ఒంగోలు టౌన్ : ‘కూలీ నాలీ చేసుకొని జీవిస్త్తున్నాం. నాలుగు రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. మా గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటుకు అధికారులు సిద్ధమయ్యారు. అలా చేస్తే తమ ఇళ్లు గుల్లవుతాయి. మద్యం మత్తులో గొడవలు జరుగుతాయి. మా గ్రామానికి మద్యం దుకాణం వద్దు’ అని సంతనూతలపాడు మండలం మైనంపాడుకు చెందిన పలువురు మహిళలు వేడుకున్నారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జరిగిన ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్‌ను కలిసి వారు సమస్యను విన్నవించారు.
మైనంపాడు గ్రామంలో డైట్ కాలేజీ ఉందని, ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థినులు వస్తుంటారని, మందుబాబులు మద్యం మత్తులో వారిపై అసభ్యంగా ప్రవర్తించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా మండల కేంద్రమైన సంతనూతపాడులో మూడో మద్యం దుకాణం ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకోవాలని పలువురు కోరారు. ఇప్పటికే బస్టాండు సెంటర్‌లో రెండు దుకాణాలు ఉన్నాయని, తాజాగా మరొకటి ఏర్పాటుచేస్తే మద్యం మత్తులో ఎక్కువగా గొడవలు చోటుచేసుకునే ప్రమాదం ఉందన్నారు.
కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు
‘గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఇర్లా రామకృష్ణతో నాకు వివాహమైంది. పెళ్లి సమయంలో ఇస్తామన్న కట్నాన్ని కొంచెం ఆలస్యంగా ఇచ్చాం. ఆ తరువాత అదనపు కట్నం కావాలంటూ నా భర్త, అత్తమామలు, బావ, మరిది, వారి కుటుంబ సభ్యులు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు’ అని సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలేనికి చెందిన ఇర్లా అశ్వని వాపోయింది.
తన భర్త ఇండియన్ నేవీలో పనిచేస్తున్నాడని, ప్రస్తుతం తనకు ఒకటిన్నరేళ్ల వయస్సు కలిగిన పాప ఉందని వివరించింది. కుటుంబ సభ్యులు వేధింపులు ఎక్కువ కావడంతో తాను ఈ ఏడాది జూలై 23వ తేదీ సంతమాగులూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, తమ కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదని వాపోయారు.
ధర్మతోపు భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలి
56సంవత్సరాల నుంచి శ్మశాన వాటికగా ఉపయోగించుకుంటున్న ధర్మతోపు భూమికి అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఒంగోలు నగరపాలక సంస్థలోని ముక్తినూతలపాడు క్రిష్టియన్‌పాలెం, హరిజనవాడలకు చెందిన వారు కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద శ్మశానవాటిక అభివృద్ధికి అధికారులు ముందుకొస్తే పులుసు ప్రకాశం అనే వ్యక్తి ఆ భూమి తాను కొనుగోలు చేశానని డాక్యుమెంట్లు చూపించారన్నారు. ధర్మతోపు స్థలానికి క్రయవిక్రయాలు జరపరాదని, ఆ భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసి శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ నిర్మించాలని కోరారు.
స్థలాలు ఇప్పించాలి
జిల్లాలోని యానాదులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని జిల్లా యానాది యువజన సంఘం కార్యదర్శి యాకసిరి అంజిబాబు కోరారు. గిరిజన తెగకు చెందిన యానాదులు నికరంలేని వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నామన్నారు. ఏళ్లు గడిచినా వారికి గూడు లేకుండా పోతుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని వేడుకున్నారు.
అక్రమంగా వెలుస్తున్న గుడిసెలు
ఒంగోలు నగరంలోని నేతాజీకాలనీలో అక్రమంగా గుడిసెలు వెలుస్తున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. ఏడేళ్ల నుంచి తాము అక్కడ నివసిస్తుంటే కొంతమంది తిరగడానికి వీలులేకుండా రోడ్లపైనే గుడిసెలు వేస్తున్నారన్నారు. ఎస్‌కే మీరావలి, చిరంజీవి, మోహన్ అనే వ్యక్తులు గుడిసెలు వేయిస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.15వేల చొప్పున వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకొని గుడిసెలను తొలగించాలని కోరారు.
చెరువుకట్టను బాగుచేయించాలి
ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని పెల్లూరు గ్రామ చెరువు కాలువ కట్టను బాగు చేయించాలని పలువురు రైతులు కోరారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు పడమర కట్ట తెగిందని, దీంతో నీరు నిలవడం లేదని తెలిపారు. వరి పంట సాగు చేసుకుంటూ జీవనం సాగించే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.
మద్యం దుకాణం వద్దే వద్దు
Published Tue, Sep 9 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM
Advertisement
Advertisement