మద్యం అమ్మకాల్లో మోసాలకు చెక్ పడనుంది. కచ్చితమైన ధరలకే విక్రయించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దుకాణాల్లో విధిగా బార్‌కోడింగ్ అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు. తొలుత ప్రభుత్వ దుకాణాల్లో అమలు చేసి... తరువాత ప్రైవేటు దుకాణాల్లో విధిగా అమలయ్యేలా ఆదేశాలు జారీ చేశారు.
నరసన్నపేట : మద్యం విక్రయించే దుకాణాల్లో బార్‌కోడింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు జిల్లా ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ మద్యం దుకాణంలో దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ముందుగా దీనిని అమలు చేస్తామని, ప్రవేటు దుకాణాల్లో కూడా త్వరితగతిన దీనిని కచ్చితంగా అమలు చేయాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. షాపుల్లో మద్యం అమ్మకాలను క్రమపద్ధతిలో నిర్వహించి కల్తీని, దొంగ మద్యం అరికట్టాలనేది ప్రభుత్వ ఆలోచన. దీనికి అనుగుణంగా షాపుల్లో కంప్యూటరు, హోలోగ్రాం మెషిన్, ఇతర పరికరాలు సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో బార్ కోడింగ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రయోగాత్మకంగా నరసన్నపేటలోని మద్యం షాపులో బార్ కోడింగ్ విదానాన్ని అమలు చేయగా ఫలితాలు బాగున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా దీనిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
గతేడాది నుంచే ప్రయత్నాలు..
బార్ కోడింగ్ విధానాన్ని గతేడాది నుంచే అమలు చేయాలని ఎక్సైజ్ అధికారులు ప్రయత్నించారు. కంప్యూటర్లకోసం మద్యం వ్యాపారుల నుంచి కొంత మేర డబ్బు కట్టించుకున్నా... కార్యరూపం దాల్చలేదు. ఈ ఏడాది జిల్లాలో ఉన్న 209 మద్యం షాపుల్లోనూ అమలు చేయాలని యంత్రాంగం చూస్తోంది. కొత్త మద్యం పాలసీ ప్రకారం బార్, మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతీ మద్యం సీసాపై ఉన్న హోలోగ్రామ్ స్కాన్ చేసి విక్రయించాల్సి ఉంటుంది. దీంతో తయారీ, విక్రయదారుని వివరాలు కంప్యూటర్లో నిక్షిప్తం అవుతాయి. ఇక్కడి వివరాలు మద్యం డిపోల్లోగల డిస్టలరీస్‌లోని సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో అమ్మకాలు పారదర్శకంగా ఉంటాయని కల్తీని, దొంగ మద్యంను నిరోధించవచ్చని అధికారులు చెబుతున్నారు. అపిట్కో నిర్దేశించిన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే వినియోగించాలనీ, కార్వే సంస్థకు చెందిన కంప్యూటర్లే ఏర్పాటు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇదంతా వ్యయంతో కూడుకున్నదనీ, దీనివల్ల వ్యాపారులు నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వైన్‌డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మద్యం మోసాలకు చెక్!
Published Thu, Aug 13 2015 12:33 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement