‌ తయారీ పరిశ్రమలకు లైసెన్స్‌ ఫీజు, తయారీ గంటల విషయంలో మినహాయింపునిచ్చింది. తద్వారా బార్ల యజమానులు, డిస్టలరీలకు కొంత ఉపశమనం కలిగింది. కానీ 47  రోజుల సంపూర్ణ లాక్‌ డౌన్, కొన్ని రోజుల పాటు మధ్యాహ్నం నుంచి షాపులు మూసేయాల్సి రావడంతో తాము కూడా నష్టపోయామని వైన్‌షాపుల యజమానులంటున్నారు. తమకు కూడా ఈ విషయంలో న్యాయం చేయాలని, శాశ్వత లైసెన్సుదారులకు మినహాయింపు ఇచ్చినట్టే రెండేళ్ల వరకే ఉండే తమకు కూడా ఏదో ఒక రూపంలో ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement