
ఒకే రాత్రి మూడు చోరీలు
అమలాపురం టౌన్ : కోనసీమలో ఆదివారం అర్ధరాత్రి వేర్వేరు చోట్ల మూడు చోరీలు జరిగాయి. అమలాపురం పట్టణంలో సాయిబాబా ఆలయంతోపాటు, ఓ మద్యం దుకాణంలో జరిగిన రెండు చోరీల్లో రూ.13.50 లక్షల సొత్తు దోపిడీకి గురైంది. ఈ ఘటనలు సంచలనం కలిగించాయి. అమలాపురం ఎర్రవంతెన సమీపంలో 216 జాతీయ రహదారి పక్కన ఉన్న సాయి షిర్డీ స్వర్ణ మందిరంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు చొరబడి విగ్రహానికి అలంకరించిన రూ.12 లక్షల విలువైన 32 కిలోల వెండి తొడుగులు, వస్తువులను దోచుకుపోయారు. సోమవారం అమలాపురం పట్టణ సీఐ వై.ఆర్.కె.శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ నుంచి క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించాయి. ఆదివారం రాత్రి 9 గంటలకు రోజూలాగే హారతిచ్చి ఆలయం తలపులు మూసి తాళాలు వేశారు.
సోమవారం తెల్లవారుజామున ఆలయం తలుపులు తీసేసరికి ఈశాన్యం వైపు ఉన్న తలుపులకు ఉన్న తాళం కప్ప బద్దలకొట్టి ఉండడాన్ని సిబ్బంది గమనించారు. సాయి విగ్రహం వద్ద 16 కిలోల వెండి సింహ ఆకార తొడుగులు, 14కిలోల వెండితో ఉన్న సాయి పాద పీఠం, మూడు కిలోల నెమలి ఆకార తొడుగులు, ఒక కిలో వెండి జగ్గులు తస్కరణకు గురైనట్టు గుర్తించారు. తలుపుల వద్ద ఇనుపరాడ్ పడి ఉండడంతో దాంతోనే తాళాలు పగలగొట్టినట్టు తెలుస్తోంది. విగ్రహం వద్ద మొత్తం రూ.60 లక్షల విలువైన దాదాపు 90 కిలోల వెండి ఆభరణాలు ఉండగా, దొంగలు 32 కిలోల వెండి వస్తువులనే దొంగిలించారు. సమయం సరిపోకో.. అన్ని వస్తువులు తీసుకెళ్లటం సాధ్యం కాకో.. మిగిలినవి వదిలేసి ఉండవచ్చని భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ 216 జాతీయ రహదారిపై వరకు వచ్చి ఆగిపోయాయి. దీంతో దొంగలు ఏదైనా వాహనంపై వచ్చి చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చేయితిరిగిన నేరస్తులే ఈ చోరీ చేసి ఉంటారని భావిస్తున్నారు. క్రైం పార్టీతో దర్యాప్తు ప్రారంభించారు.
ఉన్నా పనిచేయని సీసీ కెమెరాలు
స్వర్ణసాయి షిర్డీ మందిరం కోనసీమ వ్యాప్తంగా ప్రాచూర్యం పొందింది. అనేక మంది భక్తులు నిత్యం సాయిని దర్శించుకుంటుంటారు. ఆ ఆలయానికి సీసీ కెమెరాల సౌకర్యం కూడా ఉంది. అయితే అవి ప్రస్తుతం పనిచేయడం లేదు. ఇటీవల పట్టణ పోలీసులు జన సందోహం ఎక్కువగా ఉండే దుకాణాలు, ఆలయాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటుచేసుకోవాలని నోటీసులు జారీ చేసినా ఆలయ నిర్వాహకులు అలక్ష్యం వహించారని పట్టణ సీఐ శ్రీనివాస్ అన్నారు.
మద్యం దుకాణంలోనూ చోరీ
అమలాపురం గడియారంస్తంభం సెంటరులోని లక్ష్మి వైన్స్ దుకాణంలోనూ దొంగలు చొరబడి రూ.1.48 లక్షలు దోచుకున్నారు. దుకాణంలోని లోపలి తలుపులను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. క్లూస్‌టీమ్, డాగ్ స్వ్కాడ్ తనిఖీ చేశాయి. దుకాణ యజమాని శేఖర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
కేశవస్వామి ఆలయంలోనూ చోరీ
అయినవిల్లి : ముక్తేశ్వరంలోని కేశవస్వామి ఆలయంలోనూ ఆదివారం రాత్రి చోరి జరిగింది. ఆలయ మేనేజర్ బొక్కా వీరవెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి 11.30 గంటలకు దొంగ ప్రవేశించి తలపు తాళాలు ధ్వంసం చేసి అమ్మవారి మేడలో ఉన్న రోల్డు గోల్డ్ నగలను బంగారు నగలుగా భావించి తీసుకుపోయాడు. ఈలోపు స్థానికం గా ఉంటున్న ఆలయ అర్చకుడు రవిశ ర్మ అలికిడి వినిపించి వచ్చే సరికి దొంగ పారిపోయాడు.అయినవిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.