ఎక్సర్‌సైజ్ లేని ‘ఎక్సైజ్'
కర్నూలు:
మద్యం విక్రయాలు ప్రభుత్వ ఖజానాకు రూ.వేల కోట్ల ఆదాయం అందించే వనరుగా మారింది. ఈ వ్యాపారంలో అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు గాను ఈ ఏడాది కొత్తగా 2డీ బార్ కోడింగ్ పద్ధతిని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు మాసాలు గడిచినా ఇప్పటివరకు ఆ విధానం బాలారిష్టాలు దాటలేదు. వ్యాపారులకు ఏడాది కాలపరిమితి అనుమతి ఉంది.
ఇప్పటికే ఆరు నెలలు పూర్తయింది. దీనిపై ఆరు నెలల క్రితమే జిల్లా అధికారులకు మార్గదర్శకాలు అందినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. జిల్లా మొత్తానికి మద్యం విక్రయించే కల్లూరు హంద్రీ ఒడ్డున ఉన్న ఐఎంఎల్ డిపోలో మాత్రం బార్ కోడింగ్ విధానం అమలు చేసే ప్రక్రియ ప్రారంభమైంది.
ఈనెల 15వ తేదీలోపు 2డీ బార్ కోడింగ్ ప్రక్రియ పూర్తి చేసి 1వ తేదీ నుంచి కచ్చితంగా అమలు చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఐఎంఎల్ డిపోలో నాలుగు హార్డ్‌వేర్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఒక ప్రైవేటు కంపెనీ సెల్యులర్ టవర్ కూడా నెలకొల్పారు. 3-జీ యాక్టివేషన్ ప్రాసెస్ జరుగుతుంది.
నెలకు రూ.60 కోట్ల వ్యాపారం
ఐఎంఎల్ డిపో నుంచి నెలకు రూ.60 కోట్లు విలువైన మద్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. సరుకు దిగుమతి చేయాలంటే మొదట డిపో సెక్యూరిటీ గార్డు వద్ద, ఐఎంఎల్ డిపో ఇన్‌చార్జ్ వద్ద బార్ కోడ్ విధానాన్ని వినియోగిస్తారు. అనంతరం బార్ కోడ్ పద్ధతిలోనే బిల్లులు కూడా తనిఖీ చేయాల్సి ఉంటుంది.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని మద్యం సీసాలకు బార్‌కోడ్‌కు సంబంధించి హోలోగ్రామ్ గులాబి రంగులో ఉన్న లేబుల్‌ను వేస్తుండగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఆకుపచ్చ రంగు లేబుళ్లను కేటాయించారు. జూన్ నుంచే కొత్తగా హోలోగ్రామ్ లేబుల్స్‌ను అందిస్తున్నారు. ఈ లేబుల్‌పై ఉండే బార్‌కోడ్ ద్వారా నిర్ణయించిన ధరకే విక్రయించాలి.
అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి కర్నూలు డిపోకు మద్యం వస్తుంది. బార్ కోడ్ వల్ల అమ్మకాల్లో అక్రమాలు పూర్తిగా అరికట్టవచ్చు.
బార్‌కోడ్ ప్రాజెక్టు అమలుకు సహకరించని వ్యాపారులు
ప్రతి మద్యం దుకాణంలో 2డీ స్కానర్, ఇండస్ట్రియల్ కంప్యూటర్, 3-జీ సిమ్, ఫ్లాట్ ఏర్పాటు చేసుకోవాలని ఎక్సైజ్ కమిషనర్ నుంచి గత జూలైలోనే ఆదేశాలు అందాయి. ఈ మేరకు యూఎస్‌ఈ అధికారులు హోలోగ్రామ్ బార్‌కోడ్‌ను(హెచ్‌ఈఏఎల్) పొందుపరిచే విధానంపై స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో పాటు మద్యం వ్యాపారులకు అదేనెలలో అవగాహన అవగాహన కల్పించారు.
అయితే వ్యాపారులు ముందుకు రాకపోవడం వల్ల ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఈ విధానం అమలు జరిగితే కర్నూలు మద్యం డిపోతో పాటు రిటైల్ దుకాణాల్లో విక్రయాలు స్టాక్ వివరాలు హైదరాబాద్ సెంట్రల్ సర్వర్ ద్వారా క్షణాల్లో ఎక్సైజ్ ఉన్నతాధికారులు తెలుసుకునే అవకాశం ఉంటుంది.