మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం
Published Mon, Sep 30 2013 2:07 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లాలో మిగిలిపోయిన 34 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి శనివారం గెజిట్ విడుదల చేశారు. జనాభ ప్రాతిపదికన లెసైన్స్ ఫీజు స్లాబ్ ప్రకారం నిర్దేశించి దుకాణాలను కేటాయించనున్నారు. పదివేల జనాభా ఉన్న ప్రాంతంలో రూ. 32.50 లక్షలు, 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతంలో రూ.34 లక్షలు, మూడు లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతంలో రూ.42 లక్షలు స్లాబ్ పద్ధతిన లెసైన్స్ ఫీజును నిర్దేశించారు. జిల్లాలో 32.50 లక్షల లెసైన్స్ ఫీజు ఉన్న దుకాణాలు 17, 34 లక్షలు లెసైన్స్ ఫీజు ఉన్న దుకాణాలు 12, 42 లక్షల లెసైన్స్ ఫీజున్న దుకాణాలు 5 ఉన్నాయి.
ఆసక్తి ఉన్న వారు అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుర్జీత్ సింగ్ తెలిపారు. దరఖాస్తుతో పాటు డిక్లరేషన్ ఫారం-డీ-ఏ1, స్థిర ఆస్తి వివరాల అఫిడవిట్ ఏ2, డిక్లరేషన్ ఫారం-3లో తహశీల్దారు లేదా ఎక్సైజ్ గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేషన్ చేయించి రెండు పాస్‌ఫోర్ట్ సైజు ఫొటోలు జత చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే దరఖాస్తు రుసుం రూ.25 వేలు(డీడీ), లెసైన్స్ ఫీజులో పది శాతం ఈఎండీ కోసం (5 లక్షల వరకు) డీడీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేరుతో చెల్లించాలి. 5వ తేదీ ఉదయం 11 గంటలకు ఎక్సైజ్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు.
Advertisement
Advertisement