అమలాపురం టౌన్ :పట్టణంలోని పట్టాభి వీధిలో గల ఒక ఇంట్లో శుక్రవారం పట్టపగలే జరిగిన దోపిడీ సంచలనం సృష్టించింది.ఈ చోరీలో దాదాపు రూ.3లక్షల విలువైన పదిహేనున్నర కాసులకు పైగా బంగారు నగలను దొంగలు ఎత్తుకుపోయారు. రిటైర్డ్ మండల విద్యాశాఖాధికారి సోమేశ్వరశర్మ పట్టాభి వీధిలో నివసిస్తున్నారు. ఆయన కుమారులు ఇద్దరూ ఉద్యోగ రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. కాగా శుక్రవారం అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామంలోని ఓ ఆలయంలో జరుగుతున్న విగ్రహప్రతిష్ఠ కార్యక్రమానికి శర్మ ఉదయమే బయలుదేరి వెళ్లారు. శర్మ గంగలకుర్రు వెళ్లడంతో ఉదయం 11గంటల సమయంలో ఆయన భార్య లక్ష్మీ శారద ఇంటికి తాళం వేసి పక్కనే ఉన్న తమ తోటికోడలు ఇంటికి వెళ్లారు.
ఇదే అదనుగా దొంగలు తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. పడక గదిలో పరుపు కింద దాచిన తాళాలు తీసి ఇనుప బీరువా తెరిచారు. బీరువాలో ఒక స్టీలు బాక్సులో ఉంచిన ఎనిమిదిన్నర కాసుల రెండుపేటల పలకసర్ల గొలుసు, మూడున్నరకాసుల రెండుపేటల గొలుసు, మూడున్నరకాసుల నల్లపూసల దండ అపహరించి పరారయ్యారు. ఇంతలో శర్మ భార్య లక్ష్మీశారద ఇంటికి వచ్చి తలుపులు తెరిచి ఉండడంతో గాబరా పడ్డారు. లోనికి వెళ్లి చూసేసరికి పడక గదిలో ఉన్న బీరువాలోని సామాన్లు మంచంపై చిందరవందరగా పడి ఉండడం కనిపించింది. బీరువాలోని స్టీలు బాక్సులో ఉన్న మొత్తం పదిహేనున్నర కాసుల బంగారు వస్తువులను దొంగలు దోచుకున్నట్టు ఆమె గుర్తించి గగ్గోలు పెట్టారు. సమాచారం తెలుసుకున్న సీఐ వై.ఆర్.కె.శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ నుంచి వచ్చిన క్లూస్ టీం ఆధారాలను సేకరించింది.
సోమేశ్వరశర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమలాపురం డీఎల్పీఓ జేవీఎస్‌ఎస్ శర్మకు సోమేశ్వరశర్మ సోదరుడు. వీరిద్దరూ పక్కపక్క ఇళ్లలో నివాసముంటున్నారు. పట్టపగలే చోరీ జరగడంతో పట్టణవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. చోరీ జరిగిన సమయంలోశర్మ ఇంటినుంచి సుమారు 20 ఏళ్ల యువకుడు బయటకు రావడం తాను చూశానని అదే సందులో నివసిస్తున్న ఓ విద్యార్థి చెప్పడంతో పోలీసులు చురుగ్గా దర్యాప్తు ప్రారంభించారు. వారు ఓ అనుమానిత యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిసింది. చోరీ జరిగిన ప్రదేశంలో ఫిజిక్స్ సబ్జెక్టుకు సంబంధించిన నోటు పుస్తకాన్ని గమనించిన పోలీసులు దీని ఆధారంగా కూడా చోరుడెవరనే విషయమై కూపీ లాగుతున్నారు.
పట్టపగలే చోరీ
Published Sat, May 30 2015 1:43 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement