ఒంగోలు టౌన్ : జిల్లాలో ఇసుకను రీచ్‌ల నుంచి వినియోగదారుల వద్దకు టిప్పర్ల ద్వారా రవాణా చేసేందుకు ధరలు నిర్ణయించినట్లు జాయింట్ కలెక్టర్ కే యాకూబ్‌నాయక్ తెలిపారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్‌లో అధికారులు, టిప్పర్ల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌ల నుంచి ఐదు కిలోమీటర్లలోపు దూరానికి క్యూబిక్ మీటర్‌కు రూ.600 చొప్పున ధర నిర్ణయించినట్లు తెలిపారు.
ఇసుక రీచ్‌ల నుంచి వినియోగదారులకు రవాణా చేసేందుకు 11 టన్నుల కెపాసిటీ కలిగిన టిప్పర్ క్యూబిక్ మీటర్‌కు ఐదు కిలోమీటర్ల వరకు రూ.600, పది కిలోమీటర్ల వరకు రూ.1,000, అదనపు దూరానికి కిలోమీటర్‌కు రూ.80 చొప్పున ధర నిర్ణయించినట్లు వెల్లడించారు. టిప్పర్లు, లారీ యజమానులను ఇసుక రవాణా చేసేందుకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఈ టెండర్లలో టిప్పరు యజమానులు కొంత మంది క్యూబిక్ మీటర్ ఇసుక రావాణాకు 5 కిలోమీటర్లకు రూ.700 , 10 కిలోమీటర్లకు రూ.1,100, అదపు కిలోమీటర్‌కు రూ.90 చొప్పున ఇవ్వాలని కొటేషన్లు వేశారని చెప్పారు.
తక్కువ ధరను కోట్ చేసిన టిప్పరు యజమానులను ఇసుక రవాణా చేసేందుకు అంగీకరించినట్లు వివరించారు. అనుమతి పొందిన వారు సంబంధిత ఇసుక రీచ్‌ల్లో వివరాలు నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ పద్మజ, అడిషనల్ పీడీ తేళ్ల రవికుమార్, గనులశాఖ సహాయ సంచాలకుడు కే సుబ్రహ్మణ్యేశ్వరరావు, నరసింహారెడ్డి, ప్రాంతీయ రవాణాశాఖాధికారి కృష్ణమోహన్ పాల్గొన్నారు.
ఇవిగో ఇసుక రవాణా ధరలు
Published Wed, Nov 19 2014 2:58 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement