
చోరీలకు పాల్పడిన అత్త, కూతురు, అల్లుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు చెవి దిద్దులు
ఈ చోరీలు చేసింది ఓ అత్త, కూతురు, అల్లుడు.
తూర్పు గోదావరి, అమలాపురం టౌన్: కారులో వస్తారు.. బంగారు దుకాణాల్లోకి టిప్ టాప్‌గా వెళతారు. నగలు కొనుగోలు ముసుగులో చాకచక్యంగా నగలు నొక్కేస్తారు. అయితే ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందనే సంగతి మాత్రం వారు గుర్తించరు. ఇలా అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది ఓ దొంగల ముఠా.
తీగ లాగితే డొంక కదలినట్టు అమలాపురంలో నాలుగు రోజుల క్రితం ఓ బంగారు దుకాణంలో కొనుగోలుకు వచ్చి బంగారు రూపు దొంగిలించి పట్టుబడడంతో గత ఏడాది వారు చేసిన చోరీ కూడా బయటపడింది. ఈ చోరీలు చేసింది ఓ అత్త, కూతురు, అల్లుడు.
హైదరాబాద్ బేగంపేటలో ప్రకాష్‌నగర్‌కు చెందిన ఆళ్ల అరుణకుమారి (అత్త), తాడి శ్రీదేవి (కూతురు), తాడి శివ దుర్గారావు (అల్లుడు) ఈ చోరీలకు పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. వీరి స్వగ్రామం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి. వీరు కొంత కాలంగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఈనెల 18న అమలాపురంలోని ఓ నగల దుకాణానికి నగల కొనుగోలు కోసం కారులో వచ్చారు. దుకాణంలోకి వచ్చిన అత్త, కూతురు, అల్లుడు ఏవో నగలు చూస్తున్నట్టు...ధరలు అడుగుతున్నట్టు నటిస్తూనే ఓ బంగారు రూపును చాకచక్యంగా కాజేశారు. దీనిని దుకాణ యాజమాని సీసీ కెమెరా ఫుటేజీలో గమనించారు. అనుమానం వచ్చి వారిని తనిఖీ చేయగా చోరీ చేసినట్టు గుర్తించి, ఆ ముగ్గురిని పోలీసులకు అప్పగించారు.
కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఈ ముగ్గురే గత ఏడాది ఏప్రిల్ 22న అమలాపురంలోని మరో నగల దుకాణంలో కొనుగోలు ముసుగులో నగలు కాజేసినట్టు తేలింది. గత ఏడాది చోరీలో వీరు ఆరు జతల బంగారు చెవి దిద్దుల జతలు మాయం చేసినట్లు... ఈనెల 18న జరిగిన చోరీలో ఓ బంగారు రూపు దొంగిలించినట్టు పోలీసులు గుర్తించారు. వీరు అమలాపురంలో సూర్య జ్యూయలర్స్, ఆదినారాయణ జ్యూయలర్స్ దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారని సీఐ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు నగల దుకాణదారుల ఫిర్యాదుల మేరకు అత్త, కూతురు, అల్లుడిపై కేసులు నమోదు చేశారు. వారి నుంచి రూ.1.53 లక్షల విలువైన బంగారు నగలు, వారు వేసుకుని వచ్చిన మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురినీ మంగళవారం అరెస్ట్ చేశారు. వారిని అమలాపురం మొదటి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు మేజిస్ట్రేట్ పవన్‌కుమార్ ముందు హాజరుపరచగా వారికి రిమాండ్ విధించారని సీఐ తెలిపారు.