
సినీ ఫక్కీలో రూ.2 లక్షలు లూటీ
కశింకోట : కన్నూరుపాలెంలోని ఒక మద్యం దుకాణంలో ఆదివారం రాత్రి సినీ ఫక్కీలో రూ.2 లక్షలు అపహరణకు గురైంది. బాధిత మద్యం విక్రేతలు అందించిన వివరాలివి. కన్నూరుపాలెంలోని వైన్ దుకాణాన్ని ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మూసివేశారు. ఆ సమయంలో మద్యం కోసం స్థానికుడు ఒకరు వచ్చి బలవంతం చేసి దుకాణం తెరిపించాడు. దుకాణంలో బాబ్జీ, వై.పైడిరాజు ఉన్నారు. కస్టమర్‌కు బాబ్జీ మద్యం సీసా అందించగా, పైడిరాజు మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన రూ.2 లక్షల మూడు వేల నగదును ప్యాకెట్‌తో పట్టుకుని నిరీక్షిస్తున్నాడు. ఇంతలో అప్పటికే అక్కడ మద్యం సేవిస్తున్న ఓ వ్యక్తి హఠాత్తుగా పైడిరాజు చేతిలోని నగదు ప్యాకెట్‌ను లాక్కున్నాడు.
అదే తడవుగా దుకాణానికి కాస్త దూరంలో మోటార్‌సైకిల్‌తో సిద్ధంగా ఉన్న మరో గుర్తు తెలియని వ్యక్తితో కలిసి అదేవాహనంపై తాళ్లపాలెం వైపు పరారయ్యాడు. ఈలోగా మద్యం కోసం వచ్చిన వ్యక్తి కూడా నర్సీపట్నం వైపు పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఎస్‌ఐ బి.మధుసూదనరావు, పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఆగంతకులు నగదును తస్కరించినట్టు భావిస్తున్నారు. తాళ్లపాలెం కూడలిలో ఉన్న సీసీ కెమెరాల్లో కూడా ఆగంతకుల వివరాలు నమోదు కాలేదని తెలుస్తోంది. దీనిబట్టి ఎవరో స్థానికుల ప్రోత్సాహంతో దొంగతనానికి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు.